ప్రాజెక్టులు అప్పగింతపై సందిగ్ధం

ABN , First Publish Date - 2021-10-14T08:27:39+05:30 IST

ప్రాజెక్టులు అప్పగింతపై సందిగ్ధం

ప్రాజెక్టులు అప్పగింతపై సందిగ్ధం

గురువారం నాటికి అప్పగించాలన్న బోర్డులు

ఇవ్వాలా, వద్దా? అన్నదానిపై తెలంగాణ కమిటీ

15 రోజుల్లో నివేదిక అందించాలని కేసీఆర్‌ ఆదేశం

నేడు తెలంగాణ ప్రాజెక్టుల అప్పగింతపై సందేహం

తెలంగాణ ఇచ్చాకే చూద్దామనే భావనలో ఏపీ 


అమరావతి/హైదరాబాద్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): కృష్ణా, గోదావరి నదులపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు నిర్మించిన ప్రాజెక్టులు బోర్డుల పరిధిలోకి అప్పగించడంపై సందిగ్ధం నెలకొంది. ఈ ప్రాజెక్టులను గురువారం నాటికి అప్పగించాలని గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులు తెలుగు రాష్ట్రాలను ఆదేశించాయి. అయితే ప్రాజెక్టులు అప్పగించాలా? వద్దా? అన్నదానిపై అధ్యయనం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. దీంతో బోర్డులు విధించిన గడువు గురువారం నాటికి తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు అప్పగిస్తుందా అన్నది సందిగ్ధంగా మారింది. మరోవైపు ఏపీ కూడా గురువారం ప్రాజెక్టులు అప్పగిస్తూ జీవో జారీ చేస్తామని ప్రకటించినప్పటికీ... తెలంగాణ ఇచ్చాకే చూద్దామనే భావనలో ఉన్నట్టు ప్రచారం  జరుగుతోంది. ఈ నెల 11, 12 తేదీల్లో జీఆర్‌ఎంబీ, కేఆర్‌ఎంబీ సమావేశాలు జరిగాయి. గోదావరిపై పెద్దవాగు ప్రాజెక్టును బోర్డు పరిధిలోకి చేర్చాలని నిర్ణయించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ప్రధాన కాలువలను విద్యుత్కేంద్రాలతో సహా తీసుకోవాలని తీర్మానించింది. ప్రభుత్వంతో మాట్లాడి నిర్ణయాన్ని తెలియజేస్తామని తెలంగాణ అఽధికారులు వెల్లడించారు. ఏపీ మాత్రం తీర్మానం మేరకు ప్రాజెక్టులను, సిబ్బందిని అప్పగిస్తూ ఉత్తర్వు జారీ చేస్తామని చెప్పింది. 


ఈఎన్‌సీ నేతృత్వంలో తెలంగాణ కమిటీ

కృష్ణా, గోదావరిపై ఉన్న ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించాలా.. వద్దా? అన్నదానిపై అధ్యయనం చేసి, 15 రోజుల్లోగా నివేదిక అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ సి.మురళీధర్‌రావు నేతృత్వంలో సాంకేతిక, న్యాయనిపుణులతో కమిటీ వే శారు. బోర్డులకు అప్పగించడం వల్ల భవిష్యతులో తలెత్తే సమస్యలపై అధ్యయనం చేయడానికి వీలుగా నీటిపారుదల శాఖకు చెందిన నిపుణులతో పాటు న్యాయనిపుణులు, విద్యుత్‌ అధికారులు ఈ కమిటీలో ఉంటారు. వీరి నివేదిక అనంతరమే ప్రభుత్వం బోర్డులకు ప్రాజెక్టులు అప్పగించడంపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. 


జూరాల లేకుండా స్వాధీనమేంటి? 

బోర్డు పరిధిలో జూరాల లేకుండా ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవడం ఏంటని జల వనరుల నిపుణులు ప్రశ్నిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోకి కృష్ణా జలాలు ప్రవేశించే ముఖద్వారం లాంటి జూరాలను స్వాధీనం చేసుకోకుండా శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను తీసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటని నిలదీస్తున్నారు. జూరాల నుంచి నీటిని మళ్లిస్తే  దానికి లెక్కాపత్రమేదనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బోర్డు పరిధిలోకి శ్రీశైలం, నాగార్జునసాగర్‌తో పాటు ముందస్తుగా జూరాలను తీసుకోవాల్సిందేనని చెబుతున్నారు. మాల్యాల నుంచి తీసుకుంటున్న కేఆర్‌ఎంబీ జూరాలను ఎందుకు విడిచి పెట్టిందని నిపుణులు సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-10-14T08:27:39+05:30 IST