పెద్దిరెడ్డిని బర్తరఫ్‌ చేయాలి: అశోక్‌బాబు

ABN , First Publish Date - 2021-02-06T09:52:52+05:30 IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ప్రభుత్వ ఉద్యోగి ఏ ఒక్కరు సహకరించినా.. చర్యలు తీసుకుంటామనే హెచ్చరికలు చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తక్షణం బర్తరఫ్‌ చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు డిమాండ్‌ చేశారు.

పెద్దిరెడ్డిని బర్తరఫ్‌ చేయాలి: అశోక్‌బాబు

అమరావతి, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ప్రభుత్వ ఉద్యోగి ఏ ఒక్కరు సహకరించినా.. చర్యలు తీసుకుంటామనే హెచ్చరికలు చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తక్షణం బర్తరఫ్‌ చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు డిమాండ్‌ చేశారు. మంత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శుక్రవారం కోరారు. పంచాయతీ ఎన్నికల సమయంలోనే రాజ్యాంగ బద్ధ సంస్థలను నిర్వీర్యం చేసేలా మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరికలు చేయడం గర్హనీయమన్నారు. నిమ్మగడ్డకు తీర్థప్రసాదాలు పంపారని జేఈవోపై కక్ష సాధించడం దుర్మార్గమని మండిపడ్డారు. 


వెయ్యి కోట్లకు మీరే కొనొచ్చుగా: అయ్యన్న 

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ని రాష్ట్ర ప్రభుత్వమే కొని, విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని చాటాలని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సూచించారు. ఆర్టీసీని ప్రభుత్వంలోకి తీసుకున్న వాళ్లు, వెయ్యి కోట్లతో స్టీల్‌ ప్లాంట్‌ కొనలేరా? అని శుక్రవారం ట్వీట్‌ చేశారు. ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తే సహించేది లేదని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.  


‘రైతు కోసం తెలుగుదేశం’

టీడీపీ ‘రైతు కోసం తెలుగుదేశం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అమలాపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు ప్రభాకర్‌తో తెలుగు రైతు కమిటీలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. 


ధార్మిక సొమ్ము దారి మళ్లింపు!

జగన్‌ ప్రభుత్వం మరే మతం జోలికి వెళ్లకుండా కేవలం హిందూ ఆలయాలు, బ్రాహ్మణ కార్పొరేషన్‌ నిధులను మాత్రమే ఎందుకు దారిమళ్లిస్తోందని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరామ్‌ప్రసాద్‌ ప్రశ్నించారు. పాస్టర్‌ ప్రవీణ్‌ చక్రవర్తిని ఎందుకు శిక్షించడం లేదన్నారు.  

Updated Date - 2021-02-06T09:52:52+05:30 IST