సవాంగ్ సారూ... ఇదేమి తీరు....

ABN , First Publish Date - 2021-10-21T00:41:51+05:30 IST

ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కార్యాలయాల పైన, పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి నివాసంపై వైసీపీ వర్గాల దాడుల నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ సవాంగ్ స్పందించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సవాంగ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ పట్టాభి వాడిన లాంగ్వేజ్‌ గతంలో ఎప్పుడూ వినలేదని చెప్పడం విడ్డూరంగా ఉందని....

సవాంగ్ సారూ... ఇదేమి తీరు....

హైదరాబాద్: ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కార్యాలయాల పైన, పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి నివాసంపై వైసీపీ వర్గాల దాడుల నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ సవాంగ్ స్పందించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సవాంగ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ పట్టాభి వాడిన లాంగ్వేజ్‌ గతంలో ఎప్పుడూ వినలేదని చెప్పడం విడ్డూరంగా ఉందని టీడీపీ శ్రేణులు, సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అసలు తెలుగు భాషను అంత లోతుగా అర్థం చేసుకునేంత పరిజ్ఞానం డీజీపీ సవాంగ్‌కి ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. ఆయనకు నిజంగా తెలుగు భాషపై అంత పట్టు, నైపుణ్యం ఉంటే... గతంలో టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి ప్రస్తుత సీఎం జగన్ విపక్షంలో ఉన్నప్పుడు, నేటి వైసీపీ నేతలు, మంత్రులు రాయడానికి కూడా వీల్లేనంతగా ప్రయోగించిన అసభ్యకరమైన పచ్చి పదజాలం అభ్యంతరకరంగా అనిపించలేదా?... అని నిలదీస్తున్నారు. 


ముఖ్యంగా కొడాలి నాని, ద్వారంపూడి, అనిల్, రోజా తదితరులు ఎలాంటి భాషను వాడారో... డీజీపీ తెలుసుకోవాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆ వీడియోలన్నీ నేటికీ సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయని.... తాజాగా వైసీపీ దాడుల నేపథ్యంలో ఆ వీడియోలన్నీ మళ్లీ సోషల్ మీడియాలోను, వాట్సాప్ గ్రూపుల్లోనూ వైరల్ అవుతున్నాయని.... సవాంగ్ అవి సరిగ్గా చూస్తే ఎవరి భాష తప్పో... ఎవరి భాష ఓప్పో అర్థమవుతుందని చెబుతున్నారు. అదీగాక, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, నిష్పక్షపాతంగా వ్యవహరించవలసిన ఐపీఎస్ అధికారి సవాంగ్.... దాడి పరిణామాలపై దర్యాప్తు పూర్తి కాకుండానే పక్షపాత ధోరణితో అధికార పార్టీ పక్షాన మాట్లాడటం సబబు కాదని పలువురు ఆయనకు హితవు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ ఎథిక్స్‌ పాటించాలని... ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని విపక్షానికి మాత్రమే సూచించిన సవాంగ్.... అదే మాట అధికార పక్షాన్ని ఉద్దేశించి చెప్పగలరా? అనే ప్రశ్న కూడా తలెత్తింది.


ఇక, మంగళవారం నాటి దాడుల సమయంలో డీజీపీకి కాల్ చేసినప్పటికీ ఆయన లిఫ్ట్ చెయ్యలేదని టీడీపీ అధినేత చెప్పిన సంగతి తెలిసిందే.... దీనిపై సవాంగ్ స్పందిస్తూ నిన్న తనకు వాట్సప్‌ కాల్‌ వచ్చిందని, అప్పుడు పరేడ్‌ గ్రౌండ్‌లో ఉన్నానని... ఎవరు మాట్లాడుతున్నది స్పష్టంగా లేదని సుదీర్ఘ వివరణ ఇచ్చారు. దీని పైన కూడా విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత నెంబర్ కూడా డీజీపీ ఫోన్‌లో సేవ్ చేసి లేదా? ప్రతిపక్ష నేత భద్రత కూడా రాష్ట్ర పోలీస్ పరిధిలోని ప్రధానమైన అంశం కాదా?... అంత ముఖ్యమైన నెంబర్ నుంచి కాల్ వస్తే కచ్చితంగా ఫోన్‌లో పేరు కనిపిస్తుందని, అయినా గుర్తించలేకపోయారా? అనే ప్రశ్నలను టీడీపీ శ్రేణులు లేవనెత్తుతున్నాయి. మొత్తంగా ఈ పరిణామంలో డీజీపీ రాష్ట్ర ప్రజల దృష్టిలో జీరో అయిపోయారనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.Updated Date - 2021-10-21T00:41:51+05:30 IST