ఇక వెళ్లిపోవచ్చు!

ABN , First Publish Date - 2021-09-12T08:01:37+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.... అంటే, మొత్తం అధికార యంత్రాంగానికి బాస్‌! అలాంటి పదవిలో ఉన్న వ్యక్తికి రెండోసారి పొడిగింపు అవకాశం ఉన్నా ఇవ్వలేదు సరికదా.... గతంలో ఎన్నడూ లేని విధంగా, ఏమాత్రం గౌరవ మర్యాదలు పాటించకుండా

ఇక వెళ్లిపోవచ్చు!

  • ఆదిత్యనాథ్‌ దాస్‌కు వీడ్కోలు.. కొత్త సీఎస్‌గా సమీర్‌ శర్మ
  • 20 రోజుల ముందే జీవో జారీ.. ఇది అవమానించడమే!..
  • అధికార వర్గాల్లో విస్మయం


జగన్‌ సర్కారులో తొలి సీఎస్‌గా పని చేసిన ఎల్వీ సుబ్రమణ్యం. తమకు నచ్చి, తాము చెప్పింది చెప్పినట్లు చేసుకుంటూ పోతే... పదవీ కాలం పొడిగింపు, అది ముగిసీ ముగియక ముందే కొత్త పదవులూ కట్టబెడతారు. ఇందుకు ఉదాహరణ... 

నీలం సాహ్ని!


‘నచ్చినా నచ్చకున్నా చెప్పింది చేసి తీరాల్సిందే’ అనే వైఖరికి భిన్నంగా.. ఒకటి రెండు సందర్భాల్లో తన అసంతృప్తి వ్యక్తం చేసినా సరే... అసంబద్ధంగా, అగౌరవంగా సాగనంపుతారు. దీనికి తాజా ఉదాహరణ, 

ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌!


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.... అంటే, మొత్తం అధికార యంత్రాంగానికి బాస్‌! అలాంటి పదవిలో ఉన్న వ్యక్తికి రెండోసారి పొడిగింపు అవకాశం ఉన్నా ఇవ్వలేదు సరికదా.... గతంలో ఎన్నడూ లేని విధంగా, ఏమాత్రం గౌరవ మర్యాదలు పాటించకుండా ‘మీదే ఆలస్యం. ఇక వెళ్లిపోవచ్చు’ అనే సంకేతాలు పంపించారు. చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్‌ పదవీకాలం మరో 20 రోజులు మిగిలి ఉండగానే... కొత్త సీఎ్‌సగా సమీర్‌ శర్మను నియమించారు. శుక్రవారం ఉదయం దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. సీఎస్‌గా ఎవరిని నియమించుకోవాలన్నది పూర్తిగా ముఖ్యమంత్రి ఇష్టం. కానీ... ఆదిత్యనాథ్‌ దాస్‌ విషయంలో సర్కారు వ్యవహరించిన తీరు అధికార వర్గాలను విస్మయపరుస్తోంది. ఆదిత్యనాథ్‌ దాస్‌ పదవీకాలాన్ని గతంలో ఒకసారి 3నెలలపాటు పొడిగించారు. ఆ గడువు నెలాఖరుతో ముగుస్తుంది. మరో 3నెలలు ఆయనను కొనసాగించాలని సీఎం కోరవచ్చు. కేంద్రం అనుమతిస్తుంది కూడా! అంతకు ముందు సీఎ్‌సగా ఉన్న నీలంసాహ్ని పదవీ కాలాన్ని రెండు దఫాలుగా పొడిగించారు.


అంతకుమించి సాధ్యం కాకపోవడంతో ఆమెను ఎస్‌ఈసీ పోస్టులో సగౌరవంగా కూర్చోబెట్టారు. ఆదిత్యనాథ్‌ దాస్‌కు రెండో విడత కొనసాగింపు కోరలేదు సరికదా, పదవీ విరమణకు 20రోజుల ముందే ఆయన స్థానంలో మరొకరిని నియమిస్తూ జీవో జారీ చేశారు. ఇప్పటివరకు వస్తున్న సంప్రదాయం ప్రకారం సీఎస్‌ పదవీ విరమణ రోజున లేదా ఒక్కరోజు ముందుగా మాత్రమే కొత్త సీఎస్‌ నియామకపు ఉత్తర్వులు జారీ అవుతాయి. కొత్త సీఎ్‌సగా ఎవరు ఉండాలో సీఎం ముందుగానే నిర్ణయించుకుంటారు. ఆ మేరకు అధికారులకు కూడా సమాచారం ఉంటుంది. కానీ, జీవో మాత్రం చివరిరోజే ఇస్తారు. అది సర్వీసులో ఉన్న ఆ అధికారికి ఇచ్చే గౌరవం! కానీ ఆదిత్యనాథ్‌ దాస్‌ పదవీకాలం మరో 20 రోజులు ఉండగానే... కొత్త సీఎ్‌సగా సమీర్‌ శర్మను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంటే... అధికారికంగా పదవిలో ఉన్న సీఎస్‌ ఒకరు. ‘అధికారికంగా నియమితులైన’ కొత్త సీఎస్‌ మరొకరు! ఇలా 20రోజుల ముందే జీవో ఇవ్వడమంటే... ‘ఇక వెళ్లిపో’ అని చెప్పడమే అని, ఇది ఒక ఉన్నతాధికారిని అవమానించడమేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇన్ని రోజుల ముందుగా కొత్త సీఎస్‌ నియామకపు ఉత్తర్వు వచ్చినట్లు రాష్ట్ర చరిత్రలోనే లేదని సీనియర్‌ అధికారులు పేర్కొంటున్నారు.


పొడిగింపు అవకాశం ఉన్నా... 

ఆదిత్యనాథ్‌ దాస్‌ పదవీకాలాన్ని మరో విడత పొడిగించవచ్చునని తొలుత భావించారు. కానీ, గత కొద్దికాలంగా ప్రభుత్వ దూకుడు విధానాలతో విభేదిస్తుండటంతో ఆయనకు కొనసాగింపురాదని తేలిపోయింది. ఒకదశలో ఆయనకు తెలియకుండానే ఆయన పేరుతో జీవోలు జారీ అయ్యాయి. కీలకమైన నిర్ణయాల్లో ఆయనతో సంప్రదింపులు కరువయ్యాయి. పలు సందర్భాల్లో ఆయన తీవ్ర మనస్తాపానికి కూడా గురయ్యారని ప్రచారం జరుగుతోంది. సీఎం పేషీ అధికారి ఒకరు దాస్‌ కొనసాగడానికి ఇష్టపడటం లేదు. దాస్‌కు మొదటిసారి కొనసాగింపునిచ్చే ఫైలును కూడా ఆలస్యంగా పంపడం, అందులోనూ పూర్తి వివరాలు పంపకుండా తాత్సారం చేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.


అయినప్పటికీ, ఢిల్లీ పెద్దలు ఉదారస్వభావంతో మూడు నెలలు కొనసాగింపునకు అనుమతించారు. మరో విడత కొనసాగింపునకు ఎలాంటి ప్రతిపాదన వెళ్లకపోవడంతో తనకు పదవీ విరమణ తప్పదని దాస్‌కు అర్థమైంది. దీనికితోడు ఆయన సర్వీసులో ఉండగానే ఢిల్లీ నుంచి సమీర్‌శర్మను తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కేంద్ర సర్వీసులో డైరెక్టర్‌ జనరల్‌ స్థాయిలో ఉన్న సమీర్‌ శర్మను తిరిగి రాష్ట్ర సర్వీసుకు తేవడం సీఎస్‌ చేయడానికే అని స్పష్టంగా అర్థమవుతోంది. దానికి తగ్గట్లుగానే సమీర్‌శర్మ కీలకమైన సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. దీంతో నెలాఖరులో దాస్‌ పదవీ విరమణ, సమీర్‌ శర్మ పదవీ స్వీకారం ఖరారయిపోయాయి. ఆదిత్యనాథ్‌ దాస్‌ పదవీ కాలాన్ని పొడిగించకపోవడం సర్కారు ఇష్టం. కానీ ఆయన పదవీకాలాన్ని ముగించిన తీరుమాత్రం సమంజసంగా లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ అంశం చర్చకు దారితీయడంతో అధికారపక్ష సోషల్‌ మీడియా కొత్తపల్లవి అందుకుంది. దాస్‌కు జలవనరుల శాఖ సలహాదారు పోస్టు ఇస్తారంటూ ప్రచారానికి తెరతీసింది. 


‘పట్టణ పాలన’ నుంచి ప్రభుత్వ పాలనకు

కొత్త సీఎస్‌ సమీర్‌ శర్మ ప్రత్యేకత

రాష్ట్రానికి కొత్త ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సమీర్‌ శర్మకు ఎన్నెన్నో ప్రత్యేకతలున్నాయి. ఆయన ఉమ్మడి  ఏపీ తోపాటు కేంద్ర సర్వీసులో, అంతర్జాతీయంగానూ పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అతిపెద్ద కార్పొరేషన్లుగా పేరొందిన హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ... మూడింటికీ కమిషనర్‌గా పనిచేసిన ఏకైక ఐఏఎస్‌ అధికారి ఆయనే. భారత పర్యాటకాభివృద్ధి కార్పొరేషన్‌ ఎండీగా పనిచేసినప్పుడు రూపొందించిన బ్యాలన్స్‌ స్కోర్‌కార్డ్‌ పద్ధతి వల్ల ఆ సంస్థ ఆదాయం 30శాతం పెరిగింది. ఆయన కేంద్ర సర్వీసుల్లో స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల డీజీగా పనిచేస్తూ తిరిగి ఏపీకి వచ్చారు. కొంతకాలం కంబోడియాలో ఐక్యరాజ్యసమితి హేబిటేట్‌కు కన్సల్టెంట్‌గా కూడా పనిచేశారు. సర్వీసులో ఎక్కువకాలం మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌లోనే పని చేశారు. కమ్యూనిటీ ప్లానింగ్‌లో అమెరికాలో మాస్టర్స్‌, పీహెచ్‌డీ చేసిన సమీర్‌ శర్మ... 37ఏళ్ల సర్వీసులో అనేక హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. దాదాపు ఏడేళ్లుగా కేంద్ర సర్వీసులో ఉన్న ఆయనను ప్రభుత్వం ఇటీవలే రాష్ట్రానికి తీసుకొచ్చి సీఎస్‌గా నియమించింది. సమీర్‌శర్మ అక్టోబరు 1న ఏపీ సీఎస్‌గా సరికొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ ఏడాది నవంబరు 30న ఆయన రిటైర్‌ అవుతారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన సర్వీసును మూడు నెలలు చొప్పున రెండు పర్యాయాలు పొడిగించుకునే అవకాశం ఉంటుంది.

Updated Date - 2021-09-12T08:01:37+05:30 IST