ఎన్‌కౌంటర్‌కు ప్లాన్‌ చేశారు

ABN , First Publish Date - 2021-09-02T09:25:42+05:30 IST

‘‘నన్ను ఎన్‌కౌంటర్‌ చేయడానికి ప్లాన్‌ చేశారు. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలతో రాష్ట్ర డీజీపీ, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీలు నా హత్యకు ప్రణాళిక సిద్ధం చేశారు’’

ఎన్‌కౌంటర్‌కు ప్లాన్‌ చేశారు

  • సజ్జల ఆదేశాలతోనే నా హత్యకు ప్రణాళిక
  • మాజీ ఎమ్మెల్యే చింతమనేని ఆరోపణ
  • ఏలూరు పోలీసులకు ఫిర్యాదు


ఏలూరు క్రైం, సెప్టెంబరు 1: ‘‘నన్ను ఎన్‌కౌంటర్‌ చేయడానికి ప్లాన్‌ చేశారు. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలతో రాష్ట్ర డీజీపీ, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీలు నా హత్యకు ప్రణాళిక సిద్ధం చేశారు’’ అని దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌ ఆరోపించారు. బుధవారం ఆయన ఏలూరు త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. తనపై హత్యాయత్నానికి పాల్పడిన వారందరిపై కేసు నమోదు చేయాలని, నిష్పాక్షింగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ తన ఫిర్యాదును సీఐ కేవీఎ్‌సవీ ప్రసాద్‌కు స్వయంగా అందించారు. ఆయన చేసిన ఫిర్యాదు మేరకు... ‘‘గత నెల 28న నా స్నేహితులతో కలిసి విశాఖ రూరల్‌ జిల్లా జీకే వీధి మండలం దారకొండ దారాలమ్మ గుడికి 10 వాహనాల్లో వెళ్లాం.


29 ఉదయాన్నే అమ్మవారి దర్శనం చేసుకుని ఇళ్లకు బయలుదేరి వస్తుండగా సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో నర్సీపట్నం ఫారెస్టు ఔట్‌ పోస్టు వద్ద 50 మంది పోలీసులు మమ్మల్ని ఆపారు. వారిలో జిల్లాకు చెందిన కొవ్వూరు ఎస్‌ఐ రమణ, సీఐ నాగేశ్వరరావు, ఉండ్రాజవరం ఎస్‌ఐ కె.రామారావు ఉన్నారు. మా మొబైల్స్‌ను తీసుకుని, చట్ట విరుద్ధంగా నిర్బంధించారు. 30వ తేదీ తెల్లవారుజామున 5.30 గంటలకు పోలీసు వాహనంలో చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అదే రోజు అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో అదనపు ఎస్పీ ఒకరు వచ్చి మా పట్ల దురుసుగా ప్రవర్తించారు. తెల్లకాగితాలపై సంతకాలు పెట్టించారు. నాతోపాటు ఉన్న డ్రైవర్లతోనూ, స్నేహితులతోనూ బలవంతంగా తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకున్నారు. ఆ సమయంలో పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ 100 మంది పోలీసులను కాపలా పెట్టారు. వారి సంభాషణ ప్రకారం నన్ను ఎన్‌కౌంటర్‌ చేయడానికి ప్రణాళిక సిద్ధం అయిందని తెలిసింది’’ అని పేర్కొన్నారు.


‘‘మరుసటి రోజు ఉదయం చింతపల్లిలో నన్ను ఓ కారు ఎక్కించారు. నాతోపాటు కారులో సీఐ నాగేశ్వరరావు, ఎస్‌ఐ, మరో ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నారు. కారులో సీఐ నాగేశ్వరరావు ఫోన్‌లో ఎవ రితోనో మాట్లాడారు. ‘అనుకున్న ప్రకారం వేరుగానే తీసుకువస్తున్నాం. మన టార్గెట్‌ రీచ్‌ అయిపోతున్నాం’ అని చెప్పారు. అయితే నన్ను భీమడోలు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లి 41 ఏ నోటీసు ఇచ్చారు. 28 నుంచి 30వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల వరకూ నన్ను మానసికంగా అనేక ఇబ్బందులకు గురి చేశారు. మా పార్టీ నాయకత్వం, మీడియా వల్లే నా ప్రాణాలు నిలిచాయి’’ అని ఫిర్యాదులో చింతమనేని పేర్కొన్నారు. 

Updated Date - 2021-09-02T09:25:42+05:30 IST