ఓటీఎస్‌ పేరుతో ఆర్భాటం

ABN , First Publish Date - 2021-12-07T07:44:14+05:30 IST

ఎప్పుడో కట్టుకున్న పేదల ఇళ్లకు ఓటీఎస్‌ కింద నగదు వసూలు చేస్తున్న ప్రభుత్వం ఈ పథకం పేరుతో భారీగా నిధులు వృథా చేస్తోంది...

ఓటీఎస్‌ పేరుతో ఆర్భాటం

 రూ.20 అయ్యే పేపరుకు రూ.68 ఖర్చు

 రిజిస్ర్టేషన్‌ పత్రం ఇస్తే సరిపోయేదానికి 

 ఫోల్డర్‌, సీఎం సందేశమంటూ హంగామా

 50 లక్షల మందికి రూ.34 కోట్లు ఖర్చు

 ఫోల్డర్‌పై వైసీపీ జెండాను పోలిన రంగులు 

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఎప్పుడో కట్టుకున్న పేదల ఇళ్లకు ఓటీఎస్‌ కింద నగదు వసూలు చేస్తున్న ప్రభుత్వం ఈ పథకం పేరుతో భారీగా నిధులు వృథా చేస్తోంది. రూ.10 నుంచి రూ.20 లోపు అయ్యే దానికి రూ.68 ఖర్చు చేస్తోంది. రిజిస్ర్టేషన్‌ పేపరు ఇస్తే సరిపోయేదానికి ఫోల్డర్లు, సీఎం సందేశం అంటూ ఆర్భాటం చేస్తోంది. రిజిస్ర్టేషన్‌ పేపర్లు, ఫోల్డర్లకు దాదాపు రూ.34 కోట్లు ఖర్చు చేస్తోంది. వాస్తవానికి వారికిచ్చే స్టాంపు పేపరు ధర రూ.10 కాగా, ఇతరత్రా పేపర్ల ఖర్చు మరో రూ.10కు మించి ఉండదు. కానీ గృహ నిర్మాణ శాఖ ఒక్కో లబ్ధిదారునికి ఇచ్చే పేపర్ల కోసం రూ.68 వెచ్చిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల మందికి మొత్తంగా రూ.34 కోట్లు ఖర్చు చేస్తోంది. వాస్తవంగా లబ్ధిదారులకు అవసరమైనంత వరకు పేపర్లు ఇస్తే గరిష్ఠంగా రూ.10 కోట్ల లోపలే ఖర్చు అవుతుంది. కానీ ఫోల్డర్లు, సీఎం సందేశం అంటూ దాదాపు రూ.25 కోట్లను గృహనిర్మాణ శాఖ వృథా చేస్తోంది. అసలే ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ప్రభుత్వం పేదల నుంచి బకాయిలు వసూలు చేసే పథకానికి ఈ వృథా ఖర్చులు అవసరమా? అనే విమర్శలు వస్తున్నాయి. పేదలకు రిజిస్ర్టేషన్‌ పేపర్లు ఇస్తే సరిపోయే దానికి ఫోల్డర్‌ అంటూ రెండు కాగితాలను తయారు చేసి, దానిపై వైసీపీ జెండాను పోలిన రంగులు వేయడం మరో వివాదంగా మారుతోంది. గతంలో కోర్టు చీవాట్లు పెట్టడంతో ప్రభుత్వం ఈ సారి ముందుగానే జాగ్రత్త పడింది. స్టాంపు పేపర్లపై రంగులు వేయకుండా, ప్రత్యామ్నాయంగా ఫోల్డర్లపై రంగులు వేస్తూ పార్టీకి ప్రచారం చేస్తోంది. కాగా ప్రతిదీ పారదర్శకం అని చెప్పే ప్రభుత్వం రూ.34 కోట్ల ఖర్చుకు సంబంధించిన టెండర్లను గృహ నిర్మాణ శాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. గృహ నిర్మాణ శాఖ రూపొందించిన ఫోల్డర్‌ తరహా పేపరుకు అంత ఖర్చు అయ్యే అవకాశం లేదు. దాంతో పాటు ఇచ్చే సీఎం సందేశం లేఖ రెండింటికీ కలిపినా రూ.40పైగా ఎందుకు ఖర్చు అవుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే హౌసింగ్‌ అధికారులపై అవినీతి ఆరోపణలు పెరిగిపోయాయి. పోస్టింగుల విషయంలో భారీగా నగదు చేతులు మారిందని ఆరోపణలు, ఆడియోల లీకులు వస్తుండగా, ఈ రహస్య టెండర్లు మరిన్ని అనుమానాలు పెంచుతున్నాయి. 

Updated Date - 2021-12-07T07:44:14+05:30 IST