ఆగని కన్నీళ్లు!

ABN , First Publish Date - 2021-11-23T08:48:49+05:30 IST

సీఎం జగన్‌ సొంత జిల్లా కడపలో చెయ్యేరు, పాపాఘ్ని వరద ధాటికి ఊళ్లకు ఊళ్లు మునిగిపోయాయి. రోడ్లు, వంతెనలు తెగిపోయాయి. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడంతో రాజంపేట మండలం పులపుత్తూరు, మందపల్లి, తోగూరుపేట,

ఆగని కన్నీళ్లు!

  • మూడు రోజులుగా చీకట్లోనే జనం
  • చెయ్యేరు వరద ముంచిన పల్లెల్లో అష్టకష్టాలు
  • సీఎం జగన్‌ సొంత జిల్లాలోనే ఇప్పటికీ భరోసా లభించని వైనం
  • దాతల ఆహారమే దిక్కు.. బాబు వస్తుండడంతో మేల్కొన్న మంత్రి, ఎమ్మెల్యేలు
  • హుటాహుటిన బాధిత ప్రాంతాలకు.. ఇళ్లు కోల్పోయిన వారికి పరిహారం
  • నెల్లూరు జిల్లాలో శాంతించిన పెన్నా
  • సొంత ఇళ్లకు చేరుకుంటున్న బాధితులు
  • ఆదుకోండి.. మోదీ, షాకు వెంకయ్య ఫోన్‌


కడప, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్‌ సొంత జిల్లా కడపలో చెయ్యేరు, పాపాఘ్ని వరద ధాటికి ఊళ్లకు ఊళ్లు మునిగిపోయాయి. రోడ్లు, వంతెనలు తెగిపోయాయి. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడంతో రాజంపేట మండలం పులపుత్తూరు, మందపల్లి, తోగూరుపేట, గుండ్లూరు, రామచంద్రాపురం గ్రామాల్లో కోలుకోలేని విధంగా ఇళ్లు, ఆస్తులు దెబ్బతిన్నాయి. నందలూరు మండలం పాటూరు, నందలూరు గ్రామాలు ముంపునకు గురై ప్రజలు భారీగా నష్టపోయారు. నాలుగు రోజులైనా ఇప్పటికీ వరద గాయం మానలేదు. బాధితుల కన్నీళ్లు ఆగలేదు. ‘ఎన్నికల సమయంలో ఓట్ల కోసం జగన్‌ ఊరూరూ వచ్చి ముద్దులు పెట్టారు. సీఎం అయ్యాక వరద దెబ్బతో రోడ్డున పడి సాయం కోసం దిక్కులు చూస్తున్న మా వద్దకు వచ్చి ఓదార్చక పోగా.. హెలికాప్టర్‌లో చక్కర్లు కొట్టి వెళ్లిపోయారు’ అని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 


అపార నష్టం

కడప జిల్లాలో 1.23 లక్షల హెక్టార్లలోని వరి, మినుము, పత్తి, ఉద్యాన పంటలను వరద ముంచేసింది. ఒక్క గింజ కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు. హెక్టారుకు రూ.1.50 లక్షల చొప్పున రూ.1,850 కోట్లకు పైగా దిగుబడి నష్టపోయామని రైతులు కన్నీరు పెడుతున్నారు. 795కు పైగా ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. పులపుత్తూరు, తోగూరుపేట, మందపల్లి గ్రామాల్లో సుమారుగా 250కిపైగా ఇళ్లు శిథిలాలుగా మిగిలాయి. పలు గ్రామాలకు నేటికీ రాకపోకలు మెరుగు పడలేదు. కరెంట్‌ సౌకర్యం లేక కారుచీకట్లలో వరద బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. బాధితులు.. దాతలు ఇచ్చిన ఆహారం, తాగునీటితోనే కాలం గడుపుతున్నారు. 


బాబు వస్తున్నారని..

మంగళవారం కడప జిల్లా చెయ్యేరు వరద బాధిత గ్రామాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. దీంతో మూడు, నాలుగు రోజులుగా అసలు ఆ గ్రామాల వైపు కన్నెత్తి కూడా చూడని జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేశ్‌, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి సహా జడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, జిల్లా కలెక్టరు వి.విజయరామరాజు తదితరులు ఆయా గ్రామాలకు సోమవారం పరుగులు పెట్టారు. ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వ సాయంగా రూ.5,800 చెక్కులు పంపిణీ చేశారు. మృతి చెందిన కుటుంబాలను గుర్తించి వారికి మాత్రం రూ.5 లక్షల చెక్కులు అందజేశారు. ఇక, కడప జిల్లాలో వరద ఉధృతికి మరో వంతెన కుంగిపోయింది. రెండు రోజుల కిందట కమలాపురం వద్ద పాపాఘ్ని నదిపై వంతెన కుంగిపోగా, తాజాగా జమ్మలమడుగు-ముద్దనూరు మధ్య పెన్నానదిపై వంతెన కుంగిపోయింది. అప్రమత్తమైన అధికారులు రాకపోకలు బంద్‌ చేశారు. దీంతో జమ్మలమడుగు నుంచి ముద్దనూరుకు వెళ్లే ప్రయాణికులకు, చుట్టుపక్కల 21 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 


5 లక్షలు కాదు కోటి ఇవ్వాలి: సత్యకుమార్‌ 

సీఎం జగన్‌ సొంత జిల్లా కడపలో సంభవించిన వరదల్లో మృతి చెందిన వారికి విశాఖ గ్యాస్‌లీక్‌ ఘటన తరహాలో రూ.కోటి పరిహారంగా ఇవ్వాలని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం వరద ప్రభావిత ప్రాంతాలైన మందపల్లె, పులపత్తూరు, తొగూరుపేట, గుండ్లూరు, రామాపురం గ్రామాల్లో పర్యటించారు. రూ.5 లక్షలు ఇస్తామని సీఎం ప్రకటించడం అన్యాయమన్నారు.  


ప్రమాదకర స్థితిలోనే రాయలచెరువు 

తిరుపతి నవంబరు 22(ఆంధ్రజ్యోతి): తిరుపతి సమీపంలోని రాయల చెరువు వద్ద ప్రమాదకర పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. కట్ట లీకేజీ కొనసాగింది. సోమవారం చిరు జల్లులు పడడంతో సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి. చెరువు పరిధిలో ఉన్న గ్రామాలను ఖాళీ చేయించారు. ఐఐటీ నిపుణుల సూచనల మేరకు 10వేల ఇసుకబస్తాలతో గండిని పూడ్చే ప్రయత్నం చేశారు. 


బెజవాడ డివిజన్‌లో మూడొంతుల రైళ్లు రద్దు

విజయవాడ: బెజవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో రైళ్ల పునరుద్ధరణ పూర్తికాలేదు. పడుగుపాడు-నెల్లూరు సెక్షన్ల మధ్య దెబ్బతిన్న రెండు రైల్‌ ట్రాకుల్లో ఒక దానికి మరమ్మతులు చేశారు. దీంతో సోమవారం కూడా మూడొంతుల రైళ్లు నిలిచిపోయాయి. విజయవాడ-గూడూరు, భువనేశ్వర్‌- బెంగళూరు, జైపూర్‌-చెన్నై, న్యూఢిల్లీ- తిరువనంతపురం, చెన్నై- న్యూఢిల్లీ, భువనేశ్వర్‌- బెంగళూరు రైళ్లను పునరుద్ధరించారు. 


కేంద్రం తరఫున ఆదుకోండి: వెంకయ్య 

రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను కేంద్ర ప్రభుత్వం తరఫున  ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు. విశాఖపట్నం పర్యాటనలో ఉన్న వెంకయ్య సోమవారంమోదీ, అమిత్‌షాలకు ఫోన్‌ చేసి మాట్లాడారు. రాష్ట్రంలో వరద ప్రభావం గురించి కూలంకషంగా వివరించారు. 


గండం గడిచింది!

శాంతించిన పెన్నా.. తగ్గిన వరద

నెల్లూరు(వెంకటేశ్వరపురం), నవంబరు 22: మహోగ్ర రూపంతో వేలాది ఇళ్లను ముంచెత్తిన పెన్నా నది శాంతించింది. మూడు రోజులుగా జల దిగ్బంధంలో ఉన్న ప్రాంతాలు తేరుకుంటున్నాయి. ఒక్కసారిగా వచ్చి పడ్డ పెన్నా వరదతో అతలాకుతలమైన నెల్లూరు నగరవాసులు సోమవారానికి కాస్త కుదుటపడ్డారు. పెన్నా నదిలో ప్రవాహ ఉధృతి తగ్గడంతో వరద నీరు తగ్గుముఖం పట్టింది. ముంబై రహదారిపై రాకపోకలను పునరుద్ధరించారు. అలాగే పెన్నా వంతెన పైనుంచి విజయవాడ వైపు కూడా వాహనాలను అనుమతించారు. విజయవాడ- చెన్నై మధ్య నిలిచిపోయిన రైళ్ల రాకపోకలను అధికారులు సోమవారం రాత్రి పునరుద్ధరించారు. పెన్నా ప్రవాహంతో పడుగుపాడు ప్రాంతంలో రైల్‌ ట్రాక్‌ దెబ్బతినడంతో రెండు రోజులుగా అన్ని రైళ్లను రద్దు చేశారు. యుద్ధప్రాతిపదికన గండ్లు పూడ్చే పనులు చేపట్టిన అధికారులు రెండు వైపులా ట్రాక్‌లను సిద్ధం చేసి రైళ్లను నడిపారు. నెల్లూరులోని వెంకటేశ్వరపురం పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసులు, మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ సోమవారం మధ్యాహ్నం పర్యటించారు.  


వరద నష్టం 530 కోట్లు: నెల్లూరు జిల్లాను ముంచెత్తిన వరదలతో భారీ నష్టం సంభవించింది. అధికారుల ప్రాథమిక అంచనా మేరకు రూ.530.46 కోట్ల నష్టం వాటిల్లినట్టు తేలింది. 15,980 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. 

Updated Date - 2021-11-23T08:48:49+05:30 IST