రెట్టించిన ఉత్సాహం!

ABN , First Publish Date - 2021-12-07T07:38:00+05:30 IST

అమరావతి రైతుల ఉద్యమం పల్లెలు, పట్టణాలు, నగరాలు దాటుకొని ఇప్పుడు జాతీయస్థాయి రైతు ఉద్యమంగా...

రెట్టించిన ఉత్సాహం!

జాతీయ స్థాయికి అమరావతి నినాదం.. రాజధాని రైతులకు పెరుగుతున్న మద్దతు

‘మూడు’ చట్టం రద్దు చేసేవరకు పోరాటం.. ఢిల్లీ రైతు సంఘాల ప్రతినిధుల హామీ

యూపీ, ఢిల్లీ, తెలంగాణ రైతుల సంఘీభావం.. పాదయాత్రకు అపూర్వ స్పందన

అడుగు పెట్టకముందే సీమ పోలీసుల అడ్డంకులు!

 జాతీయ స్థాయికి అమరావతి నినాదం

 యూపీ, ఢిల్లీ, తెంలంగాణ రైతుల సంఘీభావం


నెల్లూరు, మచిలీపట్నం, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): అమరావతి రైతుల ఉద్యమం పల్లెలు, పట్టణాలు, నగరాలు దాటుకొని ఇప్పుడు జాతీయస్థాయి రైతు ఉద్యమంగా రూపాంతరం చెందుతోంది. పక్క రాష్ట్రాల నుంచి సైతం రైతు సంఘాల నాయకులు తరలివచ్చి మహాపాదయాత్రకు సంఘీబావం తెలుపుతున్నారు. మూడు రాజధానుల చట్టం రద్దుచేసే వరకు అమరావతి రైతుల ఉద్యమానికి అండగా ఉంటామని నినదిస్తున్నారు. రాజధాని ఉద్యమాన్ని జాతీయ ఉద్యమంగా చేస్తామని మాట ఇస్తున్నారు. ఒకటే రాష్ట్రం, ఒకే రాజధాని అనే నినాదంతో అమరావతి రైతులు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు చేపట్టిన మహాపాదయాత్రకు మద్దతు రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో సాగుతున్న యాత్రలో ఆదివారం తమిళనాడుకు చెందిన రైతు సంఘ నాయకులు పాల్గొని రాజధాని రైతులకు మద్దతు ఇవ్వగా.. సోమవారం ఢిల్లీ, తెలంగాణకు చెందిన రైతులు కూడా తరలివచ్చి యాత్రకు సంఘీభావం తెలిపారు. అమరావతి రైతులతో కలిసి నడిచారు. దీంతో సోమవారం ఉదయం బాలాయపల్లి మండలం నుంచి ప్రారంభమైన మహా పాదయాత్ర రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగింది. మధ్యాహ్నానికి యాత్ర వెంకటగిరి చేరుకోగా.. ఇక్కడ ఉత్తరప్రదేశ్‌ చెందిన రైతు నాయకులు సర్జయ్‌ చౌదరి, అభిషేక్‌, గౌరవ్‌ ఉత్తమ్‌, అమిత్‌, ఢిల్లీ ఉద్యమ నాయకులు రాకేశ్‌ టికాయత్‌.. పాదయాత్రలో కలిసి సంఘీబావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజధాని పేరుతో రైతుల భూములు లాక్కొని ఇప్పుడిలా చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. అన్ని రాష్ట్రాల రైతు సంఘాల మద్దతు కూడగట్టి అమరావతి రైతులకు అండగా పోరాడుతామన్నారు. అమరావతి రైతుల ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళతామన్నారు.

 

బాలాయపల్లి మండలం వెంగమాంబపురం, అక్కసముద్రం గ్రామాల్లో పొలాల్లో పనిచేస్తున్న కూలీల వద్దకు వెళ్లిన రాజధాని మహిళా రైతులు కూడా పొలంలోకి దిగి వరినాట్లు వేశారు. దీంతో కూలీలు సైతం జై అమరావతి అంటూ నినదించారు. వెంకటగిరి పొలిమేరల్లో స్థానికులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాదయాత్రకు ఎదురేగి ఘనస్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ట్రాక్టర్‌ నడుపుతూ ర్యాలీకి ముందు కదలగా, బ్యాండు మేళాలు, డప్పులు, వివిధ కళారూపాల విన్యాసాలతో పాదయాత్ర అట్టహాసంగా సాగింది. హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త హరిశ్చంద్ర ప్రసాద్‌ రూ.10లక్షల విరాళం ఇచ్చారు. రాజధాని రైతులు వెంకటగిరి పోలేరమ్మను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. పాదయాత్రలో టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.


రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన: జేఏసీ

రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన సాగుతోందనడానికి అన్నదాతలు పడుతున్న కష్టాలే నిదర్శనమని మహా పాదయాత్ర జేఏసీ నేత శివారెడ్డి అన్నారు. వెంకటగిరిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం పాదయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఎంపేడు వద్ద పాదయాత్ర రైతులు అన్నం తినేందుకు చదును చేసుకున్న స్థలాన్ని ఆ గ్రామ సర్పంచ్‌ దున్ని వేయించడం దారుణమన్నారు.  


మచిలీపట్నంలో కొనకళ్ల, కొల్లు పాదయాత్ర

అమరావతి రాజధాని కోసం కృష్ణాజిల్లా మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ శ్రేణులు సైతం కదం తొక్కాయి. రైతుల పాదయాత్రకు మద్దతుగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ నేతృత్వంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం మచిలీపట్నంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర జోలెపట్టి అమరావతి ఉద్యమానికి విరాళాలు సేకరించారు. 

Updated Date - 2021-12-07T07:38:00+05:30 IST