రచ్చ.. రచ్చ!
ABN , First Publish Date - 2021-10-21T08:11:59+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా ‘రచ్చ’ కొనసాగింది. ‘మేం ఎప్పుడూ ఇలా బూతులు మాట్లాడలేదు’ అని వైసీపీ అధినాయకుడు చెప్పగా... ఆ పార్టీ నేతల నోట యథేచ్ఛగా బూతుల దండకం వినిపించింది.

- దాడులు.. బూతులు.. అరెస్టులు
- దాడులకు సర్కారు పెద్దల పరోక్ష సమర్థన
- విధ్వంసంలో పాల్గొన్న అవినాశ్ అనుచరులు
- సీసీ కెమెరాలకు చిక్కిన వైసీపీ కార్పొరేటర్
- దాడి ఘటనలపై ఒక్కరినీ అరెస్టు చేయని వైనం
- బెయిలబుల్ సెక్షన్ల కిందే కేసులు నమోదు
- టీడీపీ నేతలపై మాత్రం బలమైన సెక్షన్లు
- అనుమానితుడిని పట్టుకుని అప్పగిస్తే
- లోకేశ్ సహా నేతలపై హత్యాయత్నం కేసు
- ఎస్సీ ఎస్టీ కేసు కూడా.. రాస్తారోకోపైనా కేసు
రాష్ట్రవ్యాప్తంగా ‘రచ్చ’ కొనసాగింది. ‘మేం ఎప్పుడూ ఇలా బూతులు మాట్లాడలేదు’ అని వైసీపీ అధినాయకుడు చెప్పగా... ఆ పార్టీ నేతల నోట యథేచ్ఛగా బూతుల దండకం వినిపించింది. ‘నన్ను తిట్టే బూతులు తట్టుకోలేక బీపీ పెరిగిన అభిమానులు రియాక్షన్ చూపించారు’ అంటూ జరిగిన దాడులను ముఖ్యమంత్రి జగన్ సమర్థించుకొచ్చారు. ఇకపై బూతులు తిడితే ‘వెంటనే రియాక్షన్’ ఉంటుందని, వైసీపీ కుటుంబ సభ్యుల ప్రతిస్పందనకు చంద్రబాబే బాధ్యత వహించాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ‘వైసీపీ సభ్యులు ఆవేశపడి దాడి చేశారు. అందులో తప్పేముంది?’ అని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ప్రశ్నించారు. రాజకీయ విమర్శలూ, ప్రతి విమర్శలు ఎలా ఉన్నప్పటికీ... చట్టం కూడా తనపని తాను చేయలేదు. దాడులు జరిగి 24 గంటలు గడిచినా... ఈ కేసుల్లో ఒక్కరినీ అరెస్టు చేయలేదు. కానీ... రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, ముఖ్యమంత్రిని పరుష పదజాలంతో దూషించారని చెబుతూ టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని బుధవారం రాత్రి హైడ్రామా మధ్య అరెస్టు చేశారు.
రాస్తారోకో చేశారంటూ టీడీపీ నేతలపై కేసు పెట్టారు. రిజర్వు ఇన్స్పెక్టర్పై దాడి చేశారంటూ టీడీపీ నేతలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంతోపాటు కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కానీ... టీడీపీ కార్యాలయంపై దాడి, సిబ్బందిని గాయపరిచిన ఘటనపై మాత్రం ‘బెయిలబుల్’ సెక్షన్ల కింద కేసు పెట్టారు. రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో... బుధవారం ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతల గృహ నిర్బంధాలు, అరెస్టులు కొనసాగించారు. వైసీపీ పోటీ నిరసనలు, ప్రదర్శనలకు మాత్రం అనుమతించారు. ‘పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేస్తే రియాక్షన్ ఎలా ఉంటుందో మనం చూశాం’ అని అంటూనే... రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ఇక... టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిలో విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి దేవినేని అవినాశ్ అనుచరులు ఉన్నట్లు సీసీ టీవీ ఫుటేజ్ సాక్షిగా స్పష్టమైంది. దాడిలో విజయవాడ కార్పొరేటర్ అరవ సత్యం తదితరులు పాల్గొన్నారు. వైసీపీ దాడులకు నిరసనగా గురువారం ఉదయం 8 గంటల నుంచి 36 గంటలపాటు దీక్ష చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై రాష్ట్రపతికి, ప్రధానికి, కేంద్ర హోంమంత్రికి లేఖలు రాశారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. దాడులపై సీబీఐతో విచారణ జరిపించాలని... తమకు, తమ కార్యాలయాలకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు.