ఎమ్మెల్యేలపై జనాగ్రహం
ABN , First Publish Date - 2021-10-20T09:06:12+05:30 IST
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు రెండున్నరేళ్లలో ప్రజా వ్యతిరేకతను బాగా మూటగట్టుకున్నారు. దేశంలోనే అత్యధిక ప్రజాగ్రహం ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులుగా ‘రికార్డు’ సాధించారు. ‘సీ-ఓటర్’ నిర్వహించిన తాజా సర్వేలో

- దేశంలోనే ఏపీలో అత్యధిక వ్యతిరేకత
- సీఎంలలో ఎక్కువ ఆగ్రహం కేసీఆర్‌పైనే
- ఆ తర్వాత యూపీ ముఖ్యమంత్రి యోగి
- ఛత్తీస్‌గఢ్ సీఎంకు ఎక్కువ ఆదరణ
- ఏపీ ఎమ్మెల్యేలపై28.5% వ్యతిరేకత
- సీ-ఓటర్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ/అమరావతి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు రెండున్నరేళ్లలో ప్రజా వ్యతిరేకతను బాగా మూటగట్టుకున్నారు. దేశంలోనే అత్యధిక ప్రజాగ్రహం ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులుగా ‘రికార్డు’ సాధించారు. ‘సీ-ఓటర్’ నిర్వహించిన తాజా సర్వేలో ఈ విషయం స్పష్టమైంది. ‘ఐఏఎన్ఎస్ - సీ ఓటర్ పరిపాలన సూచీ’ పేరిట చేపట్టిన సర్వే ఫలితాలను ఐఏఎన్ఎస్ సంస్థ ప్రకటించింది. దీని ప్రకారం... దేశంలోనే అత్యధిక ప్రజాగ్రహం ఏపీ ఎమ్మెల్యేలపైనే కనిపించింది. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలపై 28.5శాతం మంది ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ తర్వాత ఎమ్మెల్యేలపై ప్రజలు అత్యధిక ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్రాల్లో గోవా రెండోస్థానంలో (24.3 శాతం) ఉంది. ఇక... ఎమ్మెల్యేలు 23.5 శాతం వ్యతిరేకత/ఆగ్రహంతో మూడో స్థానంలో నిలిచారు. ‘సీ-ఓటర్’ ముఖ్యమంత్రులపైనా సర్వే చేసింది. అత్యధిక ప్రజాగ్రహం ఎదుర్కొంటున్న వారిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిస్థానంలో నిలిచారు. ఆయనపై 30.30శాతం మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై 28.1 శాతం వ్యతిరేకతతో రెండో స్థానంలో ఉన్నారు.
ఇక... మూడో స్థానంలో ఉన్న గోవా ముఖ్యమంత్రిపై 27.7 శాతం ప్రజలు ఆగ్రహంతో ఉన్నట్లు సర్వేలో తేలింది. మరోవైపు... ఎమ్మెల్యేలపై అతి తక్కువ ప్రజాగ్రహం ఉన్న రాష్ట్రాల్లో కేరళ, గుజరాత్, మహారాష్ట్రలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. కేరళలో ఎమ్మెల్యేలపై కేవలం 6.8శాతం, గుజరాత్లో 7.4శాతం, మహారాష్ట్రలో 7.9శాతం మాత్రమే ఆగ్రహం కనిపించింది. అతి తక్కువ వ్యతిరేకత ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో... ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, ఒడిసా ముఖ్యమంత్రులు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భగెల్‌పై 6శాతం మంది మాత్రమే వ్యతిరేకత ప్రదర్శించారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ పై 10.10, ఒడిసా సీఎం నవీన్‌పట్నాయక్‌పై 10.4శాతం ప్రజలు మాత్రమే ఆగ్రహంతో ఉన్నట్లు సర్వేలో తేలింది.
కేటీఆర్‌ను సీఎం చేయాలి: యశ్వంత్ దేశ్‌ముఖ్
‘‘తెలంగాణ సీఎంపై అత్యంత ఎక్కువ ఆగ్రహం వ్యక్తమైంది. సర్వేలో పాల్గొన్నవారిలో సీఎం కేసీఆర్ పట్ల 30.3 శాతం మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్పు కోరుకుంటున్నారు. కేసీఆర్‌పై అత్యంత వ్యతిరేకత ఉండడమే కాకుండా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం పనితీరుపై మంచి రేటింగ్ ఉన్న రీత్యా రాష్ట్రంలోకి బీజేపీ ప్రవేశించడానికి మార్గం ఉంది. కేసీఆర్ కుమారుడు, మంత్రి కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేయడానికి ఇదే మంచి సమయం లేదంటే పరిస్థితి చేయి దాటిపోతుంది’’ అని సీ-ఓటర్ వ్యవస్థాపకుడు యశ్వంత్ దేశ్‌ముఖ్ విశ్లేషించారు. సీఈవో తరహాలో పనిచేసే ముఖ్యమంత్రులకు ప్రజాదరణ లభిస్తోందని, మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నప్పటికీ ప్రజల్లో అధ్యక్ష తరహా వ్యవస్థకు ఆదరణ ఎక్కువగా ఉందని చెప్పారు.