అప్పులతోనే పాలిస్తామంటే ప్రభుత్వానికి మనుగడ ఉండదు

ABN , First Publish Date - 2021-08-20T07:50:30+05:30 IST

ప్రభుత్వ చేతకాని విధానాలతో రాష్ట్రం అప్పుల ఊబిలో నిండా కూరుకుపోతోందని వైసీపీ ఎంపీ కె.రఘురామకృష్ణరాజు విమర్శించారు.

అప్పులతోనే పాలిస్తామంటే  ప్రభుత్వానికి మనుగడ ఉండదు

కక్ష సాధింపులతో పెట్టుబడులు రావడంలేదు: రఘురామ 

న్యూఢిల్లీ, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ చేతకాని విధానాలతో రాష్ట్రం అప్పుల ఊబిలో నిండా కూరుకుపోతోందని వైసీపీ ఎంపీ కె.రఘురామకృష్ణరాజు విమర్శించారు. ప్రస్తుతం ఏపీలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొందని, అప్పులు కూడా పుట్టని పరిస్థితికి దిగజారిపోయిందన్నారు. అయినా అప్పులతోనే పరిపాలిస్తామనుకుంటే ప్రభుత్వానికి మనుగడ ఉండదని, ఎక్కువ రోజులు నడవలేదని హెచ్చరించారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కుప్పలు తెప్పలుగా తెస్తున్న అప్పులను ప్రశ్నిస్తే, కేంద్రం అప్పులు చేయట్లేదా అని పాలకులు ఎదురుదాడికి దిగడం ఎంతవరకు సమంజసమన్నారు. కేంద్ర పథకాల కోసం వచ్చిన నిధులను ఇతర పద్దుల కింద కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారని ఆరోపించారు.


రాష్ట్రంలో అస్తవ్యస్త పరిస్థితులు, రాజకీయ కక్ష సాధింపులకు భయపడి పెట్టుబడులు రావడంలేదని, ఉన్న పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతున్నాయన్నారు. వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే అమరరాజా కంపెనీయే ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను తట్టుకోలేక వెళ్లిపోతోందని, ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరొస్తారని ప్రశ్నించారు. నెల్లూరులో వేణుగోపాలస్వామి దేవాలయానికి చెందిన వంద ఎకరాల భూమిని లీజుకు తీసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, గుడి భూములు లాక్కోవడం సమంజసం కాదన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వృక్షాలను నరికి రోడ్లు వేశామని ప్రభుత్వం చెబుతున్నా ఎన్టీజీ తప్పుపట్టిందని గుర్తుచేశారు. జగన్‌ బెయిల్‌ రద్దు కేసులో 25న తుది తీర్పు వెలువడనుందని, ఆ రోజు ఏమవుతుందోనని ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారని రఘురామరాజు పేర్కొన్నారు.

Updated Date - 2021-08-20T07:50:30+05:30 IST