పారని పథకాలు

ABN , First Publish Date - 2021-05-30T08:06:22+05:30 IST

కొత్త ప్రభుత్వం వచ్చింది. పాత పథకాలకు పాతరేసింది. మంచి చెడ్డలతో సంబంధం లేకుండా పేదలకు అండగా నిలిచిన అనేక పథకాలకు మంగళం పలికింది

పారని పథకాలు

అన్నొచ్చాడు..ఆపేశాడు!

ఉన్న పథకాలన్నీ ఊడ్చి ‘నవరత్నాల’ ఊసులు

ప్రకటనల్లోనే వధూవరులకు ‘వైఎస్సార్‌ కానుక’

పేద విద్యార్థుల ‘విదేశీ విద్య’కూ అదే గతి..

పేదలకు కార్పొరేట్‌ విద్య దూరం

రైతు రథం సహా సాగు యాంత్రీకరణకు స్వస్తి

కరోనాలో ఆదుకోకపోగా ‘కార్మికుల’ నిధులూ మళ్లింపు

కేంద్రం అందించే ‘ఆత్మనిర్భర్‌’ సాయానికీ కొర్రీలు

అన్న క్యాంటీన్ల మూతతో కరోనాలో ఆకలి కేకలు


(అమరావతి - ఆంధ్రజ్యోతి) 

కొత్త ప్రభుత్వం వచ్చింది. పాత పథకాలకు పాతరేసింది. మంచి చెడ్డలతో సంబంధం లేకుండా పేదలకు అండగా నిలిచిన అనేక పథకాలకు మంగళం పలికింది. మంచీ-చెడులతో సంబంధం లేకుండా గత ప్రభుత్వ ముద్ర అంటూ లేకుండా రూపుమాపింది. ‘నవరత్నాలు’ మాత్రమే చాలు  అంటూ... ప్రజల ఉత్పత్తికి, ఉత్పాదకతకు, ఉపాధికి, విద్యాభివృద్ధికీ దోహదపడే అనేక సంక్షేమ పథకాలను ఈ రెండేళ్లలో అటకెక్కించారు. కొన్నింటి రూపు మార్చి... ‘క్యాష్‌ కొట్టే’ పథకాలుగా మార్చారు. రెండేళ్లలో కాలగర్భంలో కలిసిపోయిన పథకాల వివరాలివి...


కార్మికులకు కన్నీరే..

కరోనానో, మరో కష్టమో వచ్చినప్పుడు భవన నిర్మాణ కార్మికులను ఆదుకొనే నిధి అది. స్వయంగా భవన నిర్మాణదారుల నుంచి వసూలు చేసిన ఒకశాతం సెస్‌ ఈ నిధికి జమ అవుతుంది. ఈ నిధిని నిర్వహించడానికి ఏపీ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఉంది. ఇప్పుడు కరోనా విజృంభిస్తోంది కదా! ఇలాంటప్పుడు ఆదుకొంటుందని పోగుచేసిన ‘నిధి’ని ప్రభుత్వం ఇప్పటికే వేరే అవసరాలకు మళ్లించేసింది. దీంతో కరోనాలో పనులు లేక దాదాపు 20 లక్షలమంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డునపడ్డారు. రాష్ట్ర విభజన సమయానికి బోర్డు వద్ద రూ.800 కోట్ల నిధులు నిల్వ ఉన్నాయి. ఆ నిధుల నుంచి ప్రభుత్వం అప్పట్లో ‘చంద్రన్న బీమా’ ప్రీమియం చెల్లించేందుకు బోర్డు నుంచి అప్పుగా తీసుకుంది. బోర్డు నిధులను తిరిగి చెల్లించి సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సిన ప్రభుత్వం... అవేవీ పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకొంది. దీంతో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటీ అమలు కావడం లేదు. 


అన్నం పెట్టే క్యాంటీన్లకూ తాళం

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌.. గత ప్రభుత్వం పెట్టిన ‘అమ్మ క్యాంటీన్లు’ కొనసాగిస్తామని ఇటీవల ప్రకటించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మాత్రం.. 2019లో గద్దెనెక్కీ ఎక్కగానే రాత్రికి రాత్రే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 200 పైచిలుకు అన్న క్యాంటీన్లను మూసివేయించింది! క్యాంటీన్లను పూర్తిగా మూసివేయలేదని, వాటి ఏర్పాటులో అప్పటి ప్రభుత్వం పలు పొరపాట్లు చేసిందని, వాటిని సరి చేసి అతి త్వరలోనే పునఃప్రారంభిస్తామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులు దాదాపు రెండేళ్ల కిందట చెప్పారు. ఇప్పటికీ... ‘సరిచేసే’ ప్రక్రియ పూర్తికానే లేదు. ప్రస్తుతం అన్న క్యాంటీన్‌ భవనాల్లో చాలావాటిని వార్డు సచివాలయాలుగా ప్రభుత్వం మార్చేస్తోంది.  


‘కానుక’ అందేనా?

నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్లు భారం కాకుండా ఉండేందుకు తెచ్చిన పథకం ‘చంద్రన్న పెళ్లికానుక’. ఈ ప్రభుత్వం దానిని ‘వైఎస్సార్‌ పెళ్లికానుక’గా మార్చి ంది. పోనీలే పేరు మారినా కానుక వస్తుంది కదా అన్న ఆనందాన్ని ఆవిరి చేస్తూ పథకాన్ని పూర్తిగా అటకెక్కించింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది (అక్టోబరు)లోనే ‘వైఎస్సార్‌ పెళ్లి కానుక’ మొత్తం పెంచుతూ ఉత్తర్వులు తెచ్చారు. 2020 ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి పెంచిన ‘కానుక’తో కలుపుకొని పథకాన్ని అమలు చేస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే చెప్పినరోజున పథకం ప్రారంభం కాలేదు. ఆ ఏడాది నవంబరు 11న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ స్వయంగా ‘కానుక’పై ప్రకటన చేశారు. గతంలో పెండింగ్‌లో ఉన్న పెళ్లి కానుక, తన ప్రభుత్వం వచ్చిన తర్వాత మంజూరైన పెళ్లికానుక లబ్ధిదారులకు ఈ ఏడాది మార్చి దాకా ఇవ్వలేమని ప్రకటించారు. అంటే ఈ ఏడాది బడ్జెట్‌ తర్వాత అయినా ఈ పథకం అమల్లోకి వస్తుందని అంతా భావించారు. ఇప్పటికి రెండు నెలలవుతున్నా వాటి ఊసే లేదు. 


ప్రమాదంలో ‘పేదల చదువు’

మెరికల్లాంటి పేదవిద్యార్థులను ఏటా సుమారు లక్షమందిని ప్రభుత్వమే ఎంపిక చేసి కార్పొరేట్‌ స్కూళ్లలో వారికి నాణ్యమైన విద్య అందించే కార్యక్రమం.. ‘బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ పథకం’. దీనికీ మంగళం పాడేశారు. ఇటీవల సంక్షేమ విద్యా పథకాలపై సమీక్ష సందర్భంగా ఈ స్కూళ్ల ప్రస్తావన వచ్చింది. ‘మనం అమ్మఒడి ఇస్తున్నాం కదా. మళ్లీ బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లు ఎందుకు? రద్దు చేయండి’ అని సీఎం జగన్‌ ఆదేశించారు. మరోవైపు ఈ పథకం కింద కార్పొరేట్‌ స్కూళ్లకు చెల్లించాల్సిన రూ.150 కోట్లను పెండింగ్‌లో పెట్టేశారు.


నడి సంద్రంలో విదేశీ విద్య

విదేశీవిద్య అనేది ఎవరికైనా కలే. పేద, బీసీ, ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకైతే అది మరింత కష్టమైన కల. ఇలాంటి విద్యార్థుల కలలను తీర్చడంతోపాటు, అత్యుత్తమ మానవవనరులను రాష్ట్రానికి అందించడంకోసం గత ప్రభుత్వం తెచ్చినదే ‘విదేశీ విద్యాపథకం’. బీసీలకు ‘ఎన్టీఆర్‌ విదేశీ విద్యాదరణ’, ఎస్సీ, ఎస్టీలకు ‘అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి’ పేరిట 2016-17 నుంచి అమలు చేస్తున్న పథకం ఇది. విదేశీ విద్యా పథకాన్ని కొనసాగిస్తామని ప్రకటించి సీఎం జగన్‌ ప్రభుత్వ పగ్గాలు చేపట్టారు. తొలి బడ్జెట్‌లో ఆర్భాటంగా నిధులు కూడా కేటాయించారు. కానీ, ఇంతవరకు ఒక్క పైసా విడుదల కాలేదు. కానీ, బడ్జెట్‌ కేటాయింపులతో ఈ పథకం అమల్లో ఉందని భావించిన అధికార యంత్రాంగం.. ఈబీసీ విదార్థులకు ఇంటర్వ్యూలు జరిపి 800 మందిని ఎంపిక చేసింది. ప్రభుత్వాన్ని నమ్మివిదేశీ చదువుల కోసం వెళ్లారు. వీరందరికీ ప్రభుత్వం రూ.10 లక్షలు చొప్పున అందించాలి. ఎంతకీ ఆ డబ్బులు రీయింబర్స్‌ కాకపోవడంతో విద్యార్థులూ, తల్లిదండ్రులూ ఇక్కట్లు పడుతున్నారు.

Updated Date - 2021-05-30T08:06:22+05:30 IST