పాస్టర్‌ ప్రవీణ్‌ అడ్డదారులెన్నో!

ABN , First Publish Date - 2021-02-01T09:59:28+05:30 IST

దేవతా విగ్రహాలను తానే ధ్వంసం చేశానని వార్తల్లో నిలిచి జైలు పాలైన పాస్టర్‌ ప్రవీణ్‌ చక్రవర్తి అక్రమ డబ్బు సంపాదనలో మాతృదేశ ప్రతిష్ఠను బజారు కీడ్చాడని పేర్కొంటూ లీగల్‌ రైట్స్‌ ఫోరం (హైదరాబాద్‌) ఇటీవల జాతీయ బాలల హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.

పాస్టర్‌ ప్రవీణ్‌ అడ్డదారులెన్నో!

  • విదేశీ నిధుల కోసం తప్పుడు నివేదికలు
  • దేశ ప్రతిష్ఠను బజారుకీడ్చాడు
  • మతమార్పిళ్లతో కోట్లు వెనకేసుకున్నాడు
  • జాతీయ బాలల హక్కుల కమిషన్‌కు 
  • లీగల్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ ఫోరం ఫిర్యాదు 


కాకినాడ, జనవరి 31(ఆంధ్రజ్యోతి): దేవతా విగ్రహాలను తానే ధ్వంసం చేశానని వార్తల్లో నిలిచి జైలు పాలైన పాస్టర్‌ ప్రవీణ్‌ చక్రవర్తి అక్రమ డబ్బు సంపాదనలో మాతృదేశ ప్రతిష్ఠను బజారు కీడ్చాడని పేర్కొంటూ లీగల్‌ రైట్స్‌ ఫోరం (హైదరాబాద్‌) ఇటీవల జాతీయ బాలల హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. బానిసత్వం నుంచి బాలకార్మికులకు విముక్తి పేరిట కట్టుకథలల్లి దేశానికి అపఖ్యాతి తెచ్చేలా వ్యవహరించారంటూ ఫోరం ప్రతినిధులు పేర్కొన్నారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ప్రవీణ్‌ చక్రవర్తి కాకినాడ రూరల్‌ మండలంలో బాలబాలికల కోసం సైలోమ్‌ బ్లైండ్‌  సెంటర్‌  సొసైటీ పేరిట అనాథ శరణాలయం నడిపిస్తున్నాడు. ఫారిన్‌ కంట్రి బ్యూషన్‌ లైసెన్స్‌ కలిగిన ఈ సెంటర్‌కు 2013-18 వరకు అమెరికాలో ఉన్న సెట్‌ ఫ్రీ అలయన్స్‌, వాటర్‌ ఆఫ్‌ లైఫ్‌ అనే సంస్థల నుంచి ఐదేళ్లలో రూ. 93.67 కోట్లు అందాయి. వాస్తవానికి ఈ సెంటర్‌కు సదరు అమెరికా సంస్థలు నిధులు పంపుతుండడం వెనుక మత మార్పిళ్లే ప్రధాన ఉద్దేశంగా తేలింది. తదనుగుణంగా ప్రవీణ్‌ భారత్‌లో ఏ ఏడాది ఎంతమందిని మతం మార్చాడో వివరిస్తూ వాటర్‌ ఆఫ్‌ లైఫ్‌ సంస్థ తన అధికారిక వెబ్‌సైట్‌లో డేటా పెట్టింది.


దీనిపై ఫోరం 2019 డిసెంబరు 5న కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయగా, ఆ సంస్థ వెబ్‌సైట్‌ నుంచి వివరాలు తొలగించింది. ప్రవీణ్‌ విదేశీ నిధుల కోసం భారత్‌ పరువును రోడ్డుకీడ్చి తప్పుడు గణాంకాలను అమెరికన్‌ క్రైస్తవ సంస్థలకు అందించారన్నారు. దీనివల్ల ప్రపంచంలోనే భారత్‌లో అత్యధిక బానిసలున్నారని, వీరిలో 7- 14 ఏళ్ల మైనర్‌ బాలలున్నారనే దుష్ప్రచారం జరిగిందని పేర్కొన్నారు.


అంతటితో ఆగలేదు 

మరోవైపు ప్రవీణ్‌ చక్రవర్తి.. ఎక్కడెక్కడి నుంచో చిన్న పిల్లలను తీసుకువచ్చి, కృత్రిమ వీడియోలతో వారిని బానిస బాల కార్మికులుగా విదేశీ క్రైస్తవ సంస్థల అధిపతులకు చూపించి నిధులు రాబట్టడం ప్రారంభించాడన్నారు. అలాగే బానిసలుగా ఉన్న బాలికలు లైంగిక దాడులకు గురైనట్టు కట్టు కథలు సృష్టించేవాడన్నారు. ఇలా ప్రవీణ్‌ కోట్లు సంపాదించాడన్నారు. సదరు పాస్టర్‌ ఇప్పటి వరకు 41,765 మంది బానిసలుగా పనిచేస్తున్న బాలకార్మికులను విముక్తి చేసి, వారిని పునరావాసం కల్పించినట్టు సెట్‌ ఫ్రీ అలయన్స్‌ సంస్థ తన అధికారిక సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తోందన్నారు. 


పోలీస్‌, రెవెన్యూతో సంబంధం లేకుండా...: చట్ట ప్రకారం భారతదేశంలో ఏదైనా స్వచ్ఛంద సంస్థకు, వ్యక్తులకు బాలకార్మికులు కనిపిస్తే తొలుత పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వాలి. అలా కాకుండా అతని వద్ద వేలాదిమంది బాలలను బందీగా చేసుకునే అధికారం ఎవరిచ్చారో నిగ్గుతేల్చాలని ఫోరం కోరింది. లాక్‌డౌన్‌ సమయంలో తన వసతి గృహాల్లో 1500 మంది బాలబాలికలున్నారని, వారిలో 318 మందికి కరోనా సోకిందని సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టి మరీ ప్రవీణ్‌ చందాలు వసూలు చేశాడని లీగల్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ ఫోరం జాతీయ బాలల హక్కుల కమిషన్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ప్రవీణ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవడమేకాకుండా, అతడి అక్రమాలకు అడ్డుకట్టవేయాలని కోరింది.

Updated Date - 2021-02-01T09:59:28+05:30 IST