‘దాడి’ బాధితులను అడ్డగించిన పోలీసులు
ABN , First Publish Date - 2021-10-21T10:11:42+05:30 IST
టీడీపీ కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు జరిపిన దాడిలో గాయపడిన బాధితులు.. చికిత్స అనంతరం టీడీపీ ఆఫీ్‌సకు తిరిగి వస్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు.
కార్యాలయంలోకి వెళ్లకుండా బారికేడ్లు.. లోకేశ్ జోక్యంతో సమసిన వివాదం
అమరావతి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): టీడీపీ కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు జరిపిన దాడిలో గాయపడిన బాధితులు.. చికిత్స అనంతరం టీడీపీ ఆఫీ్‌సకు తిరిగి వస్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జోక్యం చేసుకోవడంతో వివాదం సమసింది. బుధవారం మంగళగిరి టీడీపీ కార్యాలయం వద్ద జరిగిన ఈ ఘటన స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిలో ఆ పార్టీ సోషల్ మీడియా విభాగంలో పనిచేసే బద్రి, విశ్లేషకుడు అనిల్, రాజకీయ కమిటీలో పనిచేస్తున్న విద్యాసాగర్ గాయపడ్డారు. వీరిలో బద్రిని తలపై సుత్తితో కొట్టడంతో తీవ్రగాయమైంది. వీరిని సమీపంలోని మణిపాల్ ఆస్పత్రిలో చేర్చారు. బుధవారం మధ్యాహ్నం వీరిని డిశ్చార్జి చేయడంతో అంబులెన్స్‌లో టీడీపీ కార్యాలయానికి వచ్చారు. పోలీసులు టీడీపీ ఆఫీ్‌సకు రెండువైపులా బారికేడ్లు పెట్టి దారి మూసేసి ఎవరినీ రానివ్వలేదు. వీరు వస్తున్న అంబులెన్స్‌ను కూడా నిలిపివేశారు. అరగంట దాటినా వారిని రానీయకపోవడంతో వారిని తీసుకురావడానికి టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరారు. ఈ విషయం తెలియడంతో అంబులెన్స్‌ను పోలీసులు వదిలేశారు.