సీఎం నన్నొక్కడినే అడిగితే.. రాజీనామా చేయను

ABN , First Publish Date - 2021-03-24T10:03:10+05:30 IST

‘ప్రత్యేక హోదా సాధించడం కోసం మా ముఖ్యమంత్రి నన్ను మాత్రమే రాజీనామా చేయాలంటే చేయను. మా వైసీపీ ఎంపీలంతా రాజీనామా చేస్తే, నేనూ సిద్ధమే. నేనొక్కడినే రాజీనామా మాత్రం చేయను.

సీఎం నన్నొక్కడినే అడిగితే.. రాజీనామా చేయను

మా ఎంపీలంతా చేస్తే నేనూ సిద్ధం

హోదాపై రఘురామరాజు స్పష్టీకరణ


న్యూఢిల్లీ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ‘ప్రత్యేక హోదా సాధించడం కోసం మా ముఖ్యమంత్రి నన్ను మాత్రమే రాజీనామా చేయాలంటే చేయను. మా వైసీపీ ఎంపీలంతా రాజీనామా చేస్తే, నేనూ సిద్ధమే. నేనొక్కడినే రాజీనామా మాత్రం చేయను. ఎందుకంటే నేను నాన్‌రెడ్డి, నాన్‌ క్రిస్టియన్‌ను గనుక తొలుత నన్నే ఏసేస్తారు‘ అని వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా సాధిస్తామని ప్రజలకు వైసీపీ మాటిచ్చిందని.. ప్రజలు నమ్మి గెలిపించారని.. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట తప్పామని అన్నారు. ‘మా నినాదం మాట తప్పం-మా విధానం మాట తప్పడం‘ అని ఎద్దేవాచేశారు. రాజధానిలో  కొంప కట్టుకున్నానంటూ జగన్‌ ఎన్నికల ముందు ప్రజలను నమ్మించారని,  కానీ అధికారంలోకి వచ్చాక ఎందుకో దక్షిణాఫ్రికా గుర్తొచ్చి.. మాట మార్చారని విమర్శించారు.


‘భగవంతుడు మనకు న్యాయం చేశాడు.. మనకంటే వారి(బీజేపీ)కి మరీ ఎక్కువ సీట్లిచ్చి న్యాయం చేశాడు. అందువల్ల మన అవసరం ఇప్పుడు వారికి ఉండదు. కనుక ప్రత్యేక హోదా ఇవ్వాలని చివరిదాకా అడుగుతూ...నే ఉందాం. అంతకన్నా మనమేమీ చేయలేం’ అని ముఖ్యమంత్రి జగన్‌ గతంలో అన్న మాటలను వ్యంగ్యధోరణిలో గుర్తు చేశారు. తెలంగాణలో ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మతవిద్వేషాలను రగిల్చే విధంగా ప్రవర్తించడం మంచిదికాదని, ఆయన తీరుపై కేంద్ర డీవోపీటీ శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేస్తానన్నారు. చంద్రబాబుపై పెట్టిన అసైన్డ్‌ భూముల కేసులో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తున్నట్లు తనకు తెలిసిందని రఘురామరాజు అన్నారు. తన పై కూడా సుప్రీంకు వెళ్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని.. తనకూ సరదాగా ఉంటుందని వ్యాఖ్యానించారు. నూతన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నియామకానికి సంబంధించి రాష్ట్రప్రభుత్వం సిఫారసు చేసిన ముగ్గురు పేర్లలో మాజీ కమిషనర్‌ జస్టిస్‌ కనకరాజ్‌ పేరులేకపోవడం చాలా అన్యాయం.. దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. 78 ఏళ్ల వయసులో ఆయన్ను హడావుడిగా నియమించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఎందుకు విస్మరిస్తోందని ప్రశ్నించారు. 


రఘురామరాజు రాజీనామా చేయాలి: ఎంపీ రెడ్డప్ప

వైసీపీ ఎంపీ రఘురామరాజు తక్షణమే తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని అదే పార్టీకి చెందిన చిత్తూరు ఎంపీ రెడ్డప్ప డిమాండ్‌ చేశారు. ఆయన ప్రతిరోజూ అసత్య ఆరోపణలతో ప్రజలను మభ్యపెడుతున్నారని మంగళవారం ఢిల్లీలో ఆరోపించారు. బ్యాంకులకు రూ.900 కోట్లు ఎగనామం పెట్టిన చరిత్ర ఆయనదని.. సీబీఐకి పట్టుబడకుండా ఢిల్లీలో దాక్కున్నాడని విమర్శించారు. ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఏపీ పరువు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-03-24T10:03:10+05:30 IST