పరుగు ఆపిన ప్రాజెక్టులు

ABN , First Publish Date - 2021-05-30T08:09:37+05:30 IST

రాష్ట్ర జీవనాడి పోలవరం పనుల్లో ఎన్నెన్నో మెరుపులు! గోదావరి జలాలతో సరిదీటుగా పరుగులు పెట్టిన పనులు! కాంక్రీట్‌ వేయడంలో ప్రపంచంలోనే ఒక రికార్డు! బాహుబలిని తలపించే భారీ క్రేన్లు, అధునాతన మెషనరీతో ప్రాజెక్టు ప్రాంతంలో నిత్య

పరుగు ఆపిన ప్రాజెక్టులు

(అమరావతి- ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర జీవనాడి పోలవరం పనుల్లో ఎన్నెన్నో మెరుపులు! గోదావరి జలాలతో సరిదీటుగా పరుగులు పెట్టిన పనులు! కాంక్రీట్‌ వేయడంలో ప్రపంచంలోనే ఒక రికార్డు! బాహుబలిని తలపించే భారీ క్రేన్లు, అధునాతన మెషనరీతో ప్రాజెక్టు ప్రాంతంలో నిత్య యంత్రధ్వనులు.. వేలాదిమంది కార్మికశక్తుల కోలాహాలం! ఇప్పుడవన్నీ ‘రివర్స్‌’ అయ్యాయి. రివర్స్‌ టెండర్‌ పేరిట కాంట్రాక్టు సంస్థను బదలాయించడంతో, పనుల్లో జాప్యం పెరిగింది. జాతీయ ప్రాజెక్టుగా పోలవరం బాధ్యత పూర్తిగా కేంద్రానిదే..కమీషన్ల కోసమే చంద్రబాబు నిర్మాణ పనులు చేస్తున్నారు.. అంచనాలు బాగా పెంచి చూపిస్తున్నారు.. అని  ప్రతిపక్షంలో ఉండగా ప్రతిరోజూ జగన్‌ దుమ్మెత్తిపోశారు. కానీ అధికారంలోకి వచ్చాక ఏం చేశారని పరిశీలిస్తే.. కాంట్రాక్టు సంస్థను మార్చి సరిపుచ్చారు. అదే సమయంలో ‘అంచనాల’పై నాడు చేసిన వ్యా ఖ్యలు ఒకరకంగా ప్రభుత్వం మెడకు చుట్టుకొన్నాయి. పోలవరం సాగు నీటి ప్రాజెక్టు 2017-18 అంచనావ్యయం 55,656,87 కోట్లకు కేంద్ర జలసంఘం పరిధిలోని సాంకేతిక సలహా మండలి ఆమోదించగా.. దాన్ని ఇప్పుడు ఆర్థిక శాఖ పరిధిలోని పునఃనిర్థారిత కమిటీ 28,172.21 కోట్లకు కుదించింది. 


చేస్తానన్న న్యాయమేదీ?

‘‘ప్రాజెక్టుల నిర్మాణమంటే నదికి అడ్డంగా రాతికట్టడం నిర్మించడం కాదు. భూనిర్వాసితులకు సహాయ పునరావాసాన్ని కల్పించమూ ముఖ్యమే’’.. ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ అన్న మాటలివీ. కానీ, పోలవరం నిర్వాసితులకు సహాయ పునరావాస కార్యక్రమాలను చేపట్టేందుకు ఆయన ప్రభుత్వం ప్రాధాన్యమివ్వడం లేదని గణాంకాలే చెబుతున్నాయి. మరోవైపు, ప్రభుత్వం కొత్తగా చేపట్టిన రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకం, వైఎ్‌సఆర్‌  పల్నాడు ప్రాంత కరువు నివారణ పథకం, ఉత్తరాంధ్ర నీటి పారుదల ప్రాజెక్టు, ఏపీ గోదావరి-కృష్ణా ఉప్పునీటి శుద్ధి, మంచినీటి సరఫరా పథకాలకు అప్పులు పుట్టడం లేదు. వీటిని పూర్తిచేయాలంటే రూ.74,850 కోట్లు అవసరం. పైకి చెప్పకున్నా వ్యయంలో సింహభాగం అప్పుల రూపంలోనే తెచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏమైనా ఈ పథకాల్లో ఏదీ శ్రీకారం చుట్టుకోలేదు. 


అన్నీ వాయిదాలే..

రెండేళ్ల క్రితమే పూర్తి అయిన ప్రాధాన్య ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు సైతం వెనక్కు జరుగుతున్నాయి. నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీలను ఈ ఏడాది జనవరిలోనే ప్రారంభించాలి. కానీ, జూలైకు వాయిదా వేశారు.  అలాగే, అవుకు టన్నెల్‌-2ను ఆగస్టుకు, పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్‌-2ను వచ్చేఏడాది మార్చికి వాయిదా వేశారు. 


కూలిన రైతురథం

గత ప్రభుత్వాలు కోట్లు వెచ్చించి, రైతులకు రాయితీ పరికరాలు అందిస్తే, జగన్‌ సర్కారు రెండేళ్లపాలనలో వ్యవసాయ యాంత్రీకరణ ఊసే ఎత్తడం లేదు. చివరకు కేంద్రం 40 శాతం రాయితీపై యంత్రాలను ఇవ్వడానికి సిద్ధంగాఉన్నా.. రైతులకు అందించలేకపోతోంది. పైగా.. గత ప్రభుత్వం రూ.2.5లక్షల సబ్సిడీతో 13వేలుదాకా ట్రాక్టర్లు పంపిణీ చేసిన ‘రైతురథం’ పథకాన్ని రద్దుచేసింది. నిజానికి, యాంత్రీకరణపై ఫోకస్‌ పెట్టాల్సిన అవసరంఉందని 2020 జూలై 7న జారీచేసిన జీవోలో ప్రభుత్వమే చెప్పుకొంది. వ్యవసాయ యంత్రాల బ్యాంకులు పెడతామని, హైటెక్‌, అధిక సామర్థ్యం కలిగిన యంత్రపరికరాలు అందుబాటులోకి తెస్తామనీ ప్రకటించారు. ఏడాదిన్నరగా రాయితీ పరికరాలివ్వకపోగా, అద్దెయంత్రాలనూ అవసరంమేర అందుబాటులోకి తీసుకురాకపోయారు. 


మూగజీవాలకూ మొండిచేయి!

కరువు ప్రాంతాల్లో పశుపోషణ కూడా భారమై, రైతులు ఇబ్బందులు పడటాన్ని గుర్తించి గత ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెట్టింది. వైసీపీ ప్రభుత్వం వీటిని పూర్తిగా నిర్వీర్యం చేసింది.  ఉపాధి హామీ నిధులతో గోకులం, మినీ గోకులం పేరుతో  డెయిరీ యూనిట్లను గత ప్రభుత్వం చేపడితే.. కొత్తగా దేశీయ ఆవుల పెంపకం ప్రాజెక్టు ఏర్పాటుకు వైసీపీ ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చినా, ఇంకా అమలులోకి వచ్చిన దాఖలా లేదు. 

Updated Date - 2021-05-30T08:09:37+05:30 IST