రవిచంద్ర, శశిభూషణ్‌లకు ముఖ్య కార్యదర్శులుగా పదోన్నతి

ABN , First Publish Date - 2021-02-06T09:39:25+05:30 IST

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించి.. బదిలీ చేసింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

రవిచంద్ర, శశిభూషణ్‌లకు ముఖ్య కార్యదర్శులుగా పదోన్నతి

సునీత, వాణీమోహన్‌లకు కూడా..: ప్రభుత్వం ఉత్తర్వులు

అమరావతి, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించి.. బదిలీ చేసింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఎం.రవిచంద్ర, శశిభూషణ్‌ కుమార్‌, కె.సునీత, వాణీమోహన్‌కు ముఖ్య కార్యదర్శులుగా ప్రమోషన్లు లభించాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. వైద్య ఆరోగ్య శాఖలో కొవిడ్‌-19 నిర్వహణ, వ్యాక్సిన్‌ విభాగం కార్యదర్శిగా ఉన్న రవిచంద్ర, జీఏడీలో సర్వీసెస్‌, హెచ్‌ఆర్‌ఎం కార్యదర్శిగా ఉన్న శశిభూషణ్‌, సాంఘిక సంక్షేమ కార్యదర్శి సునీత.. అవే శాఖల్లో ముఖ్య కార్యదర్శులుగా కొనసాగుతారు. సహకార శాఖ కమిషనర్‌ వాణీమోహన్‌ను దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీచేశారు. ఆమె పురావస్తు శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. పాడిపరిశ్రమాభివృద్ధి ఎండీ అహ్మద్‌బాబుకు సహకార శాఖ కమిషనర్‌, రిజిస్ర్టార్‌, ఆప్కో ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎక్స్‌అఫీషియో కార్యదర్శి డాక్టర్‌ అర్జా శ్రీకాంత్‌ను స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ఎండీ పోస్టు నుంచి తప్పించి, రవాణా, రోడ్లు భవనాల శాఖ(రైల్వే ప్రాజెక్టుల కోఆర్డినేషన్‌)కు ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. స్కిల్‌ డెవల్‌పమెంట్‌, ట్రైనింగ్‌ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మికి ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.


10న శాఖాధిపతుల సమావేశం

సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ అధ్యక్షతన 10న శాఖాధిపతుల సమావేశం నిర్వహించనున్నారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఈ సమావేశం జరగనుండగా, వివిధ సంక్షేమ పథకాలు, ఇతరత్రా అంశాలపై చర్చిస్తారని తెలిసింది.

Updated Date - 2021-02-06T09:39:25+05:30 IST