‘ఆక్సిజన్‌’ ఆపరేషన్‌!

ABN , First Publish Date - 2021-05-08T08:18:03+05:30 IST

విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో 600 మంది కొవిడ్‌ బాధితులున్నారు. వారిలో 400 మంది కి ఆక్సిజన్‌ ద్వారా వైద్యులు చికిత్స ఇస్తున్నారు

‘ఆక్సిజన్‌’ ఆపరేషన్‌!

400 మంది ప్రాణాలు నిలిపే ప్రాణవాయువు కోసం టెన్షన్‌

విజయవాడ ప్రభుత్వాస్పత్రికి సకాలంలో చేరాల్సిన ట్యాంకర్‌

అర్ధరాత్రి గల్లంతుతో హైటెన్షన్‌

ఒడిసా నుంచి వస్తుండగా ‘తూర్పు’లో తెగిన సంబంధాలు

రంగంలోకి 2 జిల్లాల పోలీసులు

హైవేపై 3 గంటలపాటు ఆపరేషన్‌

ప్రత్తిపాడు వద్ద ట్యాంకర్‌ గుర్తింపు 

గ్రీన్‌చానల్‌ ద్వారా భద్రంగా ఆస్పత్రికి


800 కిలోమీటర్లపైనే దూరం! 400 ప్రాణాలు! అంతదూరం నుంచి తెచ్చే ప్రాణవాయువే విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో కొవిడ్‌ చికిత్స తీసుకొంటున్న ఇంతమందికి ప్రాణం పోయాలి! ఆక్సిజన్‌ తీసుకొని ఒడిసా నుంచి ఆస్పత్రికి బయలుదేరిన ట్యాంకర్‌ గురువారం అర్ధరాత్రి గల్లంతు! మరోవైపు శుక్రవారం ఉదయం 9గంటలనాటికి నిండుకోనున్న ఆస్పత్రిలోని ఆక్సిజన్‌ నిల్వలు! దీంతో ఒక్కసారిగా ఆక్సిజన్‌ టెన్షన్‌! రెండు జిల్లాల పోలీసులు మూడుగంటలకుపైగా హైవేలపై జల్లెడ! ట్యాంకర్‌ ఆచూకీ దొరకడంతో ఎట్టకేలకు ‘ఆక్సిజన్‌ ఆపరేషన్‌’ సుఖాంతమైంది. 


విజయవాడ, కాకినాడ, మే 7(ఆంధ్రజ్యోతి) : విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో 600 మంది కొవిడ్‌ బాధితులున్నారు. వారిలో 400 మంది కి ఆక్సిజన్‌ ద్వారా వైద్యులు చికిత్స ఇస్తున్నారు. వారికి అందుతున్న ఆక్సిజన్‌ శుక్రవారం ఉదయం 9 వరకే వస్తుంది. ఒడిసాలో 18 టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ నింపుకొని ఆ సమయానికి ట్యాంకర్‌ విజయవాడ ఆస్పత్రికి చేరుకోవాలి. షెడ్యూల్‌ ప్రకారమే ఒడిసాలో ట్యాంక ర్‌ బయలుదేరింది. విశాఖపట్నం వరకు బా గానే వచ్చింది. తూర్పుగోదావరి జిల్లాలోకి ప్ర వేశించిన తర్వాత ట్యాంకర్‌ డ్రైవర్‌తో అధికారులకు సంబంధాలు తెగిపోవడంతో గురువా రం అర్ధరాత్రి ఒక్కసారిగా హైటెన్షన్‌ బయలుదేరింది. ఆస్పత్రికి సకాలంలో ట్యాంకర్‌ చేరుతుందా లేదా అనే టెన్షన్‌ రెండు జిల్లాల పోలీసులను పరుగులు పెట్టించింది. ట్యాంకర్‌ జా డ కోసం తూర్పుగోదావరి, కృష్ణాజిల్లా పోలీసు లు ఏకంగా మూడుగంటలపాటు హైవేలో ఆపరేషన్‌ చేపట్టారు. ఒక్కో గంట గడుస్తున్నకొద్దీ ఉత్కంఠను పెంచుకుపోయిన ఈ ఆపరేషన్‌ సుఖాంతం అయింది.


ఇలా మొదలైంది..

విజయవాడ ప్రభుత్వాస్పత్రి ఆవరణలో ఉన్న ఆక్సిజన్‌ ప్లాంట్‌కు 800 కిలోమీటర్ల దూరంలోని ఒడిసా నుంచి ప్రాణవాయువు అందాలి. అక్కడ గురువారం ఉదయం ఆక్సిజన్‌ నింపుకొని ట్యాంకర్‌ బయలుదేరింది. ట్యాంకర్‌ డ్రైవర్‌ సింగ్‌. బయలుదేరేటప్పుడే ట్యాంకర్‌ నంబరు.. డ్రైవర్‌ మొబైల్‌ నంబరును ఆక్సిజన్‌ కంపెనీ కృష్ణాజిల్లా రెవెన్యూ అధికారులకు పంపింది. ట్యాంకర్‌ కదలికలను ఎప్పటికప్పడు పర్యవేక్షించడానికి జాయింట్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి గంటకు, రెండు గంటలకు ఒకసారి సింగ్‌కు ఫోన్‌ చేస్తూ.. పరిస్థితిని ఆరా తీస్తూనే ఉన్నారు. ట్యాంకర్‌ విశాఖ జిల్లా దాటి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించే వరకు డ్రైవర్‌ సింగ్‌తో జేసీ కార్యాలయంలోని విభాగానికి సంబంధాలు కొనసాగాయి. ఆ తర్వాత రాత్రి 10 గంటల ప్రాంతంలో సమాచారం తెగిపోయింది. డ్రైవర్‌కు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా జవాబు లేదు. రెవె న్యూ అధికారులు వెంటనే విజయవాడ పోలీసు కమిషనర్‌ బ త్తిన శ్రీనివాసులుకు విషయాన్ని చెప్పారు. ఆయన హుటాహుటి న తూర్పు, పశ్చిమగోదావరి, కృ ష్ణా జిల్లాల ఎస్పీలకు ఫోన్లు చేశారు. 


అక్కడినుంచి విజయవాడ ఆస్పత్రికి దూరం 213 కిలోమీటర్లు! సమాచారం అం దుకున్న తూర్పుగోదావరి జిల్లా పోలీసులు తెల్లవారుజామున రెండు గంటల సమయంలో హైవేపైకి చేరుకొన్నారు. ప్రత్తిపాడు సీఐ వై.రాంబాబు, ఎస్‌ఐ కె.సుధాకర్‌, సిబ్బంది, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌  ఇన్‌స్పెక్టర్‌ నాయకత్వంలో హోటళ్లు, దాబా ల వద్ద ఆరా తీస్తూ.. గంటకుపైగా శ్రమించారు. ఈ క్రమం లో ధర్మవరం హైవే దాబా వద్ద ఆగి ఉన్న ఆక్సిజన్‌ ట్యాంకర్‌ను అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఎట్టకేలకు గుర్తించారు. డ్రైవర్‌ సింగ్‌ జాతీయ రహదారికి పక్కన కాకుండా కాస్త లోపలకు ట్యాంకర్‌ను నిలుపుదల చేయడం వల్ల ఆచూకీ లభించడం కష్టమైంది. 


క్యాబిన్‌లో నిద్రపోతున్న సింగ్‌ను లేపి ట్యాంకర్‌ను వెంటనే విజయవాడకు తీసుకెళ్లాలని ప్రత్తిపాడు పోలీసులు చెప్పారు. సుదూరం నుంచి నడపవడం వల్ల అప్పటికే తాను అలసిపో యి ఉన్నానని, డ్రైవింగ్‌ చేయడం కష్టంగా ఉండడం వల్లే ఇక్కడ ట్యాంకర్‌ను ఆపేసి విశ్రాంతి తీసుకుంటున్నానని సింగ్‌ చెప్పాడు. ప్రత్తిపాడు ఇన్‌స్పెక్టర్‌ వద్ద పనిచేస్తున్న సత్తిబాబు అనే సీనియర్‌ హోంగార్డు కె. సత్యనారాయణను కూడా ట్యాంకర్‌లో ఎక్కించారు. ధర్మవరం నుంచి విజయవాడ వరకు గ్రీన్‌ చానల్‌ ఏర్పాటుచేసి.. ట్యాంకర్‌ను జిల్లా దాటించారు. అప్పుడు సమయం రెండు గంటలు.


హైవేపై జల్లెడ..

ఈ సమయానికి టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ జీవీ రమణమూర్తి హనుమాన్‌జంక్షన్‌ వైపు జాతీయ రహదారిపై తన సిబ్బందితో సిద్ధంగా ఉన్నారు. రాత్రి 11.30 గంటల నుంచి 1.30 గంటల వరకు ట్యాంకర్‌ కోసం జాతీయ రహదారిని జల్లెడ పట్టారు. పోలీసులకు ఎక్కడా ఆక్సిజన్‌ ట్యాంకర్‌ కనిపించలేదు. ఇంతలో తూర్పుగోదావరి జిల్లా పోలీసుల నుంచి కబురు అందింది. ట్యాంకర్‌ హనుమాన్‌ జంక్షన్‌కు ఉదయం 6.30, 7 గంటలకు చేరుకొంది. సింగ్‌కు సహాయం గా వచ్చిన సత్యనారాయణే ట్యాంకర్‌ను నడిపారు. అయితే, అంత భారీ వాహ నం నడపడం ఆయనకు కొత్త. పైగా తేడా వస్తే కష్టమనే టెన్షన్‌ మరోవైపు! దీంతో గ్రీన్‌చానల్‌ ఏర్పాటుచేసినా.. గంట కు 40 కిలోమీటర్లు చొప్పున ఆయన డ్రైవింగ్‌ చేశారు. ఎట్టకేలకు ఎనిమిదిన్న ర గంటలకు ట్యాంకర్‌ను ప్రభుత్వాస్పత్రి కి చేర్చారు. హైవేపై నిర్వహించిన మూ డు గంటల ఆపరేషన్‌ ఫలించడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. ట్యాంకర్‌ ప్రభుత్వాస్పత్రికి చేరుకోగానే వైద్యుల్లో ఉత్కంఠ తొలగిపోయింది. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌... రెండు జిల్లాల పోలీసులను అభినందించారు. 

Updated Date - 2021-05-08T08:18:03+05:30 IST