అరాచకాలపై ‘ప్రజా ఆగ్రహం’

ABN , First Publish Date - 2021-12-28T08:49:06+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ అరాచక, నిరంకుశ విధానాలను వ్యతిరేకిస్తూ బీజేపీ ‘ప్రజా ఆగ్రహ’ సభ నిర్వహిస్తోంది.

అరాచకాలపై ‘ప్రజా ఆగ్రహం’

  • జగన్‌ ప్రజా వ్యతిరేక పాలనపై నేడు బీజేపీ సభ
  • వైసీపీ సర్కార్‌ నిరంకుశ విధానాలను ఎండగడతాం: జయప్రకాశ్‌


అమరావతి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ అరాచక, నిరంకుశ విధానాలను వ్యతిరేకిస్తూ బీజేపీ ‘ప్రజా ఆగ్రహ’ సభ నిర్వహిస్తోంది. మంగళవారం విజయవాడలో ఈ సభ నిర్వహించనున్నట్టు బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా ఇన్‌చార్జి, జాతీయ లేబర్‌ బోర్డు చైౖర్మన్‌ వల్లూరు జయప్రకాశ్‌ నారాయణ తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే రాష్ట్రాన్ని దోచుకోవడం మొదలైందని విమర్శించారు. భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రివర్స్‌ పాలన చేస్తూ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా దాడులు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని రైతుల త్యాగాలను అపహాస్యం చేయడం, పోలవరం ప్రాజెక్టును గాలికి వదిలేయడం, కేంద్ర పథకాలకు స్టిక్కర్లు వేసుకోవడం తప్ప ఒక్క పరిశ్రమ అయినా తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. యువత ఉద్యోగాల కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్నారన్నారు. సీపీఎ్‌సపై అవగాహన లేదని మడమతిప్పి, ఓటీఎస్‌ కట్టాల్సిందేనంటూ పేద ప్రజల్ని దోచుకొంటున్న వైసీపీ అరాచక పాలన గురించి ప్రజలకు వివరించేందుకు ప్రజా ఆగ్రహ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 


పరిపాలన స్వభావాన్ని అర్థం చేసుకోలేని వ్యక్తులకు అధికారం వస్తే రాష్ట్రం ఎలాంటి దుస్థితికి చేరుతుందో ఏపీలోని ప్రస్తుత పరిస్థితి చక్కటి ఉదాహరణ అని అభివర్ణించారు. రాజకీయ స్వలాభం కోసం కుటుంబ పార్టీలు విచ్చలవిడిగా అప్పులు చేస్తూ ఏపీని డిఫాల్టర్‌గా చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాకు వెళ్లడమనేది ప్రజలకు ఉన్న ఆప్షన్‌ మాత్రమేనని, ఆహ్లాదాన్ని పంచే రంగంపై జగన్‌ ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తున్న దాడులతో థియేటర్లు మూతపడి, అసంఘటిత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని మండిపడ్డారు. పెట్రోలు, డీజిల్‌పై నరేంద్ర మోదీ ప్రభుత్వం పది రూపాయలు తగ్గిస్తే, కనీసం రూపాయి కూడా తగ్గించబోనంటూ వాహనదారులను పిండేస్తున్న జగన్‌ ప్రభుత్వ తీరును ఎండగడతామన్నారు. రాష్ట్రంలో పేరుకు పోతున్న అప్పులు, రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, ఉద్యోగుల ఆందోళన, అన్ని వర్గాలపై దాడులు,  పన్నుల బాదుడు, జెన్‌ కో దివాలా, రాజ్యాంగ అధికరణల అతిక్రమణ,  ప్రభుత్వ ఆస్తుల తనఖా, భవిష్యత్తు ఆదాయాన్ని సైతం ఎస్ర్కో చేయడం, హిందూ ఆలయాలపై దాడుల వరకూ రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ప్రజలకు బీజేపీ జాతీయ, రాష్ట్ర నేతలు వివరిస్తారని చెప్పారు. 

Updated Date - 2021-12-28T08:49:06+05:30 IST