పీఆర్సీపై పాత పాటే!

ABN , First Publish Date - 2021-12-31T07:55:49+05:30 IST

పీఆర్సీపై పాత పాటే!

పీఆర్సీపై పాత పాటే!

ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న అధికారులు

ఇది చెప్పడానికైతే చర్చలక్కర్లేదన్న సంఘాలు

పీఆర్సీ 14.29 శాతమే ఇస్తామంటే కుదరదు

ఫిట్‌మెంట్‌తోపాటే హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ కూడా..

ఈ మూడూ ముఖ్యమే.. ఒక్కరోజే తేల్చేయాలి

మీకన్నా గత ప్రభుత్వాల్లోనే మెరుగైన లబ్ధి

మీ వల్ల కానప్పుడు సీఎం వద్దకే తీసుకెళ్లండి

సమావేశంలో అధికారులపై ఆగ్రహావేశాలు


అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం ఫిట్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ అనేవి తమకు ప్రధాన సమస్యలని, ఆ మూడు సమస్యలనీ ఒక్కరోజే తేల్చాలని ఉద్యోగ సంఘాల నేతలు ఆర్థికశాఖ అధికారులకు తేల్చిచెప్పారు. సీఎం సమక్షంలోగానీ, ఇంకోచోట గానీ కేవలం పీఆర్సీపై తేల్చి హెచ్‌ఆర్‌ఏ, సీసీఏను వదిలేస్తామంటే కుదరదని గట్టిగా చెప్పారు. ఈ మూడింట్లో ఏ ఒక్క సమస్య పరిష్కారం కాకపోయినా తాము వేతనం నష్టపోతామని, దీనికి ఉద్యోగులు సిద్ధంగా లేరని తేల్చిచెప్పారు. తమ సమస్యలపై ఎలాంటి పురోగతి లేకుండా ఇ కపై తమను చర్చలకు పిలవొద్దని కూడా స్పష్టం చేశారు. సీఎస్‌ కమిటీ నివేదిక తమకు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని, తమ డిమాండ్లకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడే తమను తిరిగి చర్చలకు పిలవాలని ఆర్థిక అధికారులతో గురువారం జరిగిన సమావేశంలో ఉద్యోగ నేతలు స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మూడు స్లాట్లలో మూడు గ్రూపులుగా అధికారులు ఈ సమావేశం నిర్వహించారు. పాతప్రభుత్వాలు ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇచ్చాయని అధికారులకు ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యోగులకు ప్రస్తుతం అందుతున్న స్థాయి ఆర్థిక ప్రయోజనాలు తమకు పీఆర్సీ అమలుతో అంది తీరాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఉద్యోగుల కంటే ముందుగా ఐఆర్‌ తీసుకుని ఏపీ ఉద్యోగులు లాభపడ్డారంటూ ప్రభుత్వం చేస్తున్న వాదనలో నిజం లేదని, తెలంగాణ ఉద్యోగుల కంటే 9 నెలల ముందుగా ఐఆర్‌ తీసుకున్నప్పటికీ ఆర్థికంగా తామే నష్టపోయామని ఉద్యోగ సంఘాల నేతలు ఆర్థిక శాఖ అధికారులకు వివరించారు. తెలంగాణ ఉద్యోగులకు పీఆర్సీ రూపం లో ఆర్థిక ప్రయోజనాలు రెండేళ్ల నుంచి అందుతున్నాయని, అలా సవరించిన స్కేళ్లపై వాళ్లకు హెచ్‌ఆర్‌ఏ, ఇంక్రిమెంట్లు, డీఏలు లెక్కిస్తున్నారన్నారు. ఈ రకంగా చూస్తే ఏపీలో ప్రతి ఉద్యోగీ ప్రతి నెలా రూ.4,000 నుంచి రూ.5,000 వరకు నష్టపోయారని తెలిపారు. 


కేంద్రం ఇస్తుందనేది తప్పు..

కేంద్రం తన ఉద్యోగులకు కేవలం 14.29 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చిందనడం తప్పని ఉద్యోగ సంఘాల నేతలు... ఆర్థిక శాఖ అధికారులు ఈ సమావేశంలో వివరించారు. కేంద్రం తన ఉద్యోగులకు కనిష్ఠంగా 32 శాతం నుంచి గరిష్ఠంగా 56 శాతం వరకు ఫిట్‌మెంట్‌ ఇచ్చిందని తెలిపారు. కేంద్రం తన లోయర్‌ కేడర్‌ ఉద్యోగులకు 157 శాతం, మిడిల్‌ కేడర్‌ ఉద్యోగులకు 162 శాతం, హయ్యర్‌ కేడర్‌ ఉద్యోగులకు 181 శాతం ఫిట్‌మెంట్‌ను అప్పటికే తీసుకుంటున్న వేతనంలో విలీనం చేశారని చెప్పారు. ఈ ఫిట్‌మెంట్‌ శాతాల్లో అన్ని కేడర్లకు 125 శాతం డీఏ కాగా, మిగిలింది అంతా ఫిట్‌మెంటేనని ఉద్యోగ సంఘాల నేతలు ఆర్థిక శాఖ అఽధికారులకు వివరించారు. దీనిపై అధికారులు స్పందించకుండా... రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ పాతపాట అందుకున్నారు. దీంతో ఉద్యోగ నేతలు ఒక దశలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇది గత సమావేశాల్లో చెప్పిందేగా.. ఇప్పుడేమైనా కొత్తగా చెప్పేదేమైనా ఉందా? అసలు మమ్మల్ని ఈ సమావేశానికి ఎందుకు పిలిచారో చెప్పండ’’ంటూ అధికారులను నిలదీసినట్లు తెలిసింది. దీంతో కంగుతున్న అధికారులు ప్రజాస్వామిక వాతావరణంలో అన్నీ అంశాలు చర్చించుకుందామన్నారు. ‘‘కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉద్యోగులు తీసుకుంటున్న వేతనాలే ఎక్కువగా ఉన్నాయి. గత ప్రభుత్వాల నుంచే వేతనాలు ఎక్కువగా తీసుకుంటున్నారు. సంవత్సరానికి రాష్ట్ర ఆదాయం రూ.1,06,000 కోట్లు. అందులో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలకే రూ. 75,000 కోట్లు అవుతుంది’’ అని అధికారులు వివరించగా, ఉద్యోగ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ దగ్గర కూడా లెక్కలు ఉన్నాయని, వేతనాలకు ఇచ్చేదాని కన్నా ఎక్కువగా చెబుతున్నారని బదులిచ్చారు. ‘‘సీఎం వద్ద వారంలో పీఆర్సీపై సమావేశం ఏర్పాటు చేస్తానని సీఎస్‌ గతంలో జరిగిన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో హామీ ఇచ్చారు. అది జరగలేదని.. మళ్లీ చర్చలు అంటూ ఆర్థికశాఖ అధికారులతో ఏర్పాటు చేశారు. గత సమావేశానికి ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. మా సమస్యల పరిష్కారం మీ పరిధిలో లేదు కాబట్టి సీఎంతో సమావేశం ఏర్పాటు చేయండి’’ అని ఉద్యోగసంఘాల నేతలు అధికారులను అడిగారు. త్వరలో అందుకు ఏర్పాటు చేస్తామని అధికారులు... ఉద్యోగ సంఘాల నేతలకు చెప్పి సమావేశం ముగించారు. 

Updated Date - 2021-12-31T07:55:49+05:30 IST