పొయ్‌రా పొయ్‌!

ABN , First Publish Date - 2021-02-08T09:27:14+05:30 IST

డబ్బు ప్రలోభాలు ఎలా ఉన్నా.. మద్యం పోసి నాలుగు ఓట్లు దండుకోవాలన్నది ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఎత్తుగడ. ఈ పార్టీ..

పొయ్‌రా పొయ్‌!

ఎండు గడ్డిలో ఎన్నికల మద్యం..

 పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా డంప్‌..

ఏపీ ధరలతో పోల్చితే భారీగా మిగులు

అవకాశం లేని ప్రాంతాల్లో సారా ప్యాకెట్లు

బరిలో నిలిచిన అభ్యర్థుల ఎత్తుగడలు


అమరావతి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): డబ్బు ప్రలోభాలు ఎలా ఉన్నా.. మద్యం పోసి నాలుగు ఓట్లు దండుకోవాలన్నది ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఎత్తుగడ. ఈ పార్టీ.. ఆ పార్టీ అని లేదు.. అన్ని పార్టీలదీ ఇదే తంతు. అయితే రాష్ట్రంలో మద్యం విషయంలో ఎన్నడూ లేని ఓ సంకట స్థితి నెలకొంది. దీంతో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల  బరిలో నిలిచిన అభ్యర్థులు పొరుగు రాష్ర్టాలవైపు పరుగు పెడుతున్నారు. ఎందుకంటే.. ‘పొరుగు రాష్ట్రంతో పోలిస్తే ధర చాలా ఎక్కువ.. అయినా కొందామంటే మూడు బాటిళ్లకు మించి ఇవ్వడంలేదు.. రాష్ట్రం దాటి వెళితే ధర తక్కువ.. పైగా ఎన్ని బాటిళ్లు కావాలన్నా ఇస్తారు.. తెప్పించి పంచేద్దాం.. ఎన్నికల్లో గెలుద్దాం’ అంటూ ఆ దిశగా తనమునకలై ఉన్నారు. తెలంగాణతోపాటు కర్ణాటక నుంచి భారీగా మద్యం తీసుకొచ్చి ఓటర్లకు పంచుతున్నారు. ముందస్తు సమాచారం మేరకు.. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎ్‌సఈబీ)వాటిని సీజ్‌ చేస్తుండగా అధికార పార్టీకి చెందిన అభ్యర్థులకు మాత్రం కొందరు పోలీసులే సహకరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో 13,133 పంచాయతీలకు నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.


సర్పంచ్‌ పదవి గ్రామాల్లో గౌరవంతో కూడుకున్నది కావడంతో అభ్యర్థులు విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అయితే ఎన్నికల్లో ఎక్కువ ప్రభావం చూపే మద్యం సమస్య రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను ఇబ్బంది పెడుతోంది. ఏ మాత్రం బ్రాండ్‌ విలువలేని అత్యంత చౌక మద్యం ఏపీలో ఒక క్వార్టర్‌ బాటిల్‌ కొనాలంటే రూ.150కి తక్కువ లభించడంలేదు. అంతకన్నా కొంచెం మెరుగైన బ్రాండ్‌ మద్యం పొరుగు రాష్ట్రాల్లో కేవలం రూ.95కే లభిస్తోంది. దీంతో మద్యం అక్రమ వ్యాపారులు అభ్యర్థులకు గాలం వేస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో కొనుగోలు చేసి రహస్యంగా తీసుకొస్తున్నారు. పోలీసులు, ఎస్‌ఈబీ అధికారుల కళ్లుగప్పి తెలివిగా సరిహద్దులు దాటించేస్తున్నారు.


ఎండుగడ్డి ట్రాక్టర్లలో..

పొరుగు మద్యం తీసుకొచ్చేందుకు ఆయా రాష్ట్రాలకు వెళ్లి ఏడెనిమిది వేలు పెట్టి ట్రాక్టర్‌ ఎండు గడ్డి కొనుగోలు చేస్తారు. తక్కువ ధరకు లభించే మద్యం బాటిళ్లు నలబై నుంచి యాభై బాక్సులు కొనుగోలు చేస్తారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌కు విషయం చెప్పి పదివేల వరకూ చెల్లిస్తారు. దీంతో సరిహద్దుల్లో పోలీసులు చేయి పెట్టి నా లాఠీతో పొడిచినా అందనంత లోపల గడ్డిలో మద్యం బాక్సులు పేర్చుకుంటాడు. రైతులే కదా గడ్డి తీసుకెళుతున్నారని సరిహద్దుల్లో పోలీసులు కూడా అంత సీరియ్‌సగా పట్టించుకోవడంలేదు. కొన్ని వాహనాలు మాత్రం పోలీసులతో ముందస్తుగానే మాట్లాడుకొని తీసుకొస్తున్నట్లు సమాచారం.


ఎంత తేడా...

తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో చీప్‌ లిక్కర్‌ క్వార్టర్‌ రూ.95కి కొంటున్నారు. ట్రాక్టర్‌ అద్దె, ఎండుగడ్డి, ఇతర అదనపు ఖర్చు 20నుంచి పాతిక వేలు వస్తుంది. పొరుగున రెండువేల బాటిళ్లు కొనుగోలు చేస్తే రూ.1.90లక్షలు అవుతుంది. ఖర్చులు కలిపినా రూ.2.10 లక్షలకు దాటదు. అదే బాటిల్‌ ఏపీలో కొనుగోలు చేయాలంటే రూ.150 చెల్లించాలి. ఆ లెక్కన ఇక్కడ కొనుగోలు చేస్తే మూడు లక్షలు ఖర్చవుతుంది. పైగా ఇక్కడి ప్రభుత్వ మద్యం షాపుల్లో మూడు బాటిళ్లకు మించి ఇవ్వరు. ఇచ్చినా పోలీసులకు ఉప్పందిస్తారు. మరోవైపు ఎన్నికల కమిషన్‌ ఇబ్బందులు ఎందుకంటూ కొందరు. సర్పంచ్‌ అభ్యర్థులు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.  పొరుగు రాష్ట్రాల నుంచి తెచ్చుకోలేని వారు ఏపీలోనే సారా ప్యాకెట్లు కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సారా తయారీ దారులు రూ.30 నుంచి రూ.50కి ఒక్క ప్యాకెట్‌ చొప్పున ఆర్డర్‌ ఇచ్చిన వారికి సరఫరా చేస్తున్నారు. రాయలసీమ నుంచి ఉభయ గోదావరి జిల్లాల వరకూ చాలా చోట్ల ఈతంతు సాగుతోంది.


టోల్‌ ఫ్రీ 1800 425 4868కు సమాచారమివ్వండి: ఎస్‌ఈబీ

అక్రమ మద్యం గురించి సమాచారం తీసుకోవడానికి 24గంటలూ ఎస్‌ఈబీ సిద్ధంగా ఉందని కమిషనర్‌ వినీత్‌ బ్రిజిలాల్‌ చెప్పారు. ఫిర్యాదులు చేసేందుకు టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800 425 4868 అందుబాటులో ఉందని గుర్తు చేశారు. రాష్ట్ర స్థాయిలో 50 చెక్‌పోస్టులు, 30సరిహద్దు మొబైల్‌ బృందాలు ఏర్పాటు చేశామని చెప్పారు. జనవరి 23 తర్వాత 2,587 మద్యం కేసులు నమోదు చేసి 1,979 మందిని అరెస్టు చేశామన్నారు.  

Updated Date - 2021-02-08T09:27:14+05:30 IST