నెల రోజులు లాక్‌డౌన్‌ పెట్టినా ఆగుతుందన్న నమ్మకం లేదు

ABN , First Publish Date - 2021-05-02T08:15:41+05:30 IST

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ చాలా ప్రమాదకరంగా ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు

నెల రోజులు లాక్‌డౌన్‌ పెట్టినా ఆగుతుందన్న నమ్మకం లేదు

లాక్‌డౌన్‌తో ఆర్థిక సంక్షోభం

వ్యాక్సినేషన్‌కు మరో ఏడాది: సజ్జల 

ప్రమాదకరంగా సెకండ్‌ వేవ్‌ 


అమరావతి, మే 1(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ చాలా ప్రమాదకరంగా ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒక నెల రోజులు లాక్‌డౌన్‌ పెడితే కరోనా వ్యాప్తి ఆగిపోతుందని, ఆ తర్వాత తెరవచ్చని చెబుతున్నారన్నారు.  లాక్‌డౌన్‌ విధించినా ఆ తర్వాత కరోనా వ్యాపించదన్న గ్యారెంటీ లేదని కూడా అంటున్నారని, అందువల్ల వైరస్‌ నివారణ చర్యలు జరగాల్సింందేనని సజ్జల పేర్కొన్నారు. కరోనాను ఎదుర్కోవాల్సిందేనని, ఒకటి, రెండు నెలల పాటు నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని గతంలో సీఎం జగన్‌ చెప్పినప్పుడు అందరూ నవ్వారని, ఇప్పుడు దాన్ని ప్రపంచమంతా అంగీకరిస్తోందన్నారు. కరోనాతో ప్రయాణం చేయక తప్పదని, అంతా కట్టేసుకుని ప్రజా వ్యవస్థను బంద్‌ పెట్టడం సాధ్యం కాదని జగన్‌ కూడా చెబుతున్నారన్నారు.


ఈ సంక్షోభం కంటే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలయిపోతే నిరుపేదలకు జీవనం కష్టంగా మారుతుందన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు బయటకు రాకపోతే రూ.2వేలు పెట్టినా కిలో ఆహార ధాన్యాలు దొరకని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కోట్లమంది జనజీవనం స్తంభిస్తే చోటుచేసుకునే మరణాలు కరోనా కంటే ఎక్కువ సంఖ్యలో ఉండే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ పూర్తవడానికి మరో ఏడాది పడుతుందన్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలసికట్టుగా కట్టడి చర్యలు చేపట్టాలన్నారు. కానీ చంద్రబాబు మాత్రం హైదరాబాద్‌లో కూర్చొని మాంత్రికుడిలా క్షుద్రపూజలు చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. 

Updated Date - 2021-05-02T08:15:41+05:30 IST