సీమ ఎత్తిపోతలతో ‘ప్రకాశం’ ఎడారే!

ABN , First Publish Date - 2021-07-12T07:57:14+05:30 IST

రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల ప్రకాశం జిల్లా ఏడారి అవుతుందని ఆ జిల్లాకు చెందిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తంచేశారు.

సీమ ఎత్తిపోతలతో   ‘ప్రకాశం’ ఎడారే!

మా జిల్లా గొంతు కోయొద్దు

సీఎంకు ఆ జిల్లా టీడీపీ ఎమ్మెల్యేల లేఖ

సాగు, తాగుకు మాకు సాగర్‌ నీరే ఆధారం

సత్వరం వెలిగొండను పూర్తి చేయాలి

సీఎం జగన్‌కు ఆ జిల్లా టీడీపీ ఎమ్మెల్యేల లేఖ


ఒంగోలు, జూలై 11 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల ప్రకాశం జిల్లా ఏడారి అవుతుందని ఆ జిల్లాకు చెందిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తంచేశారు. శ్రీశైలం జలాశయం వద్ద  తెలంగాణ ప్రాజెక్టులు కడుతోందని, ఇప్పుడు మన రాష్ట్రంలో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుతో కరువు జిల్లా గొంతు కోయవద్దని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు పర్చూరు, అద్దంకి, కొండపి ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్‌, డోలా బాలవీరాంజనేయస్వామి ఆదివారం ఆయనకు బహిరంగ లేఖ రాశారు. ప్రకాశం జిల్లాలో సాగు, తాగుకు నాగార్జునసాగర్‌ నీరు, భూగర్భ జలాలే ప్రధాన ఆధారమని వారు గుర్తుచేశారు. గత 15 సంవత్సరాల్లో మూడేళ్లు మాత్రమే సాధారణ వర్షపాతం ఉందని.. మిగతా పన్నెండేళ్లూ కరువు బారిన పడ్డామని తెలిపారు. శ్రీశైలం నిండి సాగర్‌కు నీరువస్తేనే తమ జిల్లా ప్రజల గొంతు తడుస్తుందని, పొలాలకు నీరు పారుతుందని.. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీశైలం నిండకుండా మీరు, వాళ్లు ప్రాజెక్టులు కట్టుకుంటే తమ జిల్లా పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. గుంటూరు చానల్‌ను దగ్గుబాడు వరకు పొడిగించడంతోపాటు, సత్వరం వెలిగొండను పూర్తి చేసి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని సీఎంను కోరారు.

Updated Date - 2021-07-12T07:57:14+05:30 IST