ఎస్‌ఈసీ కార్యాలయం వద్ద నిరసన

ABN , First Publish Date - 2021-11-09T07:56:07+05:30 IST

రాష్ట్రంలోని 13 మున్సిపాలిటీల ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణల గడువు సోమవారం మధ్యాహ్నంతో మగిసింది.

ఎస్‌ఈసీ కార్యాలయం వద్ద నిరసన

రాష్ట్రంలోని 13 మున్సిపాలిటీల ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణల గడువు సోమవారం మధ్యాహ్నంతో మగిసింది. కానీ అర్ధరాత్రి వరకు బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను మాత్రం ఎన్నికల అధికారులు పూర్తిగా విడుదల కాలేదు. దీనిపై తెలుగుదేశం పార్టీ ఆందోళనకు దిగింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ పి.అశోక్‌బాబు, నాయకులు గొట్టిపాటి రామకృష్ణ, చెన్నుపాటి ఉషారాణి తదితరులు విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి చేరుకున్నారు. జాబితా ప్రకటనకు ఒకటి, రెండు గంటలు ఆలస్యమవడం సహజమని, ఐదారు గంటలు ఆలస్యం ఎందుకవుతోందని ప్రశ్నించారు. ఎస్‌ఈసీ కార్యాలయంలో అధికారులెవరూ లేకపోవడంతో అక్కడున్న సిబ్బందికి వినతిపత్రాలు అందజేశారు. పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాలను ప్రకటించేవరకు కదిలే ప్రసక్తి లేదని భీష్మించుకుని కూర్చున్నారు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఏడు మున్సిపాలిటీల్లోని జాబితాలను ప్రకటించడంతో టీడీపీ నేతలు శాంతించారు. ‘నెల్లూరు మున్సిపాలిటీలో 8వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మా పార్టీ అభ్యర్థి మహేంద్ర ఉపసంహరణ పత్రంపై సంతకం చేయకున్నా దాన్ని తొలగించారు. కుప్పం, నెల్లూరు మున్సిపాలిటీల్లో మా పార్టీ అభ్యర్థులు గెలిచే వార్డుల్లోనూ ప్రలోభాలను ఎరవేసి ఏకగ్రీవం చేశారు’ అని అశోక్‌బాబు ధ్వజమెత్తారు.

Updated Date - 2021-11-09T07:56:07+05:30 IST