‘పర్మినెంట్‌’ పేరిట 36 లక్షలకు టోకరా!

ABN , First Publish Date - 2021-08-10T09:00:48+05:30 IST

మాజీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పీఏ జాన్‌ప్రవీణ్‌కుమార్‌ తమ నుంచి రూ.36 లక్షలు తీసుకుని మోసం చేశాడని స్థానిక ఏసీ కళాశాలకు చెందిన సుమారు పదిమందికి పైగా...

‘పర్మినెంట్‌’ పేరిట 36 లక్షలకు టోకరా!

  • అప్పటి మంత్రి గంటా పీఏపై ఫిర్యాదు  

గుంటూరు, ఆగస్టు 9: మాజీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పీఏ జాన్‌ప్రవీణ్‌కుమార్‌ తమ నుంచి రూ.36 లక్షలు తీసుకుని మోసం చేశాడని స్థానిక ఏసీ కళాశాలకు చెందిన సుమారు పదిమందికి పైగా అన్‌ ఎయిడెడ్‌ అధ్యాపకులు అర్బన్‌ ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఫిర్యాదు చేశారు. తాము 2000 సంవత్సరం నుంచి పని చేస్తున్నా ఉద్యోగాలు పర్మినెంట్‌ కాలేదని.. దీనిపై 2013లో కోర్టునాశ్రయించగా, తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని తెలిపారు. కోర్టు ఉత్తర్వులను 2014లో ఉన్నత విద్యా కమిషనర్‌కు అందించగా.. ఆయన ప్రిన్సిపల్‌ సెక్రటరీకి ప్రపోజల్‌ పంపారన్నారు. అయినా అధికారులు స్పందించలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో తమలో ఒకరైన మోపర్తి శిరిల్‌ కుమార్‌ బంధువు విశ్రాంత్‌వర్ధన్‌.. తన తమ్ముడైన జాన్‌ప్రవీణ్‌కుమార్‌ను పరిచయం చేశాడన్నారు. ప్రవీణ్‌ను 2018 మే 13న తాము విశాఖలో కలవగా, ఆయన నాటి విద్యా మంత్రి గంటాకు పరిచయం చేశాడన్నా రు. గంటా తమ పట్ల సానుకూలంగా స్పందించినా.. ఈ విషయమై ప్రవీణ్‌తో మాట్లాడాలని సూచించారన్నారు. ఆ తర్వాత ప్రవీణ్‌.. ‘మీ పని అయిపోతుంద’ంటూ.. బ్యాంకు ఖాతా నంబరు చెప్పి డబ్బు కోసం ఒత్తిడి చేశాడన్నారు. దీంతో తాము అదే ఏడాది పలు విడతలుగా ప్రవీణ్‌కుమార్‌ అకౌంట్‌కు రూ.36 లక్షలు పంపించామన్నారు. ఇప్పటికీ తమకు ఉద్యోగాలు పర్మినెంట్‌ కాకపోవటంతో, డబ్బులైనా తిరిగివ్వాలని ప్రవీణ్‌ను అడిగితే.. తమను బెదిరిస్తున్నాడని ఆరోపించారు.  


Updated Date - 2021-08-10T09:00:48+05:30 IST