ఊపిరాడటం లేదు!

ABN , First Publish Date - 2021-05-08T08:09:07+05:30 IST

ప్రైవేటు ఆక్సిజన్‌ ప్లాంట్ల ముందు సిలిండర్లు బారులు తీరుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ప్లాంట్లలో ఆక్సిజన్‌ ఎప్పుడు అయిపోతుందో అనే భయాందోళనలు వెంటాడుతున్నాయి

ఊపిరాడటం లేదు!

ఆక్సిజన్‌ అవసరం 700 టన్నులు

కేంద్రం కేటాయింపు 480 టన్నులు

440 టన్నులు మించని సరఫరా

విశాఖను వదిలేసి ఇతర రాష్ట్రాలకు!

కేంద్రంపై ఒత్తిడి చేయని రాష్ట్రం

ఐదు ఆక్సిజన్‌ ప్లాంట్లలోనూ నిర్లక్ష్యం

3 బోధనాస్పత్రులకు అందని యంత్రాలు

పెండింగ్‌లో తిరుపతి, విశాఖ, కర్నూలు

అవే ఉంటే 500 పడకలకు ప్రాణవాయువు

ఇప్పటికైనా కేంద్రంపై ఒత్తిడి తేవాలి

ఆక్సిజన్‌ కేటాయింపులు పెంచుకోవాలి


ఏపీకి ఊపిరాడటం లేదు. కేంద్రం నిర్లక్ష్యం కొంత... రాష్ట్ర సర్కారు నిర్లిప్తత మరింత... రెండూ కలిసి కొవిడ్‌ రోగులకు ప్రాణవాయువు అందకుండా చేస్తున్నాయి. ఆక్సిజన్‌ సరఫరా పెంచాల్సిన పాలకులు ఆ ప్రయత్నాలు మానేసి ప్రవచనాలు చెబుతున్నారు. పక్క రాష్ట్రాలు కేంద్రంతో పోరాడి అవసరానికి మించి ఆక్సిజన్‌ నిల్వలు తెప్పించుకుంటుంటే... ‘మీ దయా, మా ప్రాప్తం’ అంటూ మౌనం పాటిస్తున్నారు. చివరికి మన రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఉత్పత్తి అవుతున్న ఆక్సిజన్‌ ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నా... గప్‌చుప్‌!


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ప్రైవేటు ఆక్సిజన్‌ ప్లాంట్ల ముందు సిలిండర్లు బారులు తీరుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ప్లాంట్లలో ఆక్సిజన్‌ ఎప్పుడు అయిపోతుందో అనే భయాందోళనలు వెంటాడుతున్నాయి. ఒక్కోరోజు ఒక్కో ఆస్పత్రిలో ‘ప్రాణవాయువు అందక కొవిడ్‌ బాధితుల మృతి’ అనే వార్తలు వస్తూనే ఉన్నాయి. ఏమిటీ దుస్థితి? ఎందుకీ పరిస్థితి? అని ప్రశ్నిస్తే.... దీనికి  కేంద్ర ప్రభుత్వం కొంత కారణమైతే... రాష్ట్ర ప్రభుత్వ మౌనం మరో కారణం అని చెప్పక తప్పదు. దేశవ్యాప్తంగా మార్చి 15 నుంచి కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైంది. మెడికల్‌ ఆక్సిజన్‌కు విపరీతమైన డిమాండ్‌ పెరుగుతుందని తొలి నెలరోజుల్లో ఎవ్వరూ ఊహించకపోవడం నిజమే.  ఏప్రిల్‌ 15 నుంచి దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ అత్యవసరంగా మారిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిన రాష్ట్రాలకు ఆక్సిజన్‌ కేటాయింపులు చేసింది. అందులో భాగంగా మన రాష్ట్రానికి 480 టన్నుల ఆక్సిజన్‌ కేటాయించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 11 ఆక్సిజన్‌ ప్లాంట్ల నుంచి ఏపీ ఆక్సిజన్‌ను దిగుమతి చేసుకోవాలి. కానీ... రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజూ 440 టన్నులకు మించి దిగుమతి చేసుకోలేని పరిస్థితి. మరోవైపు రోజురోజుకూ ఆక్సిజన్‌ అవసరాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కలిపి రోజుకు 650 నుంచి 700 మెట్రిక్‌ టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ అవసరముంది. కానీ... 440 టన్నులకు మించి రావడంలేదు. స్థానికంగా కొన్ని ప్లాంట్లలో 10, 20 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి జరుగుతున్నా... ప్రస్తుత అవసరాలకు అది ఏ మాత్రం సరిపోవడం లేదు. దీంతో రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత తీవ్రమైంది. ‘ఆక్సిజన్‌ బెడ్‌’కు డిమాండ్‌ పెరిగి... కొవిడ్‌ చికిత్స లక్షలు పలుకుతోంది. మరోవైపు.. ఆక్సిజన్‌ కొరత నేపథ్యంలో, రోగులను చేర్చుకోవడానికి ఆస్పత్రుల యాజమాన్యాలు భయపడిపోతున్నారు. 


అవే పూర్తయి ఉంటే...

విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి బోధనాసుపత్రుల్లో ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్రం గతంలోనే అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం స్థలం చూపిస్తే... కేంద్రం యంత్ర సామగ్రి పంపించాలన్నది ఒప్పందం. రెండు నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం స్థలం చూపించింది. కానీ... కేంద్రం నుంచి స్పందన కనిపించలేదు. కాకినాడ, కర్నూలు బోధనాసుపత్రులకు మాత్రమే యంత్రాలు పంపించింది. ఇందులో... కాకినాడ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ప్లాంటు ఇప్పటికే పని చేస్తోంది. కర్నూలులో ప్లాంట్‌ రెండు రోజుల్లో ప్రారంభం కాబోతుంది. కీలకమైన విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి బోధనాసుపత్రులకు మాత్రం ఇప్పటిదాకా కేంద్రం నుంచి ఆక్సిజన్‌ ఉత్పత్తి యంత్రాలు అందలేదు. ఈ ప్లాంట్ల ద్వారా నిమిషానికి వెయ్యి లీటర్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి అవుతుంది. ఒక్కో ఆస్పత్రిలో 500 పడకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆక్సిజన్‌ సరఫరా జరిగేది. కానీ... కేంద్రం చేసిన ఆలస్యంతో మూడు ప్రధాన బోధనాస్పత్రులు ఆక్సిజన్‌ కోసం ఎదురు చూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆక్సిజన్‌ ఉత్పత్తి యంత్రాలను వెంటనే పంపించాలని ఒత్తిడి చేయం లేదు.


విమానాల ద్వారా...

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన ప్లాంట్ల నుంచి ఆక్సిజన్‌ తెప్పించుకోవడం అత్యంత శ్రమతో కూడిన పనిగా మారింది. ఏపీకి కేటాయించిన 480 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌లో 170 టన్నులు మాత్రమే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నుంచి కేటాయించారు. మిగిలింది ఒడిసా, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి తెప్పించుకోవాలి. ఒడిసాలోని ప్లాంట్‌ నుంచి ఆక్సిజన్‌ను తెప్పించాలంటే ఆరు రోజుల పడుతోంది. వెళ్లడానికి రెండు రోజులు, ఆక్సిజన్‌ లోడ్‌ చేసుకోవడానికి రెండు రోజులు, తిరిగి రావడానికి రెండు రోజులు! దీంతో కేంద్ర ప్రభుత్వం సహాయంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ ఖాళీ ట్యాంకర్లను ఎయిర్‌ లిఫ్ట్‌ (విమానాల ద్వారా) చేస్తోంది. అయినప్పటికీ, రాష్ట్రానికి అవసరమైన ఆక్సిజన్‌ అందడం లేదు.


కేంద్రంపై నోరెత్తం...

కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 18వ తేదీన అన్ని రాష్ట్రాలకు ఆక్సిజన్‌ కేటాయింపులు చేసింది. ఆ సమయంలో అనేక రాష్ట్రాలు కేంద్రం జరిపిన కేటాయింపులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. చివరికి తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్రంపై ఒత్తిడి పెంచింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాలకు ఆక్సిజన్‌ కేటాయింపులు పెంచుతూ కేటాయింపుల్లో మార్పులు చేసింది. ఉదాహరణకు... తెలంగాణకు 250 మెట్రిక్‌ టన్నుల నుంచి 400 టన్నులకు పెంచా రు. గుజరాత్‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల కేటాయింపులనూ పెంచింది. కానీ... ఏపీ ప్రభుత్వం అప్పుడేమీ మాట్లాడలేదు. తర్వాత ఆరోగ్యశాఖ అధికారులు ఆడగగా కేటాయింపులను 480 టన్నులకు పెంచారు. మన రాష్ట్రంలోనే ఉన్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో రోజుకు 450 నుంచి 500 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి జరుగుతోంది. ఇందులో 200 మెట్రిక్‌ టన్నులను కొవిడ్‌ బాధితులకు అందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ మొత్తాన్ని ఏపీకే కేటాయించాలి. కానీ, కేంద్రం వివిధ రాష్ట్రాలకు కేటాయింపులు చేసింది. దీనిపై ప్రభుత్వం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. కర్ణాటక, ఒడిసాల నుంచి కాకుండా... దగ్గరల్లో ఉన్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నుంచి మొత్తం తమకే కేటాయించాలని ప్రభుత్వం కేంద్రాన్ని అడగడం లేదు.


కేటాయుంపులు ఇలా..

ఆక్సిజన్‌ కేటాయింపుల్లో కూడా కేంద్రం రాష్ట్రాల మధ్య వ్యత్యాసం చూపిస్తోంది. మహారాష్ట్రకు అత్యధికంగా 1784 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను కేటాయించింది. ఆ తర్వాత గుజరాత్‌కు 975 టన్నులను పంపిస్తోంది. కర్ణాటకకు 802, మధ్యప్రదేశ్‌కు 649, యూపీకి 857 టన్నులు కేటాయించింది. మిగిలిన రాష్ట్రాలన్నింటికి తగ్గించేసింది. ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితి అందరికి తెలిసిందే. ఆ రాష్ట్రానికి కూడా 490 టన్నులతో సరిపెట్టింది. తమిళనాడుకు 430, తెలంగాణకు 400 టన్నులపైన కేంద్రం పంపిస్తోంది. అయితే, ఈ రెండు రాష్ట్రాల్లో స్థానిక ఉత్పత్తి ఎక్కువ కావడంతో పరిస్థితి కాస్త అదుపులోనే ఉంది. ఏపీలో మాత్రం ఎక్కువశాతం కేంద్రం జరిపిన కేటాయింపులపైనే ఆధారపడాల్సి వస్తోంది. పరిస్థితులు మరింత దిగజారకముందే కేంద్రంపై ఒత్తిడి తెచ్చయినా ఆక్సిజన్‌ కేటాయింపులు పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Updated Date - 2021-05-08T08:09:07+05:30 IST