పాదయాత్రకు అనుమతి లేదు

ABN , First Publish Date - 2021-10-29T08:59:11+05:30 IST

పాదయాత్రకు అనుమతి లేదు

పాదయాత్రకు అనుమతి లేదు

‘న్యాయస్థానం టూ దేవస్థానం’తో శాంతిభద్రతల సమస్య

అమరావతి జేఏసీ నేతలకు డీజీపీ సవాంగ్‌ లేఖ

మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్న రైతులు

రాజధాని రైతుల మహాపాదయాత్రకు అనుమతి లేదు


గుంటూరు, తుళ్లూరు, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): రాజధాని రైతులు తలపెట్టిన ‘న్యాయస్థానం టు దేవస్థానం’ మహాపాదయాత్రకు అనుమతించేదిలేదని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్పష్టం చేశారు. ఈమేరకు గురువారం అమరావతి పరిరక్షణ సమితి నేతలకు డీజీపీ లేఖ రాశారు. శాంతి భద్రతల సమస్యతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌, రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అనుమతి ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. దీంతో మళ్లీ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు అమరావతి పరిరక్షణ సమితి నేతలు తెలిపారు. అమరావతి ఉద్యమాన్ని విస్తృతం చేసే లక్ష్యంతో మహాపాదయాత్ర చేపట్టాలని రైతు జేఏసీ నేతలతోపాటు అమరావతి పరిరక్షణ సమితి నిర్ణయించింది. నవంబరు 1 నుంచి డిసెంబరు 17 వరకు పాదయాత్ర చేపట్టాలని భావించారు. పోలీసుల అనుమతి కోరగా వారు స్పందించలేదు. దీంతో రైతు సంఘం నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయాన్ని 28లోగా  తేల్చాలని హైకోర్టు డీజీపీని ఆదేశించింది. దీంతో పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. అయితే శాంతియుతంగా పాదయాత్ర చేస్తామంటే అనుమతి నిరాకరించడంపై రాజధాని రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 600 రోజులుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నామని, ఎప్పుడైనా శాంతిభద్రతల సమస్య తలెత్తిందా అని ప్రశ్నిస్తున్నారు. 


అభ్యంతరం ఎందుకు: కాటా అప్పారావు

రాజధాని అమరావతికి భూములు ఇచ్చి, ప్రభుత్వం మోసపూరితంగా తెచ్చిన 3రాజధానుల ప్రతిపాదనతో రోడ్డున పడ్డాం. 5కోట్ల మంది అమరావతి కావాలని స్పష్టం చేస్తున్నారు. పాదయాత్రగా ప్రజల దగ్గరకు వెళ్లి బాధ చెప్పుకోవటంలో తప్పులేదు. అదేమీ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేది కాదు. రాజ్యాంగం కల్పించిన హక్కును పోలీసులు కాదనటం మంచిది కాదు. 


రాజ్యాంగం కల్పించిన హక్కు: బండ్లమూడి ప్రియాంక

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మా సమస్యను పరిష్కరించటం లేదు. శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నా స్పందన లేదు. అమరావతి రైతులకు 5కోట్ల మంది ప్రజల మద్దతు ఉంది. మా గోడు ఆ ప్రజలకే చెప్పుకోవాలి. అందుకే పాదయాత్ర తలపెట్టాం. ఇంతకాలంగా ఉద్యమం చేస్తున్నాం. ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగలేదు. పాదయాత్ర కూడా శాంతియుతంగానే చేస్తాం. ఇది మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు.

Updated Date - 2021-10-29T08:59:11+05:30 IST