ఏసీబీ కలకలం

ABN , First Publish Date - 2021-10-07T09:36:05+05:30 IST

విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ ఇన్‌చార్జి డిప్యూటీ డీఎంహెచ్‌వో ఎంఎం రవికుమార్‌రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారం మేరకు బుధవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు.

ఏసీబీ కలకలం


ఐటీడీఏ ఇన్‌చార్జి డిప్యూటీ డీఎంహెచ్‌వో ఇల్లు, కార్యాలయంపై దాడులు

విశాఖ, రాజమండ్రి, విజయవాడలోని బంధువుల ఇళ్లలో సైతం

విలువైన ఆస్తులు, పత్రాలు లభ్యం

పార్వతీపురం, అక్టోబరు 6: విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ ఇన్‌చార్జి డిప్యూటీ డీఎంహెచ్‌వో ఎంఎం రవికుమార్‌రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారం మేరకు బుధవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. బొబ్బిలి మండలం గొల్లపల్లిలోని ఇంటితో పాటు విజయనగరం, విశాఖ, రాజమండ్రిలో బంధువుల ఇళ్లలో ఏకకాలంలో దాడులు చేశారు. పార్వతీపురంలోని డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ రికార్డులను పరిశీలించారు. మొత్తం తొమ్మిది బృందాలు సోదాల్లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ రఘువీర్‌విష్ణు విలేకరులతో మాట్లాడుతూ...డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో రవికుమార్‌రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు  కలిగిఉన్నారన్న సమాచారంతో కోర్టు అనుమతితో దాడులు నిర్వహించినట్టు చెప్పారు. తెర్లాం, విజయనగరం ప్రాంతాల్లో అతిథి గృహాలు ఉన్నాయని గుర్తించినట్టు తెలిపారు. విలువైన డాక్యుమెంట్లు, బంగారం, నగదు లభించినట్టు చెప్పారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు.  

Updated Date - 2021-10-07T09:36:05+05:30 IST