విశాఖలో రౌడీ ట్రేడింగ్‌

ABN , First Publish Date - 2021-12-26T08:42:00+05:30 IST

విశాఖలో రౌడీ ట్రేడింగ్‌

విశాఖలో రౌడీ ట్రేడింగ్‌

సీఎం అండతో, విజయసాయి నేతృత్వంలో ముక్క కూడా వదలకుండా కబ్జా చేస్తున్నారు

సముద్రం తప్ప మరేమీ మిగిలేటట్లు లేదు

‘ఎర్ర ముఠా’ వెనుక వైసీపీ: టీడీపీ ధ్వజం


అమరావతి, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): ‘‘విశాఖ నగరంలో వైసీపీ నేతలు రౌడీ ట్రేడింగ్‌ చేస్తున్నారు. సీఎం జగన్‌ అండతో, ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వం లో నేతలు ముక్క కూడా వదిలిపెట్టకుండా భూములను కబ్జా చేసి అమ్ముకొంటున్నారు. నగరానికి రాజధాని రాక ముందే వీరి గుండాయిజం ఆకాశాన్ని అంటింది. రాజధా ని వచ్చి వైసీపీ నేతలు విశాఖలో మకాం వేస్తే స్థానిక ప్రజలు భూములు, ఆస్తులు వదులుకొని పారిపోయే పరిస్థితి వచ్చేలా ఉంది’’ అని టీడీపీ నేత కూన రవికుమార్‌ ఆరోపించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వృద్ధాశ్రమం భూములను కూడా వదిలిపెట్టకుండా కాజేస్తున్నారని, వారి కబ్జాలపాలు కాకుండా విశాఖలో సముద్రం తప్ప మరేమీ మిగిలేలా లేదన్నారు. ‘‘వృద్ధాశ్రమం పెట్టడం కోసం వైఎస్‌ హయాంలో విశాఖ నగరంలో ఎకరం రూ.45 లక్షల చొప్పున పన్నెండున్నర ఎకరాల భూమిని హయగ్రీవ సంస్థకు ఇచ్చారు. ఆ భూ మి ధర ఇప్పుడు ఎకరం రూ.2.50 కోట్లకు చేరింది. ఆ భూమి ఇపుడు వైసీపీ నేతల చేతుల్లోకి మారింది. కొంత భూమిని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రాయించుకొన్నారు. వృద్ధాశ్రమం కోసం ఇచ్చిన భూమి వైసీపీ నేతల చేతుల్లోకి ఎలా వెళ్లింది? వైసీపీ ఎంపీ ఎలా రాయించుకొన్నారు? సీఎం జగన్‌రెడ్డికి తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయా? వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖ ప్రాంతంలో 72 వేల డాక్యుమెంట్లు రిజిష్టర్‌ అయ్యాయు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు పడిపోతే విశాఖ లో మాత్రం వేల సంఖ్యలో జరుగుతున్నాయి. ప్రభుత్వ పెద్దలు, సన్నిహితులైన వైసీపీ నేతలు ఇక్కడ భూములను రిజిష్టర్‌ చేయించుకొన్నారు. ఇందులో అధిక భాగం రౌడీ ట్రేడింగ్‌ కింద జరిగినవే’’ అని ఆరోపించారు. విశాఖలో భూములను కబ్జా చేస్తున్న వైసీపీ నేతలు రాయలసీమలో ఎర్ర చందనం స్మగ్లింగ్‌ మొత్తం తమ ఆధ్వర్యంలోనే నడిపిస్తున్నారని ఆరోపించారు. ‘‘సీమలోని ఎర్ర చందనాన్ని అక్రమంగా నరికి విదేశాలకు తరలించి విక్రయిస్తున్నారని కోర్టులకు ఈడీ నివేదించింది. వైసీపీ ప్రభుత్వంలో స్మగ్లర్లకు రాచబాట పరిచారు. ముఖ్యమంత్రి వీటిపై నోరు మెదపరు’’ అని కూన అన్నారు. 


చేపల కొట్లు పెడతారా?: వనమాడి

సీఎం జగన్‌ రెడ్డి రూ.లక్షల కోట్లు విలువైన పరిశ్రమలను తరిమేసి చేపల కొట్లు పెడుతున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఎద్దేవా చేశారు. ‘‘ఎన్నికల ముందు తాను గెలిస్తే రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం తెస్తానని, ప్రతి జిల్లా కేంద్రాన్ని హైదరాబాద్‌స్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీలు గుప్పించారు. ఇప్పుడు మటన్‌, ఫిష్‌ మార్టులు, చికెన్‌ మార్టులు అంటూ హడావుడి చేస్తున్నారు’’ అని విమర్శించారు. 


అవన్నీ తప్పుడు కేసులు: ఆనందబాబు

అవినీతి కేసుల్లో ముద్దాయిగా ఉన్న సీఎం జగన్‌ రెడ్డి తనపై మరక కనిపించకుండా ఇతరులపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని టీడీపీ ఆరోపించింది. తనపై కేసుల్లో విచారణకు ఏళ్ల తరబడి హాజరు కాకుండా ముఖం చాటేస్తున్న సీఎం.. ఇతరులను మాత్రం అర్ధరాత్రి అరెస్టులు చేసి జైళ్లకు తరలిస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. 

Updated Date - 2021-12-26T08:42:00+05:30 IST