పీఆర్సీపై తాడోపేడో

ABN , First Publish Date - 2021-12-24T07:48:09+05:30 IST

వైసీపీ సర్కారుకు ప్రభుత్వ ఉద్యోగులు అల్టిమేటం జారీచేశారు. ..

పీఆర్సీపై   తాడోపేడో

ప్రకటనకు జనవరి 3 డెడ్‌లైన్‌

సర్కారుతో తేల్చుకుంటామంటున్న ఉద్యోగులు

ఉమ్మడి కార్యాచరణతో ముందుకు

వరుస వాయిదాలపై అసంతృప్తి


అమరావతి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): వైసీపీ సర్కారుకు ప్రభుత్వ ఉద్యోగులు అల్టిమేటం జారీచేశారు. పీఆర్సీ సహా తమ సమస్యల పరిష్కారానికి జనవరి 3ను డెడ్‌లైన్‌గా ప్రకటించారు. ఆ తర్వాత ఉద్యమ కార్యాచరణ ప్రకటించి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై సమరానికి సిద్ధమవుతామని స్పష్టం చేశారు. గురువారం విజయవాడ ఎన్‌జీవో భవన్‌లో ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతృత్వంలో జరిగిన ఐక్య జేఏసీల స్ట్రగుల్‌ కమిటీ ఈ మేరకు తీర్మానించింది. ఉద్యోగ సంఘాలకు, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న చర్చలు, ఇతర పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించారు.


పీఆర్సీ ఫిట్‌మెంట్‌, బకాయిల చెల్లింపు, సీపీఎస్‌ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితర ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం చేసిన పలు రకాల ప్రకటనలపై, పలు దఫాలు వేసిన వాయిదాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉద్యోగులు దాచుకున్న సొమ్ము చెల్లించకపోగా బకాయిలు రూ. 1600 కోట్ల నుంచి రూ. 2000 వేల కోట్లకు పెరగడంపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది. గురువారం జరిగిన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో వచ్చే వారంలో సీఎంతో సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎస్‌ ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చిన అంశంపైనా చర్చ జరిగింది. సీఎస్‌ ప్రకటనపై గౌరవంతో వారం వేచి చూడాలని కమిటీ నిర్ణయించింది.


అప్పటికీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించనిపక్షంలో జనవరి 3వ తేదీన ఇరు జేఏసీల రాష్ట్రస్థాయి సెక్రటేరియట్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ... మళ్లీ ఉద్యమంలోకి వెళ్లాలని స్ట్రగుల్‌ కమిటీ నిర్ణయించినట్టు తెలిసింది. అయితే  ఈసారి ఉద్యమ కార్యాచరణ ఏవిధంగా ఉండాలి, ఎలా రూట్‌మ్యాప్‌ వేసుకోవాలి.. అనే అంశాలపై జిల్లా స్థాయి ,క్షేత్రస్థాయి ఉద్యోగ సంఘాల నేతల అభిప్రాయాలను ఇరు జేఏసీలు తీసుకోనున్నాయి. ఈ సమావేశంలో ఏపీ జేఏసీ చైర్మన్‌ బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీజేఏసీ జనరల్‌ సెక్రటరీ హృదయరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-24T07:48:09+05:30 IST