తగ్గం.. తగ్గించం

ABN , First Publish Date - 2021-11-09T08:02:06+05:30 IST

పెట్రో ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న వ్యాట్‌, సెస్‌ తదితర భారాలు తగ్గించే ప్రసక్తే లేదని సర్కారు స్పష్టం చేసింది.

తగ్గం.. తగ్గించం

పెట్రో ధరలపై సర్కారు స్పష్టీకరణ

కేంద్రానికి ఉండే వెసులుబాటు రాష్ల్రాలకు ఉండదు

ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది: బుగ్గన

బీజేపీవి ఉత్తర కుమార ప్రగల్భాలు

రాష్ట్రంలో ధర్నాలు చేస్తామనడం సరికాదు

రూ.25 తగ్గించాలని మోదీని నిలదీయండి

పార్లమెంటులో ఆందోళన చేయండి: పేర్ని


న్యూఢిల్లీ, అమరావతి, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): పెట్రో ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న వ్యాట్‌, సెస్‌ తదితర భారాలు తగ్గించే ప్రసక్తే లేదని సర్కారు స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వమే రూ.25 వరకు తగ్గించాలంటూ రాష్ట్ర బీజేపీ నేతలు ప్రధాని మోదీ ఎదుట ధర్నాలు చేయాలని హితవు పలికింది. పార్లమెంటులోనూ ఆందోళన చేయాలని సూచించింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సోమవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెట్రో భారం తగ్గించే ప్రసక్తి లేదన్నారు. ఈ విషయంలో కేంద్రానికి ఉండే వెసులుబాటు రాష్ట్రాలకు ఉండదని తెలిపారు. దీనిపై ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశాన్ని ఇప్పటికే చెప్పామన్నారు. ఇప్పటికే పెంచిన కొన్ని రకా ల పన్నులను తగ్గించామని తెలిపారు. రాష్ర్టానికి పెట్రో, ఎక్సై జ్‌ రంగాల ద్వారా మాత్రమే ఆదాయం సమకూరుతోందని తెలిపారు. అందువల్ల పెట్రో ధరల భారం తగ్గించే విషయం లో కేంద్రం తీసుకున్నంత సులభంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణ యం తీసుకునే పరిస్థితి లేదన్నారు.


వంద దాటించింది ఎవరు: పేర్ని

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రి పేర్ని నాని విలేకరులతో మాట్లాడుతూ దేశానికే ఆదర్శ సీఎంగా నిలిచిన జగన్‌కు నీతులు చెప్పడం మానేసి.. పెట్రో ధరల్లో రూ.25 వరకు తగ్గించాలంటూ ప్రధాని మోదీని నిలదీయాలని రాష్ట్ర బీజేపీ నేతలకు సూచించారు. రాష్ట్రంలో ధర్నాలు చేస్తామనడం సరికాదన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలపై భారీ భారం వేసినందుకు పార్లమెంటులో నిరసన తెలియజేయాలని సూచించా రు. పెట్రోలియం ఉత్పత్తుల ధరలను కేంద్రం రాకెట్‌ కంటే వేగంగా పెంచేసిందని విమర్శించారు. రూ.70 ఉన్న లీటరు డీజిల్‌, పెట్రోల్‌ ధరలను కేంద్రం ఏ మాత్రం భయమూ, వెర పూ, జాలి, దయా లేకుండా రూ.100 దాటించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజిల్‌ రూ.108, పెట్రోల్‌ రూ.116 వరకు ధరలు పెంచేసి, రూ.5, రూ.10 తగ్గించడం ద్వారా మొత్తం తలకిందులైపోయినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రభుత్వం రేట్లు తగ్గించుకోవాలంటూ ఉత్తర కుమార ప్రగల్భాలు చూస్తుంటే రాజకీయ నాయకులకు సిగ్గూఎగ్గూ ఉండదని ప్రజలు ఇందుకే అనుకుంటున్నారా అనే సందేహం వస్తోందన్నారు. నవంబరు, అక్టోబరు, సెప్టెంబరు, ఆగస్టు నెలల్లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలెంతో బీజేపీ వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. పెట్రోల్‌ ధరల ద్వారా రూ.2,87,500 కోట్లను వివిధ సెస్సుల పేరిట కేంద్రం వసూలు చేస్తోందని, ఎక్సైజ్‌ డ్యూటీ 47 వేల కోట్లలో 19,000 కోట్లను రాష్ట్రాలన్నింటికీ సర్దుతోందని వివరించారు. నిజాయితీ, రాజకీయ నిబద్ధత ఉంటే.. నార్త్‌ బ్లాక్‌ దగ్గర, పార్లమెంటు వద్ద ధర్నా చేయండని హితవు పలికారు. వీరబాదుడు బాది.. క్రూడ్‌ ధర పెరగకపోయినా విపరీతమైన భారం వేసి.. ఇప్పుడు దయార్థ్ర హృదయులుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశా రు. ధర్నా పెడితే.. పార్లమెంటుకు వెళ్దామని, తాను కూడా వచ్చి కలుస్తానని చెప్పారు. చంద్రబాబు రాసిన స్ర్కిప్టు చదివితే బీజేపీ పరువు పోతుందన్నారు. 

రాష్ట్ర ఆర్థిక స్థితిపై నిర్మలతో బుగ్గన చర్చ

అన్‌ రాక్‌ అల్యూమినియం పరిశ్రమకు సంబంధించిన కేసు(ఆర్బిట్రేషన్‌) పరిష్కారంపై నిర్మలా సీతారామన్‌తో చర్చించినట్లు బుగ్గన తెలిపారు. తొలిదశ ఆర్బిట్రేషన్‌ గత నెలలో పూర్తయిందని, ఈ నెల రెండోదశ ఆర్బిట్రేషన్‌ జరుగుతోందని వివరించారు. అలాగే రాష్ర్టానికి రావలసిన నిధులు విడుదల చేయాలని కోరినట్లు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వనరు ల పరిస్థితులు, ఇబ్బందులను ఆమెకు వివరించినట్లు తెలిపా రు. అలాగే కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన భగవత్‌ కరాడ్‌, పంకజ్‌ చౌదరిలను మర్యాదపూర్వకంగా కలిశానని బుగ్గన చెప్పారు. 

Updated Date - 2021-11-09T08:02:06+05:30 IST