నేడు సుప్రీం ముందుకు రఘురామరాజు కేసు

ABN , First Publish Date - 2021-05-21T09:42:17+05:30 IST

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్టు, తదనంతర పరిణామాలపై సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యాహ్నం కీలక విచారణ జరపనుంది

నేడు సుప్రీం ముందుకు రఘురామరాజు కేసు

కోర్టుకు చేరిన ఆర్మీ ఆస్పత్రి నివేదిక

ఎంపీ బెయిల్‌పై ప్రభుత్వ అఫిడవిట్‌ విచారణపై న్యాయవర్గాల్లో ఉత్కంఠ 


న్యూఢిల్లీ, మే 20 (ఆంధ్రజ్యోతి): నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్టు, తదనంతర పరిణామాలపై సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యాహ్నం కీలక విచారణ జరపనుంది. మధ్యాహ్నం 12 గంటలప్రాంతంలో జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ బి.ఆర్‌. గవాయిలతో కూడిన ధర్మాసనం ఎదుట కేసు జాబితాలో 25 నంబర్‌ ఐటమ్‌ గా ఈ కేసు విచారణకు రానుంది. రాజద్రోహం, తదితర కేసులను మోపి సీఐడీ అరెస్టు చేసిన రఘురామ కృష్ణం రాజుకు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేసి తమకు నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఈనెల 17వ తేదీన ఆదేశించిన విషయం తెలిసిందే. వైద్యపరీక్షలకు సంబంధించి ఆర్మీ ఆస్పత్రి వైద్యులు రూపొందించిన నివేదిక... తెలంగాణ హైకోర్టు ద్వారా గురువారం సుప్రీంకోర్టుకు చేరింది. మరోవైపు... తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ రఘురామకృష్ణం రాజు వేసిన ఎస్‌ఎల్‌పీకి (స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌) కౌంటర్‌ గా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌ కూడా కోర్టు పరిశీలనలో ఉంది. మొత్తం ఉదంతంలో వైద్య పరీక్షల నివేదిక, ఆయనపై మోపిన సెక్షన్లు కీలక పాత్ర పోషించనున్నాయని న్యాయనిపుణులు అంటున్నారు.

Updated Date - 2021-05-21T09:42:17+05:30 IST