పోలీసు ‘దొంగ’

ABN , First Publish Date - 2021-01-13T08:13:28+05:30 IST

దొంగల్ని పట్టుకోవాల్సిన కానిస్టేబులే.. పై అధికారి ఇంట్లో రూ.30 లక్షలకుపైగా చోరీ చేశాడు.

పోలీసు ‘దొంగ’

పై అధికారి ఇంట్లో కానిస్టేబుల్‌ చోరీ

30 లక్షల సొత్తు తస్కరణ.. 

గంటల వ్యవధిలోనే అరెస్టు


గుంటూరు, జనవరి 12: దొంగల్ని పట్టుకోవాల్సిన కానిస్టేబులే.. పై అధికారి ఇంట్లో రూ.30 లక్షలకుపైగా చోరీ చేశాడు. గుంటూరు జిల్లాలో నాగార్జున యూనివర్సిటీ క్యాంప్‌సలోని 10వ ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బెటాలియన్‌ కమాండెంట్‌ ఇంట్లో చోరీ కేసును మంగళగిరి రూరల్‌ పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. మంగళవారం పోలీస్‌ కార్యాలయంలో అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి మీడియా ఎదుట నిందితుడిని హాజరుపరిచి వివరాలు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కునుకు శ్రీనివాసరావు సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌. ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బెటాలియన్‌కు డిప్యుటేషన్‌పై వచ్చాడు. ఆత్మకూరులో నివాసం ఉంటున్నాడు. ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బెటాలియన్‌కు కమాండెంట్‌గా సంతో్‌షకుమార్‌ పని చేస్తున్నారు. ఆయన వద్ద శ్రీనివాసరావు నమ్మకంగా ఉంటూ, ఆర్డర్లీగా పనులు చేస్తున్నాడు. ఇటీవల డిప్యుటేషన్‌ ముగిసి మాతృసంస్థ సీఆర్‌పీఎ్‌ఫకు బదిలీ అయినా వెళ్లలేదు. కమాండెంట్‌ సంతో్‌షకుమార్‌ జమ్మూకశ్మీర్‌కు బదిలీ అవడంతో, ఆయన వెళ్లాక తానూ వెళతానంటూ ఇక్కడే ఉంటున్నాడు. కమాండెంట్‌ ఇంటి సామగ్రి కొంత జమ్మూకశ్మీర్‌కు పంపేశారు. భార్య, పిల్లల బంగారు ఆభరణాలను స్కూల్‌ బ్యాగులో సర్ది కప్‌బోర్డులో ఉంచారు. సోమవారం రాత్రి సంతో్‌షకుమార్‌ కుటుంబం తోటి అధికారి కుమారుడి జన్మదిన వేడుకలకు వెళ్లింది. తిరిగి వచ్చేసరికి ఇంట్లో దుస్తులు, సామగ్రి చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కప్‌బోర్డులోని ఆభరణాలు కనిపించలేదు. కిటికీ గ్రిల్స్‌, లోపలి మెస్‌డోర్‌ వంచి ఉన్నాయి. వారి ఫిర్యాదు మేరకు క్లూస్‌ టీం పరిశీలించి ఆధారాలు సేకరించింది.


దొంగలు ఇంటి తలుపు నుంచే లోనికి వచ్చినట్టు క్లూస్‌ టీం తేల్చింది. దర్యాప్తును తప్పుదారి పట్టించడానికే గ్రిల్స్‌, మెస్‌ వంచేశారని, అక్కడే సిగరెట్‌ పీకలూ అందుకే పడేశారని గుర్తించారు. శ్రీనివాసరావు తప్ప మరొకరు రావడానికి అవకాశం లేదని కమాండెంట్‌ చెప్పటంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా, నేరం అంగీకరించాడు. తనకున్న రూ.10 లక్షల అప్పు తీర్చడానికి, తన భార్యా పిల్లలకు బంగారు ఆభరణాలు కొనలేకపోతున్నాననే నైరాశ్యంలో చోరీకి పాల్పడ్డానని విచారణలో శ్రీనివాసరావు వెల్లడించాడు. దీంతో అతన్ని అరెస్ట్‌ చేసి, రూ.30 లక్షల విలువైన ఆభరణాలు, రూ.55 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2021-01-13T08:13:28+05:30 IST