ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పూజలు
ABN , First Publish Date - 2021-12-27T00:50:51+05:30 IST
తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయానికి ఆదివారం ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వచ్చారు.

అంతర్వేది: తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయానికి ఆదివారం ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వచ్చారు. ఆయనకు ఆలయ అధికారులు, వేదపండితులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి చిత్రపటాన్ని ఆయనకు బహూకరించారు. తొలుత ఆదివారం ఉదయం మోహన్ భగవత్ సఖినేటిపల్లి మండలం వీవీమెరక నారాయణరాజుపురం నుంచి భారీ బందోబస్తు నడుమ బయలుదేరి ఆలయానికి విచ్చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు, స్వయంసేవకులు, స్థానిక ప్రజలు ఆయన్ను చూసేందుకు ఆలయం వద్దకు తరలివచ్చారు. ఇరవై నిమిషాల్లో దర్శనం ముగించుకున్న ఆయన తిరుగు ప్రయాణంలో గత ఏడాది దగ్ధమైన స్వామివారి రథాన్ని పరిశీలించారు. అనంతరం పక్కనే షెడ్డులో ఉన్న నూతన రథాన్ని కూడా స్వయంగా ఆయనే లోపలికి వెళ్లి పరిశీలన చేశారు.