చంద్రబాబు వస్తేనే.. రాష్ట్రానికి భవిష్యత్తు

ABN , First Publish Date - 2021-04-21T10:06:18+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డెబ్భై సంవత్సరాలు నిండి మంగళవారం డెబ్భై ఒకటో ఏట అడుగు పెట్టారు. కరోనా విజృంభణను దృష్టిలో ఉంచుకొని తన జన్మదిన వేడుకలు ఎక్కడా జరపవద్దని ముందుగానే పిలుపునిచ్చిన ఆయన...

చంద్రబాబు వస్తేనే.. రాష్ట్రానికి భవిష్యత్తు

  • -మళ్లీ గాడిలో పెట్టే శక్తి ఆయనకే ఉంది
  • ఆయన ఆయురారోగ్యాలతో నూరేళ్లుండాలి
  • -తెలుగుదేశం పార్టీ నేతల ఆకాంక్ష
  • -ఎన్టీఆర్‌ భవన్‌లో జన్మదిన కార్యక్రమం
  • -రోజంతా ఇంట్లోనే తెలుగుదేశం అధినేత
  • -కరోనా నేపథ్యంలో పుట్టినరోజు వేడుకలు రద్దు

అమరావతి, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డెబ్భై సంవత్సరాలు నిండి మంగళవారం డెబ్భై ఒకటో ఏట అడుగు పెట్టారు. కరోనా విజృంభణను దృష్టిలో ఉంచుకొని తన జన్మదిన వేడుకలు ఎక్కడా జరపవద్దని ముందుగానే పిలుపునిచ్చిన ఆయన దానికి కట్టుబడి మంగళవారం పూర్తిగా హైదరాబాద్‌లోని తన నివాసానికి పరిమితమయ్యారు. శుభాకాంక్షలు తెలపడానికి ఎవరూ రావద్దని ముందుగానే గట్టిగా చెప్పడంతో పార్టీ శ్రేణులు, బంధుమిత్రులు ఎవరూ రాలేదు. ఆయనకు సన్నిహితులైన రాజకీయ ప్రముఖులు ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు.  


అభివృద్ధికి చిరునామా చంద్రబాబు.. 

కరోనా కారణంగా తన జన్మదిన వేడుకలు జరపవద్దని చంద్రబాబు పిలుపు ఇవ్వడంతో టీడీపీ నేతలు ఇక్కడ ఎన్టీఆర్‌ భవన్‌లో నిరాడంబరంగా ఆయన జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ పి.అశోక్‌ బాబు మాట్లాడుతూ చంద్రబాబు వస్తేనే రాష్ట్రానికి మళ్లీ భవిష్యత్తు వస్తుందన్నారు.  రాష్ట్రం గాడిలో పడాలంటే ఆయన రావాల్సిన అవసరం ఉందని చెప్పారు.  చంద్రబాబు అంటే అభివృద్ధికి చిరునామా అని మరో ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్‌ కొనియాడారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌, తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి, అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం, పార్టీ కార్య నిర్వాహక కార్యదర్శులు బుచ్చిరాం ప్రసాద్‌, నాదెండ్ల బ్రహ్మం, మీడియా విభాగం ఇన్‌చార్జి దారపునేని నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.


నిండు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలి: జగన్‌

గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌.. చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతి శ్రీవెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ఆరోగ్యకరంగా ఆయన ప్రజాసేవలో సుదీర్ఘకాలం ఉండాలని ట్విటర్‌ ద్వారా గవర్నర్‌ ఆకాంక్షించారు. ‘చంద్రబాబుగారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు. ఆ దేవుని ఆశీస్సులతో నిండు ఆరోగ్యంతో మీరు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను’ అని జగన్‌ ట్వీట్‌ చేశారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో, ప్రజా జీవితంలో తనదైన స్థానాన్ని కలిగిన చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని పవన్‌కల్యాణ్‌ ఓ ప్రకటనలో ఆకాంక్షించారు. 


శ్రీరాముడి ఆశీస్సులు అందరికీ ఉండాలి: చంద్రబాబు

అమరావతి, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): శ్రీరాముడి ఆశీస్సులు తెలుగు ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆకాంక్షించారు. బుఽధవారం శ్రీరామనవమి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ, నవమి వేడుకలు జరుపుకోవాలని సూచించారు. యువతీయువకులు సీతారాములను ఆదర్శంగా తీసుకుని, కష్టసుఖాల్లో తోడూనీడగా ఉంటూ ముందుకు సాగాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.


రాహుల్‌ త్వరగా కోలుకోవాలి

కోవిడ్‌ బారినపడిన కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీ త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. రాహుల్‌గాంధీ మంచి ఆరోగ్యంతో ఉండేలా చూడాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు మంగళవారం చంద్రబాబు ట్వీట్‌ చేశారు. సీనియర్‌ జర్నలిస్టు అమరనాథ్‌ మృతిపై చంద్రబాబు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కరోనాతో అమరనాథ్‌ మరణించడం బాధాకరమని, ఆయన మరణం పాత్రికేయ రంగానికే కాకుండా, సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు.

Updated Date - 2021-04-21T10:06:18+05:30 IST