రేషన్‌ డోర్‌ డెలివరీపై కోర్టుకు డీలర్లు

ABN , First Publish Date - 2021-03-22T09:20:43+05:30 IST

రేషన్‌ డోర్‌ డెలివరీ వల్ల తమకు కలిగిన నష్టంపై కోర్టును ఆశ్రయించాలని రేషన్‌ డీలర్లు నిర్ణయించారు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గం చూపకుండా నేరుగా డోర్‌

రేషన్‌ డోర్‌ డెలివరీపై కోర్టుకు డీలర్లు

డీలర్ల సంఘం నిర్ణయం.. బెజవాడలో భేటీ

ఈ విధానంతో ఆదాయం కోల్పోయాం

జాతీయ ఆహార భద్రత చట్టానికి విరుద్ధం

29 వేల కుటుంబాల పరిస్థితి తలకిందులు 

ప్రత్యామ్నాయ మార్గం చూపాలని డిమాండ్‌ 


అమరావతి, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): రేషన్‌ డోర్‌ డెలివరీ వల్ల తమకు కలిగిన నష్టంపై కోర్టును ఆశ్రయించాలని రేషన్‌ డీలర్లు నిర్ణయించారు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గం చూపకుండా నేరుగా డోర్‌ డెలివరీ విధానం ప్రవేశపెట్టడం వల్ల నాన్‌-పీడీఎస్‌ ఆదాయం కోల్పోయామని, ఇది చట్ట విరుద్ధమని, దీనిపై కోర్టును ఆశ్రయించనున్నామని వారు వెల్లడించారు. ఆదివారం విజయవాడలో రాష్ట్ర రేషన్‌ డీలర్ల సమాఖ్య అధ్యక్షుడు దివి లీలామాధవరావు, తెలంగాణ డీలర్ల సంఘం అధ్యక్షుడు, ఇతర ప్రతినిధులు కందుల బాపూజీ, కామిరెడ్డి నాని సమావేశం నిర్వహించారు. డోర్‌ డెలివరీ విధానం అమల్లోకి వచ్చాక డీలర్లకు జరుగుతున్న నష్టాలపై చర్చించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ... తమ సమస్యలపై చర్చించడానికి త్వరలోనే మరో సమావేశం నిర్వహించి ఆందోళనకు దిగుతామని తెలిపారు.


జాతీయ ఆహార భద్రత చట్టం డీలర్లకు వృత్తి భద్రత కల్పిస్తోందన్నారు. రాయితీ సరుకులే కాకుండా, ఇతరత్రా సరుకులు కూడా అమ్ముకోవడం ద్వారా కుటుంబాలను పోషించుకోవాలని ఆ చట్టంలో స్పష్టంగా ఉందన్నారు. ప్రభుత్వం డోర్‌ డెలివరీ విధానం ప్రవేశపెట్టడం వల్ల రేషన్‌ షాపులకు కార్డుదారులు రాకపోవడంతో డీలర్ల ఇతర ఆదాయం (నాన్‌-పీడీఎస్‌) ఒక్కసారిగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 29 వేల డీలర్ల కుటుంబాల జీవనం అగమ్యగోచరంగా మారిందన్నారు. చట్టంలో నాన్‌-పీడీఎస్‌ ఆదాయం పొందవచ్చని ఉన్నందున దానిపై  కోర్టును ఆశ్రయించనున్నట్లు  తెలిపారు. డోర్‌ డెలివరీకి తాము వ్యతిరేకం కాదని, తమకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గం చూపాలని డిమాండ్‌ చేశారు. ఏపీ బాటలోనే పలు రాష్ర్టాలు డోర్‌ డెలివరీ హామీలు ఇస్తున్నందున అఖిల భారత డీలర్ల సంఘంతో కూడా చర్చించి ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.


డోర్‌ డెలివరీ ప్రారంభమయ్యాక తమను స్టాకిస్టులుగా గుర్తిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇంతవరకు ఉత్తర్వులు ఇవ్వలేదని చెప్పారు. ప్రభుత్వం నుంచి డీలర్లకు రూ.180 కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. వాహనాల ద్వారా డోర్‌ డెలివరీ చేస్తున్నా అనేక చోట్ల స్థానిక అధికారులు డీలర్లపై ఒత్తిడి తెచ్చి షాపుల ద్వారానే పంపిణీ చేయిస్తున్నారని ఆరోపించారు. డీలర్లతో పంపిణీ చేయించకుండా  ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. రేషన్‌ డోర్‌ డెలివరీ విధానం తమ జీవన పరిస్థితులను ఒక్కసారిగా తలకిందులు చేసిందని, దీనిపై పోరాటం తప్పదని డీలర్లు హెచ్చరించారు. 

Updated Date - 2021-03-22T09:20:43+05:30 IST