కమీషన్ల కోసమే తెగనమ్మారు

ABN , First Publish Date - 2021-12-28T08:09:30+05:30 IST

‘‘గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాను పప్పుబెల్లాలకు తెగనమ్మేశారు. ప్రభుత్వానికి ఉన్న 10.4 శాతం వాటా విక్రయానికి బహిరంగ బిడ్‌, బహిరంగ వేలం పద్ధతిలో వెళ్లాలని ఉన్నతాధికారుల సాధికార కమిటీ సూచించినా...

కమీషన్ల కోసమే తెగనమ్మారు

‘గంగవరం’ వాటాలను అదానీకి పప్పు బెల్లాలకు ఇచ్చేశారు: పట్టాభి

అమరావతి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): ‘‘గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాను పప్పుబెల్లాలకు తెగనమ్మేశారు. ప్రభుత్వానికి ఉన్న 10.4 శాతం వాటా విక్రయానికి బహిరంగ బిడ్‌, బహిరంగ వేలం పద్ధతిలో వెళ్లాలని ఉన్నతాధికారుల సాధికార కమిటీ సూచించినా...ప్రభుత్వం అమలు చేయలేదు. అదానీకి రూ.645 కోట్ల నామమాత్రపు ధరకు కట్టబెట్టేశారు. సీఎం జగన్‌రెడ్డి స్వార్ధంతోనే ఇదంతా చేశారు. ఇంకో 37 ఏళ్లు నిరంతర ఆదాయం అందించే బంగారుబాతు లాంటి పోర్టును కమీషన్ల కోసం తెగనమ్మారు. న్యాయసమీక్ష చట్టం ప్రకారం రూ.100 కోట్ల పైబడిన ఏ టెండరు అయినా బహిరంగ వేలం ద్వారా జరగాలన్న అంశాన్నీ పట్టించుకోలేదు. ఈ వ్యవహారాన్ని న్యాయసమీక్షకూ పంపించలేదు’’అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ వెల్లడించారు. ‘‘గంగవరం పోర్టు పబ్లిక్‌-ప్రైవేట్‌ భాగస్వామ్యంతో ఏర్పాటుచేయడంతో దానిలో ప్రభుత్వానికి 10.4 శాతం వాటా, 2.1 శాతం ఆదాయంలో వాటాలు ఉన్నాయి. టెండర్లను దక్కించుకున్న డీవీఎస్‌ రాజు కంపెనీ నిర్మాణం పూర్తిచేసింది. ఇప్పుడు ఇందులో ఉన్న ప్రభుత్వ వాటాను అదానీ గ్రూప్‌కు రాష్ట్ర ప్రభుత్వం అమ్మేయడం వెనక పెద్ద త తంగమే నడిచింది. 


తొలుత డీవీఎస్‌ రాజు కుటుంబానికి ఉన్న 58.1 శాతం, విండీ లేక్‌సైడ్‌కు ఉన్న 31.5 శాతం, ఏపీ ప్రభుత్వానికి ఉన్న 10.4 శాతం వాటాల కొనుగోలుకు అదానీ పోర్ట్స్‌ సెజ్‌ ఇచ్చిన ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం జీవో నం.4ను 25.5.2021న విడుదల చేసింది. అనంతరం ఒక్కో వాటా రూ.120 చొప్పున ప్రభుత్వానికి చెందిన వాటాలను రూ.645 కోట్లకు కొనుగోలు చేస్తానని అదానీ సెజ్‌ ప్రతిపాదన ఇచ్చింది. దీనిపై పరిశీలనకు ప్రభుత్వం జీవో నం.5 ద్వారా కార్యదర్శుల బృందంతో కూడిన సాధికార కమిటీని నియమించింది. ఈ కమిటీ బహిరంగ బిడ్‌ ద్వారా ప్రభుత్వ వాటాను అమ్మాలని సిఫార్సు చేసింది. ఓపెన్‌ బిడ్‌ ద్వారా అమ్మాలన్న  కమిటీ సిఫార్సులు, దాన్ని అధిగమించేందుకు లీగల్‌ ఒపీనియన్‌ తీసుకున్న అంశాలను ప్రస్తావిస్తూ...‘‘అదానీకి నేరుగా అమ్మేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తూ జీవో నం.12ను ఆగస్టు 23న విడుదల చేసింది. అయితే అప్పటికే తాను విడుదల చేసే ఏ జీవోలు ప్రజలకు అందుబాటులో ఉంచకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలాంటి వ్యవహారాలన్నీ దాచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు’’ అని ఆరోపించారు. 

Updated Date - 2021-12-28T08:09:30+05:30 IST