ఈ నెల 25న ఏంజరుగుతుందో చూద్దాం..: రఘురామ
ABN , First Publish Date - 2021-08-16T20:58:44+05:30 IST
వైసీపీ నేతలు సంస్కారం నేర్చుకోవాలని, పదాలను జాగ్రత్తగా వాడాలని ఎంపీ రఘురామ సూచించారు.
న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై హైదరాబాద్ సీబీఐ కోర్టులో వాదనలు ముగిసాయి. తీర్పును ఈనెల 25వ తేదీకి వాయిదా వేసింది. దీనిపై స్పందించిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు సోమవారం మాట్లాడుతూ ఈ నెల 25న ఏంజరుగుతుందో చూద్దామన్నారు. వైసీపీ నేతలు సంస్కారం నేర్చుకోవాలని, పదాలను జాగ్రత్తగా వాడాలని సూచించారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని చక్కగా అమలు చేస్తున్నామని సీఎం అన్నారని, మరి మద్య నిషేధం ఎక్కడ అమలవుతుందో చెప్పాలన్నారు. మద్యంపై ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతూనే ఉందన్నారు. రాష్ట్రం అధోగతిపాలవుతుందని...అప్పుచేయొద్దని చెబితే రాష్ట్రాభివృద్ధిని అడ్డుకున్నట్టా? అని ప్రశ్నించారు. ఒకప్పుడు ఏపీ అంటే అమరావతి, పోలవరం అనేవారని, ఇప్పుడు ఏపీ అంటే అప్పుచేసి పప్పుకూడని అంటున్నారని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.
జగనన్న విద్యాకానుక పథకమే కాకుండా టీచర్ల కొరతపై కూడా దృష్టి పెట్టాలని రఘురామ సూచించారు. రాష్టంలో కేవలం 30 నుండి 32 శాతం మాత్రమే వాక్సినేషన్ ప్రక్రియ జరిగిందన్నారు. ఒక్కరోజు 10 లక్షల టీకాలు పేరు మీద హడావుడి చేశారని ఎద్దేవా చేశారు. ఏపీలో కరోనా మళ్లీ విజృంభిస్తోందని, పాఠశాలల ప్రారంభంపై సీఎం ఆలోచన చేయాలన్నారు. పథకాలకు సీఎం తండ్రిపేరు, ఆయన సొంత పేరు తప్ప ఇతరులు లేరా? అని ప్రశ్నించారు. పథకాలకు సీఎం సొంత పేర్లు పెట్టుకుంటే ప్రజలలో ఏహ్యభావం కలుగుతుందన్న పవన్ కల్యాణ్ అభిప్రాయంపై ముఖ్యమంత్రి ఆలోచించాలని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.