క్యాష్‌ కాదు.. షేర్‌!

ABN , First Publish Date - 2021-05-08T08:22:00+05:30 IST

గంగవరం పోర్టులో డీవీఎస్‌ రాజు, ఆయన కుటుంబానికి 89.6శాతం వాటా ఉండేది. దీనిని అదానీ సంస్థ రూ.3,604కోట్లకు సొంతం చేసుకుంది

క్యాష్‌ కాదు.. షేర్‌!

డీవీఎస్‌ రాజుకు చెల్లింపుల్లో ‘అదానీ’ మెలిక.. 6:1 నిష్పత్తిలో షేర్లు ఇస్తామని వెల్లడి

ఏడాదిలో మూడింతలు పెరిగిన అదానీ షేరు

అందుకు గంగవరం కొనుగోలూ ఒక కారణం

ఇప్పుడు పెరిగిన ధరతోనే లెక్కకడుతున్న వైనం

‘లాకిన్‌’ పీరియడ్‌లో అమ్ముకోవడం కుదరదు

దిక్కుతోచని స్థితిలో డీవీఎస్‌ రాజు కుటుంబం

కనీసం సగమైనా నగదు ఇవ్వాలని ‘విన్నపం’

డీల్‌పై కొనసాగుతున్న చర్చలు


ఒక కంపెనీని మరొక కంపెనీ కొనుగోలు చేయడం సర్వసాధారణమే! అయితే... గంగవరం పోర్టును అదానీ సంస్థ సొంతం చేసుకోవడం సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఇదే ‘డీల్‌’ మరోసారి కార్పొరేట్‌ వర్గాల్లో పెద్ద చర్చకు తెరలేపింది. ఎందుకంటే... అదానీకి గంగవరం పోర్టును సమర్పించుకున్న డీవీఎస్‌ రాజుకు దక్కేది డబ్బులు కాదు! అదానీ కంపెనీ (అదానీ పోర్ట్స్‌ సెజ్‌ - ఏపీసెజ్‌) షేర్లు! ‘నగదుకు బదులు మా షేర్లు ఇస్తాం. వాటితో సర్దుకోండి’ అని అదానీ సంస్థ చెబుతున్నట్లు తెలుస్తోంది.


(అమరావతి/విశాఖపట్నం/హైదరాబాద్‌ బిజినెస్‌ బ్యూరో- ఆంధ్రజ్యోతి)

గంగవరం పోర్టులో డీవీఎస్‌ రాజు, ఆయన కుటుంబానికి 89.6శాతం వాటా ఉండేది. దీనిని అదానీ సంస్థ రూ.3,604కోట్లకు సొంతం చేసుకుంది. ఈ మొత్తాన్ని నగదు రూపంలో చెల్లిస్తారని అప్పట్లో కార్పొరేట్‌ వర్గాల్లో ప్రచారం జరిగింది. కానీ... ఇప్పుడు ‘పద్ధతి’ మార్చారట! ఈ సొమ్మును నగదు రూపంలో కాకుండా... తమ కంపెనీ షేర్ల రూపంలో ఇస్తామని అదానీ సంస్థ ప్రతిపాదించినట్లు తెలిసింది. గంగవరం పోర్టులో పెయిడప్‌ కేపిటల్‌ కింద 51.7 కోట్ల వాటాలు ఉన్నాయి. అందులో డీవీఎస్‌ రాజుకు 30 కోట్ల వాటాలు ఉండేవి. ఒక్కో షేరుకు రూ.120 చొప్పున వెలకట్టి... అదానీ వాటిని సొంతం చేసుకుంది. అంటే డీవీఎస్‌ రాజు ఇచ్చిన 30 కోట్ల గంగవరం పోర్టు షేర్లకు బదులుగా... 5 కోట్ల అదానీ షేర్లు తీసుకోవాలన్న మాట! ప్రస్తుతం అదానీ గ్రూపుషేరు మార్కెట్‌లో సుమారు రూ.755 పలుకుతోంది. ఈ లెక్కన... గంగవరం పోర్టు లిమిటెడ్‌ ఆరు షేర్లు ఒక్క అదానీ షేర్‌తో సమానం! డీవీఎస్‌ రాజుకు ఇవ్వాల్సిన సొమ్ములను ఇలా షేర్లతో సరిపెడతారన్నమాట! 


అంతగా ఎలా పెరిగిందంటే...

అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (ఏపీ సెజ్‌) షేరు వాటా ఏడాది క్రితం సుమారు రూ.250మాత్రమే. ఇప్పుడు దాదాపు మూడు రెట్లు పెరిగి రూ.755కు చేరుకుంది. ఎలాగంటారా.. దేశంలోని ఒక్కో పోర్టును సొంతం చేసుకుంటున్నామనే ప్రతిపాదనలు, ఒప్పందాలతో అదానీ షేర్‌ వ్యాల్యూ చూస్తుండగానే పెరిగింది. ఇలా పెరగడానికి గంగవరం పోర్టు కొనుగోలు కూడా ఒక కారణం! ఎవరివల్ల తన షేర్‌ విలువ పెరిగిందో... వారికి ఇవ్వాల్సిన నగదుకు బదులు వ్యాల్యూ పెరిగిన షేర్లు ఇస్తామనడమే ఇక్కడ విశేషం. ఇదే డీల్‌ ఏడాది క్రితం జరిగి ఉంటే... గంగవరం పోర్టులో ఆరు షేర్లకు అదానీ మూడు షేర్లు ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు... ఆరుకు ఒక్కటి మాత్రమే సరిపోతోంది.


అయితే... నష్టమేమిటి?: నగదుకు బదులు షేర్లు ఇస్తే నష్టమేమిటి? వాటిని వెంటనే అమ్ముకుని ‘క్యాష్‌’ చేసుకోవచ్చు కదా! అనే సందేహం రావొచ్చు. కానీ... కార్పొరేట్‌ డీల్స్‌ ఇలా ఉండవు. ఒకేసారి కోట్ల షేర్లు అమ్మకానికి పెడితే మొత్తానికే తేడా వస్తుంది. కంపెనీ షేర్‌ వ్యాల్యూ పడిపోతుంది. అందుకే, ఇలాంటి డీల్స్‌లో ‘లాకిన్‌’ పీరియడ్‌ పెడతారు. అది ఒక ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు.. వారి ఒప్పందాన్ని బట్టి లాకిన్‌ పీరియడ్‌ ఉంటుంది. ఆ గడువు ముగిసేదాకా వాటాలు అమ్ముకోవడానికి వీల్లేదు. అప్పటిదాకా మార్కెట్‌లో వాటి విలువను చూసుకుంటూ ఉండాలి. షేర్‌ వ్యాల్యూ ఈ రోజు ఉన్నది రేపు ఉండదు. పెరగవచ్చు... జరగరానిది జరిగితే తరిగిపోనూ వచ్చు. మార్కెట్‌లో ఒడిదుడుకులు షేర్‌ మార్కెట్‌ను బాగా ప్రభావితం చేస్తాయి. ఆ లెక్కన... ఇప్పుడు రూ.755 ఉన్న అదానీ షేర్‌ వ్యాల్యూ లాకిన్‌ వ్యాల్యూ తర్వాత పెరిగి ఉంటే, డీవీఎస్‌ రాజుకు లాభం! పడిపోతే... నష్టం! అదానీ షేర్‌ విలువ గరిష్ఠంగా రూ.885 వరకు వెళ్లి, ఇప్పుడు రూ.755 వద్దకు రావడం గమనార్హం. 


సగమైనా నగదు కావాలని... 

‘నగదుకు బదులు షేర్లు’ అనే ప్రతిపాదనకు డీవీఎస్‌ రాజు కుటుంబం ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. కనీసం.. సగమైనా నగదు రూపంలో ఇచ్చి, మిగిలిన మొత్తానికి షేర్లు కేటాయించాలని కోరుతున్నట్లు ‘మనీ  కంట్రోల్‌’ వెబ్‌సైట్‌ ఒక కథనంలో పేర్కొంది. ఇందుకు అదానీ కంపెనీ అంగీకరిస్తుందా... లేదో చూడాలి! దీనిపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం! లాభాలు గ్యారంటీగా వచ్చే గంగవరం పోర్టులో వాటాలు అమ్ముకోవడమే డీవీఎస్‌ రాజు కుటుంబానికి ఇష్టం లేదని... తప్పని పరిస్థితుల్లోనూ అదానీకి అప్పగించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు చెల్లింపుల్లోనూ మెలిక పెట్టడంతో డీవీఎస్‌ రాజు కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నట్లు చెబుతున్నారు. 


మయన్మార్‌ లింకు?

మయన్మార్‌తో అదానీ పోర్ట్స్‌కు వ్యాపార ఒప్పందాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పుడు ఆ దేశం సైనిక పాలనలోకి వెళ్లింది. అక్కడ సైన్యం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడతుండటంతో... ఆ దేశంతో సంబంధమున్న ఆదానీ పోర్ట్స్‌ను సస్టయినబుల్‌ ఇండెక్స్‌ నుంచి తొలగిస్తున్నట్లు గత నెలలో ఎస్‌ అండ్‌ పీ డోజోన్స్‌ ఇండైసెస్‌ ప్రకటించింది. దీంతోపాటు మానవ హక్కుల ఉల్లంఘన అంశం ఆధారంగానే నార్వే బ్యాంకు డీఎన్‌బీ ఏఎ్‌సఏ, ఫిన్‌లాండ్‌కు చెందిన నార్డియా బ్యాంకులు అదానీ పోర్ట్స్‌లో వాటాను విక్రయించినట్లు రిపోర్టులు ఉన్నాయి. ఇవన్నీ అదానీ షేర్‌ విలువపై కచ్చితంగా ప్రభావితం చూపేవే. ఈ క్రమంలో అదానీ పోర్ట్స్‌ షేర్ల విలువ తగ్గుతుందనే అంచనాతో.... డీవీఎస్‌ రాజుకు నగదు కాకుండా షేర్లు కట్టబెట్టాలని భావిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. 

Updated Date - 2021-05-08T08:22:00+05:30 IST