‘పంచాయతీ’ ముగియగానే పరిషత్‌ ఎన్నికలు!

ABN , First Publish Date - 2021-02-06T08:03:40+05:30 IST

పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) స్పష్టమైన సంకేతాలు పంపింది.

‘పంచాయతీ’ ముగియగానే పరిషత్‌ ఎన్నికలు!

  • స్పష్టత ఇచ్చిన ఎస్‌ఈసీ
  • రేషన్‌ వాహనాల రంగులపై అభ్యంతరం
  • పరిషత్‌ ఎలక్షన్ల దాకా తటస్థ రంగులే
  • ప్రభుత్వానికి ఎన్నికల సంఘం సూచన


అమరావతి, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) స్పష్టమైన సంకేతాలు పంపింది. ఇంటింటికీ రేషన్‌ పంపిణీ వాహనాలకు వైసీపీ రంగులకు సంబంధించిన ఆదేశాల్లో ఈ విషయం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే రేషన్‌ వాహనాలకు ఏవైనా తటస్థ రంగులు వేయాలని సూచించింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తవగానే మళ్లీ  వైసీపీ రంగులు పునరుద్ధరించవద్దని.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తయ్యే దాకా తటస్థ రంగులు కొనసాగించాలని తెలిపింది. ఎలాగూ పంచాయతీ ఎన్నికలు పూర్తవగానే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రారంభిస్తామని, అవి పూర్తయ్యే దాకా తటస్థ రంగులు వాహనాలపై ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. రాష్ట్రంలో పరిషత్‌, మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతాయా.. లేదా? జరిగితే కొత్తగా నోటిఫికేషన్‌ ఇచ్చి చేపడతారా..? లేక ఎక్కడ ఆగిపోయాయో అక్కడి నుంచే మొదలుపెడతారా అన్న సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్‌ఈసీ రేషన్‌ వాహనాలపై రంగుల విషయంలో స్పష్టత ఇస్తూ జారీ చేసిన ఆదేశాల్లో ఈ అనుమానాలను నివృత్తి చేసినట్లయింది. పంచాయతీ ఎన్నికలు పూర్తవగానే పరిషత్‌ ఎన్నికలు జరుగుతాయని స్పష్టమైంది. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. పరిషత్‌ ఎన్నికలు ఎప్పుడు ప్రారంభించినా.. 4 వారాల ముందు కోడ్‌ అమల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఈ నెల 21తో పంచాయతీ ఎన్నికలు ముగియనున్నందున వెంటనే పరిషత్‌ ఎన్నికలు ప్రారంభించే అవకాశముందని అంటున్నారు. ఎలాగూ కోడ్‌ అమల్లో ఉన్నందున వెంటనే పరిషత్‌ ఎన్నికలు నిర్వహించేందుకు సుప్రీంకోర్టు తీర్పు అడ్డు రాదని భావిస్తున్నారు.


Updated Date - 2021-02-06T08:03:40+05:30 IST