ప్రకాశం జిల్లా: కొత్తపట్నంలో గ్రామ ప్రజలే చెక్ పోస్ట్ విధించారు

ABN , First Publish Date - 2021-05-24T16:50:53+05:30 IST

ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటిస్తే సరిపోతుందికదా.. ప్రకాశం జిల్లాకు చెందిన మత్స్యకారులు ..

ప్రకాశం జిల్లా: కొత్తపట్నంలో గ్రామ ప్రజలే చెక్ పోస్ట్ విధించారు

ప్రకాశం జిల్లా: కరోనా కట్టడికి ప్రభుత్వమే ఆంక్షలు పెట్టాలా? మహమ్మారి కట్టడి దిశగా అడుగు వేయాలనే ఆలోచన ఉన్నప్పుడు అధికారులు విధించే ఆంక్షలతో పనేముంది? ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటిస్తే సరిపోతుందికదా.. ప్రకాశం జిల్లాకు చెందిన మత్స్యకారులు సరిగ్గా ఇదే మాట అన్నారు. రాష్ట్రంలో అమలులో ఉన్న లాక్ డౌన్, కర్ఫ్యూతో సంబంధం లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రామపెద్దల మాటకు కట్టుబడి గ్రామస్తులు చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. బయటవారిని అనుమతించరు, స్థానికులను బయటకు వెళ్లనివ్వరు.


ప్రకాశం జిల్లా, కొత్తపట్నం, పల్లెపాలెం గ్రామపెద్దలు కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్థానికులు పలువురు కరోనా బారిన పడడం, ఇరుగు, పొరుగు గ్రామాలవారు విచ్చలవిడిగా సంచరిస్తుండడంతో స్వీయ నియంత్రణ తప్పదనుకున్నారు. దీంతో కొత్తపట్నం, పల్లెపాలెంకు వచ్చే రహదారిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కాపలకాస్తున్నారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 15వరకు చేపలవేటపై ప్రభుత్వం నిషేధం విధించడంతో పనులు లేక మత్స్యకారులు కొంతమంది చుట్టుప్రక్కల గ్రామాలకు పనుల కోసం వెళుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రామం దాటి వెల్లడం ఆరోగ్యానికి మంచిదికాదని చాటింపు వేయడంతో గ్రామపెద్దల నిర్ణయాన్ని గౌరవిస్తున్నామన్నారు. ఎవరినైనా అత్యవసర పరిస్థితిలో మాత్రమే బయటకు అనుమతిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారినిమాత్రం వెనక్కి పంపుతున్నారు.

Updated Date - 2021-05-24T16:50:53+05:30 IST