తెలుగుతనానికి నిలువెత్తు దర్పణం రోశయ్య
ABN , First Publish Date - 2021-12-09T09:05:29+05:30 IST
తెలుగుతనానికి నిలువెత్తు దర్పణంగా రోశయ్య జీవించారని,

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
సికింద్రాబాద్/అమీర్‌పేట్, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): తెలుగుతనానికి నిలువెత్తు దర్పణంగా రోశయ్య జీవించారని, నిండు జీవితాన్ని అర్థవంతంగా గడిపారని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు శ్లాఘించారు. ఢిల్లీ నుంచి గురువారం నగరానికి వచ్చిన ఆయన అమీర్‌పేట్‌లోని రోశయ్య నివాసానికి వెళ్లారు. రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రోశయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రోశయ్యను తాను బాగా అభిమానించేవాడినని, తనను కూడా ఆయన బాగా అభిమానించేవారని చెప్పారు.
శాసనమండలిలో ఉన్నా, శాసనసభలో ఉన్నా, మంత్రిగా ఉన్నా, ఏ రంగంలో ఉన్నా ఆయా అంశాలను చక్కగా అధ్యయనం చేసి, వాటిని ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పడం రోశయ్య ప్రత్యేకతగా పేర్కొన్నారు. ఎక్కువ సార్లు ఆర్థిక మంత్రిగా ఉన్న ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఆ రోజుల్లో రాజకీయ విభేదాలు ఉన్నా సన్నిహితంగానే మెలిగేవారమని చెప్పారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటం వల్ల తాను రోశయ్య గతించిన రోజు రాలేకపోయానని చెప్పారు.