మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలి: నారాయణ
ABN , First Publish Date - 2021-12-27T01:25:14+05:30 IST
కేంద్ర ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే మహిళల వివాహ వయస్సు 21 సంవత్సరాలకు పెంచడం కాకుండా 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని

తిరుపతి: కేంద్ర ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే మహిళల వివాహ వయస్సు 21 సంవత్సరాలకు పెంచడం కాకుండా 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. ఆడపిల్లలు వారి ఇష్టప్రకారం వివాహం చేసుకోనివ్వకుండా కార్పొరేట్ కంపెనీలకు లేబర్ అందించే దిశగా ప్రధాని మోదీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని విమర్శించారు. పబ్లిక్ రంగ సంస్థలన్నింటినీ మూడు కంపెనీలకు అప్పగిస్తున్నారని విమర్శించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం నానా జిమ్మిక్కులు చేస్తున్నారని, అయితే త్వరలో జరగనున్న ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం తప్పదన్నారు. దేశంలో బీజేపీ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా వామపక్ష, లౌకికవాద శక్తులన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొస్తామన్నారు. కోయంబత్తూరులో వచ్చే నెలలో జరిగే సీపీఐ జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయమై చర్చించి భవిష్యత్తు ప్రణాళిక రూపొందిస్తామని నారాయణ తెలిపారు.