చిక్కుడు.. సెంచరీ.. ఏవైనా కిలో రూ.40పైనే!

ABN , First Publish Date - 2021-12-31T08:22:48+05:30 IST

చిక్కుడు.. సెంచరీ.. ఏవైనా కిలో రూ.40పైనే!

చిక్కుడు.. సెంచరీ.. ఏవైనా కిలో రూ.40పైనే!

  • మండుతున్న కూరగాయలు
  • ఆకు కూరలూ ప్రియం


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఒకటీ, రెండు రకాలు తప్ప, ఏ రకమైనా కిలో రూ.40కు తక్కువేమీ లేవు. అన్నీ రూ.50పైనే పలుకుతున్నాయి. క్యారెట్‌, బీట్రూట్‌, కాకర వంటివి కిలో రూ.80 ఉంటే, క్యాప్సికం, గణుపు చిక్కుడు ఏకంగా రూ.100దాకా అమ్ముతున్నారు. దీంతో కిలో కూరగాయలు కొనే వారు కూడా అరకిలో, పావుకిలోతోనే సరిపెట్టుకుంటున్నారు. ధరల పెరుగుదలతో పెట్టుబడులు పెరిగి, ఎక్కువ ధరకు అమ్ముడుపోక.. బేరాల్లేవని కొంత మంది రిటైల్‌ వ్యాపారులు కూరగాయల అమ్మకాలే నిలిపివేస్తున్నారు. తోపుడు బండ్లపై కూరగాయలు అమ్ముకునే వారి సంఖ్య తగ్గిపోతోంది. బహిరంగ మార్కెట్లలో కూరగాయలు ధరలు రెట్టింపు కావడంతో సామాన్యులు సతమతమవుతున్నారు. రైతుబజార్లలో ధరలు కాస్త తక్కువగా ఉంటున్నా.. అన్ని రకాలు అంత నాణ్యతగా ఉండటం లేదని వినియోగదారులు పెదవివిరుస్తున్నారు.


పైగా రైతుబజార్లు పట్టణాలకే పరిమితం కాగా, గ్రామీణ ప్రాంతాల్లో రిటైల్‌ మార్కెట్లలో కూరగాయలు ధరలు మరీ ఎక్కువగా చెప్తున్నారని కొనుగోలుదారులు వాపోతున్నారు. వాస్తవంగా నవంబరులో కురిసిన అధిక వర్షాలకు రాయలసీమలో టమోట, ఉల్లి పంటలు దెబ్బతిన్నాయి. కోస్తాలో పండించే కూరగాయల పంటలు కూడా కొంత దెబ్బతిన్నాయి. పక్క రాష్ట్రాల్లోనూ పంటలు దెబ్బతిన్నాయి. దీంతో ఉత్పత్తి తగ్గి, ధరలు పెరిగినా.. హోల్‌సేల్‌ రేటుకు, రిటైల్‌ రేటుకు కిలోకి రూ.20దాకా వ్యత్యాసం ఉంటోంది. రిటైల్‌ మార్కెట్‌లో నెల క్రితం కిలో టమాటా రూ.20లోపు ఉండగా, ఇప్పుడు రూ.60కి ఎగబాకింది. నాణ్యమైన టమాటా కిలో రూ.80దాకా పలుకుతోంది. సంక్రాంతి సీజన్‌లో విరివిగా కాపు కాసే చిక్కుడు కాయలు సెంచరీ కొట్టేశాయి.  గణుపు చిక్కుడు రిటైల్‌గా రూ.100దాకా అమ్ముతుండగా, కాస్త మంగున్న కాయలు కిలో రూ.80చెప్తున్నారు. దొండ, దోస కిలో రూ.40నుంచి రూ.60, బెండ, వంగ, క్యాబేజీ రూ.50, కాకర, బీరకాయలు రూ.60, పచ్చిమిర్చి రకాన్ని బట్టి రూ.60నుంచి రూ.80దాకా అమ్ముతున్నారు. చివరికి కాలీఫ్లవర్‌ ఒకటి రూ.25 నుంచి 30కి అమ్ముతున్నారు. ఆకుకూరల ధరలు కూడా ప్రియంగానే ఉన్నాయి. క్యారెట్‌ కిలో రూ.80, బీట్రూట్‌ రూ.70, క్యాప్సికం రూ.90, బంగాళాదుంపలు కిలో రూ.40దాకా పలుకుతున్నాయి. ఉల్లి ఆరుదలపాయ కిలో రూ.55, కర్నూలు కొత్త పాయ ఇంటి ముందుకు తెచ్చి రూ.100కు 3 కిలోలు ఇస్తున్నారు.  రైతుబజార్లలో కర్నూలు ఉల్లి కిలో రూ.30, మహారాష్ట్ర రకం రూ.40 ఉంది.

Updated Date - 2021-12-31T08:22:48+05:30 IST