ఎస్‌ఈసీ ఆదేశాలకు దిగివచ్చిన పెద్దిరెడ్డి

ABN , First Publish Date - 2021-02-06T22:42:13+05:30 IST

ఇప్పటివరకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు నిప్పులు చెరిగిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎట్టకేలకు దిగివచ్చారు.

ఎస్‌ఈసీ ఆదేశాలకు దిగివచ్చిన పెద్దిరెడ్డి

తిరుపతి: ఇప్పటివరకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు నిప్పులు చెరిగిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎట్టకేలకు దిగివచ్చారు. శనివారం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎస్‌ఈసీ ఆదేశాలకు కట్టుబడి ఉంటానని, వ్యతిరేకంగా మాట్లాడనని ప్రకటించారు. అంతేకాదు అక్రమాలకు పాల్పడనని, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనని చెప్పారు. నిన్నటి వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. చట్టబద్ధంగా వ్యవహరించని ఎన్నికల అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏకగ్రీవాలపై ఆయన (నిమ్మగడ్డ రమేష్) సమీక్ష ఏంటి? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు వద్ద నిమ్మగడ్డ బంట్రోతులా పనిచేస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. 


శనివారం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ మాటలు విని ఏకపక్షంగా వ్యవహరించే అధికారులను.. మా ప్రభుత్వం ఉన్నన్ని రోజులూ బ్లాక్‌ లిస్ట్‌లో పెడతాం. ఏకగ్రీవమైన అభ్యర్థులకు డిక్లరేషన్‌ ఇవ్వని అధికారుల పేర్లు తీసుకుని.. మార్చి 31 తర్వాత గుణపాఠం నేర్పుతాం’ అని హెచ్చరించిన విషయం తెలిసిందే. ‘మార్చి 31 తర్వాత నిమ్మగడ్డకు చంద్రబాబు ఫోన్‌ కూడా చేయడు. మేము బాబులాగా కాదు. మమ్మల్ని నమ్ముకున్నవాళ్లకు న్యాయం చేస్తాం. నేనేమీ మాట్లాడకపోయినా నాతోపాటు బొత్సపైనా గవర్నర్‌కు లేనిపోనివి ఫిర్యాదు చేశారు. దాంతో శాసనసభ ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేశాం. కమిటీ ముందుకు వచ్చి ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది’ అని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2021-02-06T22:42:13+05:30 IST