టెంట్‌కూడా వెయ్యనివ్వరు

ABN , First Publish Date - 2021-08-25T08:32:52+05:30 IST

అంతా గప్‌చుప్‌! ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వం, చివరకు జీవోలను కూడా రహస్యంగా ఉంచుతోంది. మరోవైపు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, చిరుద్యోగులు...ఇలా ఎవరికైనా ఏవైనా సమస్యలుండి, వాటిని బయటకు

టెంట్‌కూడా వెయ్యనివ్వరు

ఫ్యాప్టో ధర్నాలపై జిల్లాల్లో నిర్బంధం

టెంట్లు ఇవ్వకుండా పోలీసుల ఒత్తిడి

ఉద్యమాల చరిత్రలోనే కొత్త పోకడ

నోరెత్తితే కేసులు.. విమర్శిస్తే జైలుకు

రెండేళ్లుగా టీచర్ల మాటలపై నిఘా

భయపడి వాట్సాప్‌లోనే బాధలు షేరింగ్‌


‘‘గతంలో రెండు డీఏలు దాటి మూడో డీఏ పెండింగ్‌లో ఉంటే, సీఎంను నేరుగా కలిసి అడిగేవాళ్లం. స్వేచ్ఛగా అభిప్రాయం చెప్పేవాళ్లం. ఒక డీఏ అయినా ఇవ్వకుంటే కుదరదని గట్టిగా అడిగి సాధించుకునేవాళ్లం. కానీ ఇప్పుడు ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నా గట్టిగా మాట్లాడేందుకు లేదు. గత రెండేళ్లుగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు లేదు. నోరు తెరవడానికిగానీ, తల ఎత్తడానికిగానీ వీల్లేదు’’


ఉద్యోగ వర్గాలు


(అమరావతి, ఆంధ్రజ్యోతి)

అంతా గప్‌చుప్‌! ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వం, చివరకు జీవోలను కూడా రహస్యంగా ఉంచుతోంది. మరోవైపు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, చిరుద్యోగులు...ఇలా ఎవరికైనా ఏవైనా సమస్యలుండి, వాటిని బయటకు చెప్తే అంతే! గట్టిగా ఏమైనా అంటే కేసులు...రోడ్డెక్కితే జైలు. దీంతో కిందిస్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు అందరూ తమ వేతలను వాట్సాప్‌ కాల్స్‌లో పంచుకుంటున్నారు. ప్రభుత్వం తమపై నిఘా పెట్టిందనే అనుమానానికితోడు మూడో నేత్రం చూస్తోందనే ఆందోళన కారణంగా చాలామంది సాధారణ కాల్స్‌ సంగతే మర్చిపోయారు. వ్యక్తిగత స్వేచ్ఛ అంటూ ఒకటుందనే స్పృహ కూడా లేకుండా పోయిందని పలువురు ఆవేదన చెందటం గమనార్హం. చివరకు ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తుంటే, వారికి టెంట్లు వేయడానికి కూడా కొన్నిచోట్ల అనుమతులు ఇవ్వడం లేదు. పరాకాష్ఠ ఏంటంటే.. ఆందోళనకారులకు టెంట్లు వేసేందుకూ టెంట్‌ సామానుల దుకాణం యజమానులు పలుచోట్ల ముందుకురావడం లేదు. ‘ఆందోళన చేసేది మేం కదా! అరెస్టు చేస్తే మమ్మల్ని చేస్తారు.


మీకేం ఇబ్బంది?’ అంటే.. ముందే పోలీసు హెచ్చరికలున్నాయనీ, అరెస్టులు చేస్తే తమ టెంట్లు కూడా పట్టుకుపోతార నీ కొందరు యజమానులు సమాధానమిస్తున్నారు. ఎన్నడూ చూడనంత నిర్బంధం రాష్ట్రంలో అమలవుతోందని పలువురు పేర్కొంటున్నారు. ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతున్నారని, విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు అందరిపైనా కేసులు పెట్టడం, బెదిరించడం లాంటివి చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేవని చెబుతున్నారు. 


కలవాలంటే నో... మాట్లాడాలంటే వాట్సాప్‌ కాలే

రాష్ట్ర ప్రభుత్వ అధికారులు గతంలో తమకు ఏదైనా సమస్య ఉంటే స్వేచ్ఛగా మాట్లాడేవారు. తమ స్నేహితులతో, మిత్రులతో, పాత్రికేయులతో, ప్రజలతో ఎవరితోనైనా చొరవగా సంభాషించేవారు. తమ అభిప్రాయాలు చెప్పేవారు. కానీ గత రెండేళ్లకు పైగా చాలామంది ఉద్యోగులు ఏదున్నా వాట్సాప్‌ కాలే. తాము చేయాల్సి వచ్చినా...తమకెవరు చేసినా ఇదే పద్ధతిలో చేయాలంటున్నారు. తెలియని భయం, మెడమీద కత్తి వేలాడుతున్న భావన వారిలో కనిపిస్తోంది. మరోవైపు అధికారులు అంతర్గతంగా తాము కలుసుకోవాలన్నా, లేకుంటే ఇతరులను కలవాలనుకున్నా అంతా భయం భయంగానే! ఎందుకొచ్చిన గొడవ.. ఎవరైనా గమనిస్తారేమోననే ఆందోళన. దీంతో సందర్శకులను కలవడం అన్నది బాగా తగ్గిపోయింది.  


టెంట్లకూ అనుమతి లేదు

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం, కొత్త డీఎస్సీ ప్రకటన, డీఏ విడుదల, పీఆర్సీ అమలు, సీపీఎస్‌ విధానం రద్దు తదితర సమస్యలపై ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహించింది. అయితే ఈ ధర్నాలకు టెంట్లు వేయడానికి కూడా కొన్నిచోట్ల ఎవరూ ముందుకురాలేదు. గుంటూరు, ప్రకాశం లాంటి చోట్ల అనుమతులే ఇవ్వలేదు. చివరకు శాంతియుతంగా ధర్నాలు చేసుకునేందుకు, తమ డిమాండ్లను చెప్పేందుకు కూడా వీల్లేకుండా పోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. 


సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం

ఫ్యాప్టో రాష్ట్ర అధ్యక్షుడు జోసెఫ్‌ సుధీర్‌బాబు 

డిమాండ్ల సాధనకు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు 


అమరావతి, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 25వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేయాలని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) రాష్ట్ర అధ్యక్షుడు జోసెఫ్‌ సుధీర్‌బాబు డిమాండ్‌ చేశారు. కొవిడ్‌తో చనిపోయిన టీచర్ల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు ఇవ్వాలని కోరారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో మంగళవారం ధర్నాలు నిర్వహించారు. 25 ప్రధాన డిమాండ్ల సాధనకు ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనల్లో అన్ని ఉపాధ్యాయ సంఘాలు పాల్గొన్నాయి. ఉపాధ్యాయ, ఉద్యోగ, ఫించనర్ల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం రెండేళ్లుగా నిర్లక్ష్యం వహిస్తోందని నేతలు విమర్శించారు.


ఐదేళ్లకోసారి పీఆర్‌సీని అమలుచేయాల్సి ఉండగా ఆ సమయం దాటి 38 నెలలైందన్నారు. గుంటూరులో జరిగిన ఆందోళనలో జోసెఫ్‌ సుధీర్‌బాబు మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న 5డీఏలు విడుదల చేయాలన్నారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీలు కె.ఎ్‌స.లక్ష్మణరావు, కత్తి నరసింహారెడ్డి, ఐ.వెంకటేశ్వర్‌రావు, పాకలపాటి రఘువర్మ, షేక్‌ సాబ్జీ తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు.

Updated Date - 2021-08-25T08:32:52+05:30 IST