120 కోట్లకు ఎసరు!

ABN , First Publish Date - 2021-04-11T09:19:41+05:30 IST

ఆదాయానికి మించి ఖర్చులు చేస్తోన్న వైసీపీ ప్రభుత్వం... అప్పు పుట్టే పరిస్థితి కూడా లేకపోవడంతో అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. ఆర్టీసీలో పనిచేస్తున్న 52వేల మంది సిబ్బంది

120 కోట్లకు ఎసరు!

ఆర్టీసీ సిబ్బంది సొమ్ము చెల్లించని ప్రభుత్వం 

జీతాల నుంచి రికవరీ చేసిన మొత్తం మళ్లింపు 

10 రోజులుగా సీసీఎ్‌సకు జమ చేయని వైనం 

మా సొమ్మూ వాడేస్తారా అని సిబ్బంది ప్రశ్న 

10వేల మందికి ఆగిన లోన్లు, ఎల్‌ఐసీ చెల్లింపు 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఆదాయానికి మించి ఖర్చులు చేస్తోన్న వైసీపీ ప్రభుత్వం... అప్పు పుట్టే పరిస్థితి కూడా లేకపోవడంతో అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. ఆర్టీసీలో పనిచేస్తున్న 52వేల మంది సిబ్బంది జీతాల నుంచి రికవరీ చేసిన సొమ్ము సంస్థ ఖాతాలో వేయకుండా వాడుకుంది. దీంతో ఉగాది లోన్ల కోసం ఎదురుచూస్తున్న పదివేల మందికి పది రోజులైనా నిరాశ తప్పడంలేదు. ‘మా సొమ్ము మాకివ్వకుండా ప్రభుత్వం వాడుకోవడమేంటి’ అంటూ సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏపీఎ్‌సఆర్టీసీ కార్మికులు కొన్ని దశాబ్దాల క్రితం క్రెడిట్‌ కో-అపరేటివ్‌ సొసైటీ(సీసీఎస్‌) ఏర్పాటు చేసుకుని అందులో రూ.వందల కోట్లు పొదుపు చేసుకుంటున్నారు. సీసీఎ్‌సలో సభ్యులైన కార్మికులకు అవసరాల నిమిత్తం లోన్లు ఇస్తూ పిల్లల చదువులు, పెళ్లిళ్లు, పండగల వరకూ ఈ సొసైటీనే ఆదుకుంటోంది.


అతి తక్కువ వడ్డీ కావడంతో ప్రతినెలా వేలాది మంది లోన్ల కోసం దరఖాస్తు చేసుకుంటారు. ఏడాది క్రితం ఆర్టీసీని విలీనం చేయడంతో వీరిని పీటీడీ సిబ్బందిగా పరిగణిస్తూ గత ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లిస్తోంది. ప్రతినెలా సుమారు రూ.258కోట్లు ప్రభుత్వం నుంచి వస్తే అందులో నుంచి సిబ్బందికి జీతాలివ్వడంతో పాటు రూ.120కోట్ల వరకూ రికవరీ చేస్తున్నారు. సీసీఎ్‌సకు రూ.60కోట్లు, పీఎఫ్‌ ఖాతాకు  రూ.50కోట్లు, ఎల్‌ఐసీ తదితరాలకు మరో రూ.10కోట్లు చొప్పున జీతాలు చెల్లించిన రోజే జమ అవుతుంది. దీంతో పర్సనల్‌ లోన్ల కోసం ఎదురుచూసే సిబ్బంది సమస్య తీరుతోంది. అయితే ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడుతున్న వైసీపీ ప్రభుత్వం... పీటీడీ సిబ్బందికి ఒకటి నాటికి జీతాలు చెల్లించలేక పోయింది. 5న జీతాల్చినా అందులో నుంచి కోసేసిన సొమ్ము విడుదల చేయలేదు. ఈ నెలలో ఉగాది పండగతో పాటు పిల్లలకు ఫీజులు చెల్లించాల్సి రావడంతోవేలాది మంది సిబ్బంది సీసీఎస్‌, పీఎఫ్‌ లోన్ల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు.


సుమారు పదివేల మంది వరకూ వాటికోసం ఒకటో తేదీ నుంచి ఎదురు చూస్తున్నా ప్రభుత్వం నుంచి పైసా విడుదల కాలేదు. 13న తెలుగు సంవత్సరాది కాగా, 11న ఆదివారం సెలవు, 12 ఒక్కరోజే అవకాశం ఉంది. దీంతో పండగ సంగతి దేవుడికెరుక పిల్లల ఫీజులు ఎలా చెల్లించాలని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. కొవిడ్‌ ప్రభావంతో బయట అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదని, పరీక్షల సమయం కావడంతో ఫీజుల కోసం ప్రైవేటు విద్యాసంస్థల నుంచి ఒత్తిడి పెరిగిపోతోందని వాపోతున్నారు. సీఎం జగన్‌ స్పందించి తమ జీతాల నుంచి రికవరీ చేసిన సొమ్ము తక్షణమే విడుదల చేసేలా ఆర్థికశాఖకు ఆదేశాలివ్వాలని సిబ్బంది కోరుతున్నారు.

Updated Date - 2021-04-11T09:19:41+05:30 IST