పోలవరానికి 20,398 కోట్లే!

ABN , First Publish Date - 2021-03-21T09:12:15+05:30 IST

పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు రూ.20,398.61 కోట్లకు మించి ఇవ్వొద్దంటూ కేంద్ర జల వనరులశాఖకు కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసింది. 2017 మార్చి 15న కేంద్ర కేబినెట్‌ తీర్మానం మేరకు

పోలవరానికి 20,398 కోట్లే!

అంతకుమించి పైసా కూడా ఇవ్వొద్దు 

తుది అంచనాలు పట్టించుకోని కేంద్రం

సహాయ పునరావాసానికి 7,278.85 కోట్లు

పద్దు దాటిన బిల్లులకు దక్కని మోక్షం

జల శక్తి శాఖకు ఆర్థికశాఖ సూచన 

రాష్ట్ర జల వనరుల శాఖలో ఆందోళన


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు రూ.20,398.61 కోట్లకు మించి ఇవ్వొద్దంటూ కేంద్ర జల వనరులశాఖకు కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసింది. 2017 మార్చి 15న కేంద్ర కేబినెట్‌ తీర్మానం మేరకు ఆ మొత్తానికే వ్యయం పరిమితం కావాలని తేల్చి చెప్పింది. కేంద్ర జల వనరులశాఖకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రూ.55,656.87 కోట్ల తుది అంచనా వ్యయంపై స్పందించలేదు. కేంద్ర కేబినెట్‌ నిర్ణయం మేరకు పోలవరం ప్రాజెక్టుకు వంద శాతం నిధులు భరిస్తామని ఆర్థికశాఖ అంటోంది. అందులోనూ హెడ్‌ వర్క్స్‌, భూమి, సహాయ పునరావాసానికి నిర్దేశించిన మొత్తాలను దాటి ఇవ్వకూడదని జలశక్తిశాఖ నిర్ణయించింది. పోలవరం ప్రాజెక్టు కోసం సేకరించే భూములకు రూ.5,035.05 కోట్లు, సహాయ పునరావాసానికి రూ.7,278.85 కోట్లు, హెడ్‌వర్క్స్‌కు రూ.8,818.21 కోట్లు, కుడి ప్రధాన కాలువ రూ.1,885.43 కోట్లు, ఎడమ ప్రధాన కాలువ రూ.2,373.07 కోట్లకే పరిమితం కావాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)ను కేంద్ర జలశక్తిశాఖ ఆదేశించింది.


ఈ పద్దులన్నింటిని లెక్కిస్తే రూ.25,390.61 కోట్లుగా ఉంది. వాస్తవానికి రూ.4,992 కోట్లు అదనంగా ఉంది. ఈ మొత్తం 2014లో రాష్ట్ర విభజనకు ముందు చేసిన వ్యయంగా పరిగణనలోకి తీసుకుంటోంది. ఈ పద్దుల మేరకు మాత్రమే నిధులు మంజూరు చేయాలని పీపీఏకు కేంద్ర జలశక్తి శాఖ సూచించింది.  పోలవరం ప్రాజెక్టు తుది అంచనా వ్యయాన్ని రూ. 55,656.87 కోట్లుగా కేంద్ర జల సంఘం, రూ.47,725.74 కోట్లుగా తుది అంచనాల సవరణ కమిటీ 2017లో నిర్ధారించాయి. కానీ కేంద్రం మాత్రం వాటిని అధికారికంగా గుర్తించలేదు. తుది అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఆమోదం తెలపాలని ప్రధాని మోదీ, కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌లకు సీఎం జగన్‌ పలు దఫాలుగా విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది. పైగా, పనుల వారీగా కేటాయించిన మొత్తాలకే కట్టుబడి ఉంటోంది.


కేంద్ర జలసంఘం అంచనా మేరకు భూ సేకరణ వ్యయం రూ.13,077.15 కోట్లు, పునరావాసానికి ఖర్చు రూ.20,091.09 కోట్లుగా ఉంది. అదేవిధంగా కేంద్ర జలశక్తి, కేంద్ర ఆర్థికశాఖతో కూడిన తుది అంచనా వ్యయ కమిటీ భూ సేకరణకు రూ.10,199.67 కోట్లు, సహాయ పునరావాసానికి రూ.17,972.54 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఈ అంచనాలనూ కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు కోసం చేస్తున్న ఖర్చులు చెల్లించాలంటూ పీపీఏకు జల వనరుల శాఖ బిల్లులు పంపుతోంది. అయితే అవి కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన అంచనా మొత్తాని లోబడి ఉన్నాయో లేవోనని పీపీఏ వడగడుతోంది. నెలల తరబడి బిల్లులు ఆమోదించడం లేదు. భూసేకరణ కోసం రూ.487 కోట్లు రీయింబర్స్‌మెంట్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంటే అందులో రూ.400 కోట్లకు ఇటీవల సమ్మతి తెలిపిన పీపీఏ మరో రూ.87 కోట్లకు మాత్రం కొర్రీ వేసింది. దీనికి జల వనరుల శాఖ వివరణలు ఇస్తూనే ఉంది. పోలవరానికి నిధుల విషయంలో కేంద్రం తన వైఖరికే కట్టుబడి ఉండటం రాష్ట్ర జల వనరుల శాఖను ఆందోళనకు గురి చేస్తోంది.

Updated Date - 2021-03-21T09:12:15+05:30 IST