శబరిమల యాత్ర విషాదం.. ఇద్దరు కర్నూలు వాసుల దుర్మరణం
ABN , First Publish Date - 2021-12-10T01:24:57+05:30 IST
అయ్యప్ప దర్శనానికి బయలుదేరారు. 70 కిలోమీటర్లు వెళ్తే స్వామి సన్నిధికి చేరుకోవచ్చు. అంతలోనే ఘోరం జరిగిపోయింది

కర్నూలు: అయ్యప్ప దర్శనానికి బయలుదేరారు. 70 కిలోమీటర్లు వెళ్తే స్వామి సన్నిధికి చేరుకోవచ్చు. అంతలోనే ఘోరం జరిగిపోయింది. ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు భక్తులు దుర్మరణం చెందారు. ముగ్గురికి గాయాలయ్యాయి. పులివెందులకు చెందిన అయ్యప్పస్వాముల బృందంతో వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు కర్నూలు జిల్లాలకు చెందిన అయ్యప్పస్వాముల వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఆదినారాయణ (44), ఈశ్వర్‌బాబు (38) అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా వారంతా ఎగిరి దూరంగా పడ్డారు. వాహనంలో ఉన్న ముగ్గురు, సుధాకర్‌రెడ్డి, శివప్రసాద్, బాలేశ్వర్‌తో పాటు కింద ఉన్న పుల్లయ్య, జగదీశ్వర్‌రెడ్డి, గోల్డ్ మల్లికార్జున, విష్ణు అలియాస్ కిషోర్, డ్రైవర్ బాస్కర్ సురక్షితంగా బయటపడ్డారు. మరో ముగ్గురు సురేష్, కానిస్టేబుల్ మల్లికార్జున, ప్రేమ్‌కు కాళ్లు విరిగాయి. వీరందరినీ స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆదినారాయణది బుధవారపేట. ప్రభుత్వ వైద్యశాలలోని క్యాంటిన్‌లో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి భార్య సీత, కొడుకు గౌతంరాజు, కూతురు రేఖ ఉన్నారు. ఈ ఘటనలో ఆదినారాయణ చనిపోగా.. ఆయన తమ్ముడు విష్ణు సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే బుధవారపేటలో విషాధచాయలు అలుముకున్నాయి.