నీరు-చెట్టు పనుల్లో.. బిల్లులు అడిగితే వేధింపులే!?

ABN , First Publish Date - 2021-11-02T08:43:35+05:30 IST

నీరు-చెట్టు పథకం కింద పనులు పూర్తి చేసినా బిల్లులు చెల్లించడం లేదంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కాంట్రాక్టర్లపై వైసీపీ ప్రభుత్వం ప్రతీకారానికి దిగిందన్న విమర్శలు వస్తున్నాయి. పనులు చేసి రెండున్నరేళ్లు దాటిన తర్వాత ఇప్పుడు తనిఖీల

నీరు-చెట్టు పనుల్లో.. బిల్లులు అడిగితే వేధింపులే!?


  • కోర్టుకెళ్లినందుకు ప్రభుత్వ ప్రతీకారం?
  • రెండున్నరేళ్ల తర్వాత పనుల తనిఖీకి జలవనరుల శాఖకు ఆదేశం
  • 10 లక్షల్లోపు ‘నామినేషన్‌’ పనుల తనిఖీలు
  • కొలతలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి
  • కలెక్టర్లకు ఆ శాఖ కార్యదర్శి మెమో
  • సాగునీటి సంఘాల సమాఖ్య ఆగ్రహం


అమరావతి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): నీరు-చెట్టు పథకం కింద పనులు పూర్తి చేసినా బిల్లులు చెల్లించడం లేదంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కాంట్రాక్టర్లపై వైసీపీ ప్రభుత్వం ప్రతీకారానికి దిగిందన్న విమర్శలు వస్తున్నాయి. పనులు చేసి రెండున్నరేళ్లు దాటిన తర్వాత ఇప్పుడు తనిఖీల పేరిట వేధింపులు తీవ్రతరం చేసింది. నీరు-చెట్టు కింద పది లక్షల రూపాయలలోపు విలువజేసే పనులకు ఇంకా బిల్లులు చెల్లించకపోతే.. వాటన్నిటినీ తనిఖీ చేయాలని జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు సోమవారం జిల్లా కలెక్టర్లకు మెమో జారీచేశారు. రూ.పది లక్షల లోపు ఉన్న పనులకు సాంకేతిక, పరిపాలనా అనుమతులు ఇవ్వడంపైనా దృష్టి సారించాలని సూచించారు. అదేవిధంగా పది లక్షల రూపాయలలోపు పనులకు నామినేషన్‌ పద్ధతిలో అప్పగించడంపైనా లోతైన తనిఖీ చేయాలన్నారు., జన్మభూమి కమిటీలు, నీటి వినియోగ సంఘాలు తప్ప మిగిలిన వారికి పనులు అప్పగించడంపైన, పనుల కొలత విషయంలో చేసిన పొరపాట్లపైనా దృష్టి సారించాలని పేర్కొన్నారు. చేసిన పనుల కంటే ఎక్కువ కొలతలు వేయడాన్ని పరిశీలించాలని.. పనులు చేయకుండానే బిల్లులు చెల్లించాలంటూ చేసిన సిఫారసులపై చర్యలు కోరుతూ నివేదిక పంపాలని కోరారు. నాణ్యతా ప్రమాణాలు లేని పనుల వివరాల సమాచారం అందించాలన్నారు.


చెక్‌డ్యామ్‌లకు 500 మీటర్లలోపు చేపట్టిన పనులు, నీటి వనరులు లేని చోట నిర్మించిన పనుల వివరాలు సమర్పించాలని మార్గదర్శకాల్లో నిర్దేశించారు. ఈ ఉత్తర్వులపై సాగునీటి వినియోగ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల గోపాలకృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కోసం కోర్టును ఆశ్రయించడమే తప్పన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఇందుకు జల వనరుల శాఖ కార్యదర్శి మెమోనే ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-02T08:43:35+05:30 IST